logo

కేంద్రం నిధులిస్తే రహ‘దారి’

గుంటూరు నుంచి హైదరాబాద్‌ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు,..

Published : 01 Jul 2024 05:04 IST

నాలుగు వరుసలు... అభివృద్ధికి బాటలు
పేరేచర్ల నుంచి కొండమోడు వరకు విస్తరణ

రాజుపాలెం మండలంలో రహదారి భూసేకరణకు సర్వే చేసి పాతిన హద్దురాయి 

ఈనాడు-అమరావతి: గుంటూరు నుంచి హైదరాబాద్‌ మార్గంలో పేరేచర్ల నుంచి కొండమోడు వరకు నాలుగు వరుసల రహదారిగా విస్తరణకు మార్గం సుగమమైంది. అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారికి అనుసంధానంగా ఉండే ఈమార్గం రహదారి ప్రమాదాలు, ప్రయాణ సమయం, ఇంధనం ఆదా వంటి లక్ష్యాలతో విస్తరించనున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని కొండమోడు నుంచి గుంటూరు సమీపంలోని పేరేచర్ల వరకు జాతీయ రహదారి(167ఏజీ)గా కేంద్రం గుర్తించింది. ఈ మార్గం ప్రాధాన్యత దృష్ట్యా విస్తరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. గతేడాది ఆగస్టులో 50కిలోమీటర్ల రహదారి అభివృద్ధికి రూ.1032 కోట్లతో టెండరు పిలిచారు. ఈ పనులను రాజేంద్రసింగ్‌ బేంబూ ఇన్‌ఫ్రా ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థ దక్కించుకుంది. భారత్‌మాల పరియోజన కింద రహదారి విస్తరణ చేపట్టారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనే మంజూరైనా కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. పల్నాడు జిల్లా నుంచి పార్లమెంటు సభ్యులుగా ఎన్నికైన లావు  శ్రీకృష్ణదేవరాయలు ఈమార్గానికి నిధులు విడుదల చేసి వెంటనే పనులు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని కోరారు. దీంతో త్వరలోనే ఈప్రాజెక్టు పట్టా లెక్కనుంది. 

234 హెక్టార్ల భూసేకరణ

పేరేచర్ల నుంచి కొండమోడు మార్గాన్ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి గుంటూరు, సత్తెనపల్లి ఆర్డీవోల పరిధిలో 234 హెక్టార్ల భూమి సేకరించాలి. సర్వే పూర్తిచేసి ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డు, పోరంబోకు భూములను విభాగాలుగా విభజించి నివేదిక సిద్ధం చేశారు. రహదారి విస్తరణకు ఏ రైతు నుంచి ఎంత భూమి సేకరిస్తారు? ఎంత పరిహారం లభిస్తుందన్న వివరాలు సిద్ధమయ్యాయి. భూసేకరణకు సంబంధించిన ప్రక్రియ మొత్తం పూర్తిచేసి కేంద్రానికి రాష్ట్రం నివేదిక అందించింది. కేంద్రం భూసేకరణకు నిధులు విడుదల చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో సొమ్ము చేసి గుత్తేదారుకు భూమి అప్పగిస్తారు. నాలుగు వరుసల విస్తరణలో ఒక్కొక్క వైపు 8.75మీటర్ల వెడల్పు రహదారి, డివైడర్‌ 1.5మీటర్లు, రెండువైపులా మార్జిన్‌లు కలిపి 22.5మీటర్ల  వెడల్పుతో నిర్మిస్తారు. మేడికొండూరులో 4 నుంచి 5కిలోమీటర్లు బైపాస్, సత్తెనపల్లిలో 11కిలోమీటర్ల బైపాస్‌ నిర్మించాల్సి ఉంది. ప్రస్తుతం 7 నుంచి 10మీటర్ల వెడల్పుతో రహదారి ఉండడంతో వాహనాల రద్దీ పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణ సమయం పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఈ మార్గం విస్తరణ పూర్తయి అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి నూతన రాజధాని అమరావతికి ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ఇంధనం ఆదా అవుతుంది. సీఆర్‌డీఏ నిర్మించే బాహ్యవలయ రహదారికి కూడా సత్తెనపల్లి వద్ద ఈమార్గం అనుసంధానం కానుంది.


నిధుల విడుదలకు కృషి
- లావుశ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ, నరసరావుపేట 

కొండమోడు-పేరేచర్ల రహదారి విస్తరణ ఆవశ్యకతను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి విస్తరణకు నిధులు మంజూరు చేయించాం. 2023లో టెండర్లు పిలిచినా అప్పట్లో కేంద్రం నిధుల విడుదల చేయకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. ఈవిషయమై ఇటీవలే కేంద్ర మంత్రిని కలిసి వెంటనే నిధులు విడుదల చేయాలని కోరాం. భూసేకరణకు నిధులు వచ్చిన వెంటనే రైతుల ఖాతాల్లో వేసి పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. దీనిని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిధులు విడుదల చేయించి పనులు ప్రారంభమయ్యేలా చూస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని