logo

నేటి నుంచి స్టాప్‌ డయేరియా

పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్‌ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది.

Updated : 01 Jul 2024 05:32 IST

రోగిని పరామర్శిస్తున్న నసీర్‌ (పాతచిత్రం) 

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: పిల్లల్లో నీళ్ల విరేచనాలను ఎదుర్కోవడానికి ‘స్టాప్‌ డయేరియా’ అనే పేరుతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీన్ని జులై ఒకటి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రెండు నెలలు కొనసాగించనుంది. పిల్లల్లో నీళ్ల విరేచనాలన్నది మనం సాధారణంగా చూస్తుండే సమస్య. ఇది బ్యాక్టీరియా కారణంగా లేదా వైరస్‌ వల్ల రావొచ్చు. మనం ఏ చెయ్యాలి? ఏం చెయ్యకూడదన్నది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు ఇంటింటిని సందర్శించనున్నారు. 

0-5 సంవత్సరాల పిల్లలకు 

జిల్లాలో 0-5 సంవత్సరాల వయసున్న చిన్నారులు సుమారు 1.5 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. ఈ రెండు నెలల సమయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బంది పిల్లలు ఉన్న ప్రతి ఇంటిని సందర్శించనున్నారు. డయేరియా అంటే ఏమిటో వివరిస్తారు. అదేవిధంగా ఓఆర్‌ఎస్‌తో పాటు జింక్‌ మాత్రలు అందజేస్తారు. డయేరియాతో బాధపడే పిల్లలకు వీటిని ఏవిధంగా వాడాలో తల్లిదండ్రులకు తెలియజేస్తారు. ముందుగానే వీటిని పంపిణీ చేస్తున్నందున బాధితులకు   వెంటనే వీటిని ఇచ్చేవిధంగా అవగాహన కల్పించనున్నారు. గతంలో 15 రోజులు మాత్రమే నిర్వహించే ఈ కార్యక్రమాన్ని తాజాగా రెండు నెలల పాటు కొనసాగించాలని  నిర్ణయించారు. 

అసలు రాకుండా ఉండాలంటే..

డయేరియా బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సిబ్బంది వివరిస్తారు. చేతి, నీటి, ఆహారం, పాత్రలు, పరిసరాల శుభ్రత పాటిస్తే చాలావరకు నీళ్ల విరేచనాలు దరిజేరవని తెలియజేస్తారు. శుభ్రతకు తోడు పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠంగా ఉండేలా చూడడం ముఖ్యం. అదేవిధంగా పిల్లలకు గడువు లోపు రోటా వైరస్‌ టీకాలు ఇప్పిస్తారు. 

మరణాలు సంభవించకూడదు 

విరేచనాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో మరణాలు సంభవించకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రెండు నెలల ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. దీన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశాం. అవసరమైన మేర ఓఆర్‌ఎస్, జింక్‌ మాత్రలను నిల్వ ఉంచాం. పిల్లలకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం పట్టడంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచుతున్నాం. ఇతర విభాగాల సహకారంతో దీన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశాం.

డాక్టర్‌ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో గుంటూరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని