logo

23 నెలలు.. రూ.1000 కోట్ల నష్టం

బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు.

Published : 01 Jul 2024 04:43 IST

గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడంతో సమస్య
అప్రమత్తం కాకపోతే నీటి వృథానే 
ఏర్పాటుకు మరో రెండు నెలల గడువు

జలాశయం రెండో గేటు లేకుండా ఇలా.. 

న్యూస్‌టుడే, అద్దంకి : బహుళార్థ సాధక జలాశయం గుండ్లకమ్మ. ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణ వాసులకు మంచినీరు.. 1.40 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయబడిన ప్రాజెక్టు. రెండేళ్ల క్రితం ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేయడంలో నాటి పాలకులు ఆసక్తి కనబరచలేదు. గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాల కోసమే గేట్ల గురించి పట్టించుకోలేదని నాటి తెదేపా నాయకులు ఆరోపించారు. వారి ఆరోపణలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో దెబ్బతిన్న రెండు గేట్లతో పాటు మెతకగా ఉన్న మిగిలిన గేట్లను మార్చేందుకు నీటిపారుదలశాఖ అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌లో తయారైన నాలుగు గేట్లను అమర్చారు. మిగిలిన వాటిని ఆగస్టు నెలాఖరు నాటికి బిగిస్తామని చెబుతున్నారు. 2022 ఆగస్టు 31న మూడో నంబరు గేటు, 2023 జూన్‌ 6న రెండో నంబరు గేటు కొట్టుకుపోయాయి. ఈ కారణంగా జలాశయంలోని నీరు మొత్తం సముద్రం పాలైంది. పడవలు, వలలు, చేపలు మొత్తం కొట్టుకుపోయాయి. ప్రస్తుతం జలాశయం వెనుక నీరు లేకపోవటంతో ఖాళీ భూముల్లో నిర్వాసితులు పశుగ్రాసం సాగు చేస్తున్నారు.

గుండక్లమ్మ జలాశయం ఆధారంగా సుమారు రెండు వేలమంది జాలర్లు చేపల వేట ఆధారంగా జీవనం సాగించారు. రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన జాలర్లు కుటుంబాలతో సహా ఇక్కడే దీనిపై ఆధారపడ్డారు. ఒక్కో జాలరి సుమారు రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి వల, పడవ ఏర్పాటు చేసుకున్నారు. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవటంతో వారి పెట్టుబడి మొత్తం సముద్రం పాలైంది. చేసేది లేక వారంతా సొంత ప్రాంతాలకు తరలివెళ్లారు. స్థానికంగా ఉన్న జాలర్లు చేపలవేట వృత్తికి దూరమై కట్టెలు కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరికొంత మంది దినసరి కూలీలుగా మారారు. 70 వేల ఎకరాల ఆయకట్టుకు రెండు పర్యాయాలు కలిపి 1.40 లక్షల ఎకరాలకు నీరు అందించడం అనేది రెండేళ్లుగా జరగలేదు. ఆయకట్టులోని భూములున్న రైతులు అధికశాతం వాణిజ్య పంటల వైపు దృష్టి సారించాల్సి వచ్చింది. ఒంగోలు పట్టణానికి మంచినీటి సమస్య ఏర్పడింది. భూగర్భజలం అడుగంటడంతో పరివాహకంలోని రైతులు నీళ్లకోసం ఇబ్బందులు పడ్డారు.

నష్టం అంచనా ఇలా..: ఒక్కో జాలరి చేపలు పట్టుకోవటం, విక్రయం ద్వారా నెలకు రూ.25 వేల వరకు ఆదాయం సమకూర్చుకుంటాడు. మొత్తం రెండు వేల మంది జాలర్లు కలిపి రూ.5 కోట్ల వరకు నష్టపోయారు. 23 నెలలకు రూ.115 కోట్ల వరకు నష్టపోయినట్లే. అలాగే ఆయకట్టులోని రైతులు ఒక్కొక్కరూ ఏడాదికి ఎకరాకు గరిష్ఠంగా రూ.30 వేల వరకు ఆదాయం సమకూర్చుకుంటున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీరు లేకపోవటంతో కేవలం ఒక పంటకు మాత్రమే పరిమితమవుతున్నారు. రెండేళ్ల కాలపరిమితితో ఒక్కో రైతు సుమారు రూ.60 వేల వరకు నష్టపోయినట్లు లెక్కేస్తే మొత్తంగా 1.40 లక్షల ఎకరాలకు గాను రూ.840 కోట్ల వరకు నష్టపోయినట్లు స్థానికులు అంచనా వేస్తున్నారు.


ఆగస్టు ఆఖరుకు బిగించే అవకాశం
- రామాంజనేయులు, ఏఈ, గుండ్లకమ్మ రిజర్వాయరు 

గుజరాత్‌ రాష్ట్రం అహ్మదాబాద్‌ నుంచి గేట్లు తయారై, రవాణా ద్వారా జలాశయం వద్దకు చేరుతున్నాయి. ప్రస్తుతం నాలుగు గేట్లు బిగించారు. దెబ్బతిన్న మూడో నంబరు గేటు బిగించారు, రెండో నంబరుది బిగిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 0.4 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇప్పటికిపుడు ఎగువన భారీవర్షం కురిస్తే జలాశయంలో 21.6 మీటర్ల ఎత్తు వరకు నీరు నిలిచే అవకాశం ఉంది. అంటే 1.3 టీఎంసీల నీరు నిలిచేందుకు గేట్లు బిగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు