logo

పింఛన్‌ పండగొచ్చింది

అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు.

Updated : 01 Jul 2024 05:28 IST

పెనుమాకలో ఇద్దరు పింఛనుదారులకు నగదు అందజేయనున్న సీఎం చంద్రబాబు
ఇంటికే వెళ్లి ఒక్క రోజులో పంపిణీకి ఏర్పాట్లు 
జిల్లాపరిషత్తు(గుంటూరు), తాడేపల్లి, న్యూస్‌టుడే

ధికారంలోకి వచ్చిన వెంటనే పింఛను రూ.4వేలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన రోజునే పింఛన్ల పెంపుపై సంతకం చేసి ఇచ్చిన మాట నెలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన పింఛన్లు మొత్తాన్ని ఇంటింటికీ పంపిణీ చేసేందుకు అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఒకటో తేదీ ఎప్సుడొస్తుందా అని  ఆశగా ఎదురుచూసున్న అవ్వా, తాతలు పింఛన్ల పండగ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించనున్నారు.ఇందుకు గుంటూరు జిల్లా మంగళగరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనమైన పెనుమాక వేదిక కానున్నది. ఎంపిక చేసిన లబ్ధిదారుల ఇంటికి స్వయంగా చంద్రబాబు వెళ్లి పింఛను మొత్తాన్ని వారికి అందజేయనున్నారు. సీఎం తమ ఇంటికి వస్తుండడంతో వారు ఆనందంతో ఉబ్బితబ్బిబవుతున్నారు.ఈమేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు అధికారులు చేశారు.

ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి రూ.3 వేలు కూడా కలిపి జులై ఒకటో తేదీన ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లను పంపిణీ చేయనుండడంతో లబ్ధిదారులు మొత్తంగా రూ.7 వేలు అందుకోనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల ద్వారా పింఛను నగదు పంపిణీ చేయనున్నారు. ప్రతి 50 మంది లబ్ధిదారులకు ఓ ఉద్యోగి నగదు అందజేసేలా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఉద్యోగులకు లబ్ధిదారుల వివరాలను పంపి వారి మొబైల్‌ ఫోన్లకు అనుసంధానం చేస్తున్నారు.


కార్యక్రమం వివరాలు ఇలా..

తొలుత ముఖ్యమంత్రి కాలినడకన వెళ్లి ఎస్టీ కాలనీలోని వృద్ధ, వితంతు పింఛన్లను స్వయంగా ఇద్దరు లబ్ధిదారులకు అందజేయనున్నారు. రచ్చబండ వేదిక వద్దకు కాలినడకన వచ్చి పింఛనుదారులతో మాట్లాడతారు. ప్రజల నుంచి అర్జీలను స్వీకరించనున్నారు. ఆదివారం సాయంత్రం  ఏర్పాట్లను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి, సబ్‌ కలెక్టర్‌ ప్రఖర్‌జైన్, ఎస్పీ తుషార్‌దూడి, ఆర్డీవో శ్రీకర్‌ పరిశీలించారు. సీఎం నుంచి పింఛను అందుకునే లబ్ధిదారులతో మాట్లాడారు. ఉదయం 5:55 గంటలకు సీఎం చంద్రబాబు పెనుమాక చేరుకుని కార్యక్రమంలో పాల్గొంటారు. 7:15 గంటలకు తిరిగి బయలుదేరి వెళతారు. 


లబ్ధిదారుల్లో సంతోషం

పింఛన్ల నగదు పెంచడంతో లబ్ధిదారుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. దివ్యాంగుల పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.6 వేలకు, పక్షవాతం, కండరాల బాధితులకురూ.5 వేల నుంచి రూ.15 వేలకు, కిడ్నీ వ్యాధిగ్రస్థుల్లో డయాలసిస్‌ చేయించుకుంటున్న వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేలకు ప్రభుత్వం పెంచింది. మొత్తం 2,61,588 మంది పింఛనుదారులు ఉంటే వీరిలో 2,39,953 మందికి పెన్షన్‌ పెంచారు. గత వైకాపా ప్రభుత్వం హయాంలో రూ.2 వేల నుంచి రూ.250 చొప్పున అయిదేళ్లలో రూ.3 వేలకు పెంచారు. తెదేపా ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 18 రోజుల్లోనే రూ.1000 చొప్పున పెంచి పంపిణీ చేయనుండడం విశేషం. దీనికి తోడు ఎన్నికల కోడ్‌ కారణంగా చూపి ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఎండ తీవ్రతలు ఎక్కువుగా ఉన్నప్పటికీ లబ్ధిదారులకు ఇళ్ల వద్ద గాకుండా సచివాలయాల వద్ద, బ్యాంకు ఖాతాల్లో నగదు పంపిణీ చేయడంతో నగదు తీసుకోవడానికి అవ్వా తాతలు, పింఛనుదారులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో 50 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాంతో లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లు పంపిణీ చేస్తామని చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల సభల్లో ప్రకటించిన విధంగానే ఇప్పుడు అమలు చేస్తుండటంతో ఇబ్బందులు తొలిగాయని సంతోషిస్తున్నారు. సోమవారం ఉదయం 6 గంటలకు వారికి కేటాయించిన లబ్ధిదారులకు పింఛను సొమ్ము పంపిణీ చేయనున్నారు. దీని కోసం 5,231 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు.  ఎంపిక చేసిన లబ్ధిదారులు ఏమంటున్నారంటే..

పెనుమాకలో కార్యక్రమం ఏర్పాట్లపై కలెక్టర్, జేసీ తదితరులకు సూచనలు ఇస్తున్న  ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ 


జీవితంలో మరిచిపోలేని రోజు 
- బాణావత్‌ పాముల నాయక్, పెనుమాక 

నాకు వృద్ధాప్య పింఛను వస్తోంది. రాష్ట్రంలోనే ఎన్టీఆర్‌ భరోసా పింఛను పథకం నుంచి రూ.4 వేలు అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలో మూడు నెలలకు సంబంధించి మరో రూ.3 వేలు కలిపి మొత్తం రూ.ఏడు వేలు ఇస్తారు. ఆ డబ్బులతో వైద్యం చేయించుకుంటాను. జీవితంలో ఏనాడూ ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంతటి వారే మాఇంటికి వస్తారని కలలో కూడా ఊహించలేదు. జీవితంలో మరచిపోలేని రోజు.


ముఖ్యమంత్రి మా ఇంటికొస్తున్నారంటే నమ్మలేదు 
- ఇస్లావత్‌ సాయి, మహిళ, పెనుమాక 

నా భర్త రాము అయిదేళ్ల కిందట గుండెపోటుతో చనిపోయారు. నాకు వితంతు పింఛను వస్తోంది. నాకు ఇద్దరు కుమారులు. వారిని చదివించుకుంటూ పండ్లు విక్రయిస్తూ జీవిస్తున్నాను. చంద్రబాబు   రూ.4 వేల పింఛను ఇస్తానన్నప్పుడే ఎంతో ఆనందపడ్డాను. ఆ డబ్బులు నా పిల్లల చదువులకు ఉపయోగపడతాయి. ఏప్రిల్‌ నెల నుంచి పెంచిన డబ్బులతో కలిపి మొత్తం రూ.7 వేలు ఇస్తున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. నేరుగా ముఖ్యమంత్రి మా ఇంటికి వస్తున్నారంటే ముందుగా నమ్మలేకపోయాను. అది నిజమని తెలిశాక ఆనందం పట్టలేకపోయాను. అంతటి వ్యక్తి నా ఇంటికి వచ్చి పింఛను అందజేయడం..ఎవరికీ లేని అవకాశం నాకు రావడం ఆనందంగా ఉంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని