logo

రాజకీయ పీడ వదిలింది

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ పి.రాజశేఖర్‌ ఉపకులపతి  పదవికి  రాజీనామా చేశారు.

Published : 30 Jun 2024 05:55 IST

ఉపకులపతి పదవికి రాజశేఖర్‌ రాజీనామా
ఊపిరి పీల్చుకున్న వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు

ఈనాడు-అమరావతి: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయాన్ని రాజకీయాలకు కేంద్ర బిందువుగా మార్చిన వీసీ పి.రాజశేఖర్‌ ఉపకులపతి  పదవికి  రాజీనామా చేశారు. అధ్యాపకులు, విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో జగన్‌ రాష్ట్రాన్ని ఎంత భ్రష్టుపట్టించారో అదే స్థాయిలో రాజశేఖర్‌ వర్సిటీ ప్రతిష్ఠను దిగజార్చారనే ఆరోపణలు మూటగట్టుకున్నారు. ఈయన బాధ్యతలు చేపట్టిన తరువాత చదువులమ్మ తల్లికి రాజకీయ చెద పట్టుకుంది. నాగార్జునుడి పేరుతో ఏర్పాటైన విశ్వవిద్యాలయానికి అపఖ్యాతే మిగిలింది. విద్యా ప్రమాణాలు దిగజారాయి. వీసీ పదవి పొందడానికి, దాన్ని కాపాడుకోవడానికి  ఆయన వైకాపా భజన చేశారు. ఇక్కడ నెలకొన్న పరిస్థితులపై విద్యార్థులు కులపతి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. 
2022, సెప్టెంబరులో రెగ్యులర్‌ వీసీగా రాజశేఖర్‌ నియమితులయ్యారు. అంతకు ముందు సుమారు మూడేళ్ల పాటు ఇన్‌ఛార్జి వీసీగా కొనసాగారు. నాలుగున్నరేళ్లు ఇన్‌ఛార్జి, రెగ్యులర్‌ వీసీగా కొనసాగడం వెనక వైకాపా పెద్దల అండదండలు ఏ స్థాయిలో ఉన్నాయో ఊహించుకోవచ్చు. గతంలో ఆయన వర్సిటీ రిజిస్ట్రార్‌గా పనిచేసినప్పుడు అనేక ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్లు చక్రపాణి కమిటీ నివేదిక నిర్ధారించింది. ఆ కమిటీ నివేదిక తప్పులు తడకగా ఉందని కోర్టుకెళ్లి మరీ ఆయన వీసీ పదవిని తెచ్చుకున్నారు. ఆయన ఆ పదవికి అనర్హుడు అని ప్రొఫెసర్‌ రత్నశీలామణి కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అది కోర్టు పరిధిలోనే ఉంది. ఒకప్పుడు ప్రొఫెసర్‌ సింహాద్రి, లక్ష్మణ్‌ వంటి ఎందరో విద్యావేత్తలు ఉపకులపతులుగా పనిచేసి వర్సిటీకి మంచిపేరు తీసుకొచ్చారు. రాజశేఖర్‌ను మాత్రం సాగనంపాలని గత కొద్దిరోజులుగా నినాదాలు వర్సిటీలో మార్మోగాయి. మొత్తంగా వారి ఆందోళనలు ఫలించాయి.

విమర్శల పాలైందిలా..

  • 2019 నవంబరులో ఆయన ఇన్‌ఛార్జి బాధ్యతలు చేపట్టినప్పుడు వర్సిటీ ప్రధాన గేటు నుంచి ర్యాలీగా వచ్చి వీసీ హాల్లోకి వైఎస్‌ఆర్‌ చిత్ర పటాన్ని చేతుల్లో పెట్టుకుని వెళ్లి ఛార్జి తీసుకోవడం విమర్శలకు దారి తీసింది. రెగ్యులర్‌ వీసీ అయిన తర్వాత కూడా జై జగన్‌ నినాదాల నడుమ ఆయన బాధ్యతలు స్వీకరించారు. 
  • గతంలో జగన్‌ ప్రభుత్వం మూడు రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోగానే వర్సిటీలో విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి ర్యాలీలు చేయడం, పలువురిని పిలిచి దానిపై సెమినార్‌ పెట్టించి అనుకూలంగా మాట్లాడించారు. దీనిని తప్పుబట్టిన ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకురాలొకరు కోర్టులో కేసు వేశారు. 
  • విశ్వవిద్యాలయ చరిత్రలో  ఏ రాజకీయ నాయకుడి విగ్రహం ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోనే తొలిసారిగా రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి స్వామిభక్తిని చాటుకున్నారు. దాన్ని ఇటీవల తొలగించారు. వైకాపా ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తే వర్సిటీకి సెలవులు ప్రకటించి ఆ సభలకు వచ్చిన వాహనాలు నిలుపుకోవటానికి వర్సిటీలో పార్కింగ్‌ కేటాయించారు. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ పేరు తొలగించి వైఎస్‌ఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలగా పేరు మార్చారు.
  • విద్యార్థులకు మోటివేషన్‌ క్లాసులిప్పించే పేరుతో సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మను తీసుకొచ్చారు. స్త్రీ జాతి మొత్తానికి నేనే దిక్కవ్వాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో వర్సిటీ అమ్మాయిలు, మహిళా ఉద్యోగులు నొచ్చుకున్నారు. ఆ వ్యాఖ్యలను వీసీ తప్పు పట్టలేదు. దీంతో మహిళా న్యాయవాదులు పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
  • తనకు అనుకూలురైన వారికి గెస్ట్‌ ఫ్యాకల్టీలుగా పునరావాసం కల్పించి వర్సిటీపై ఆర్థికభారం మోపారు. వైకాపా పెద్దలు సిఫార్సు చేసిన వారికి కొన్ని పోస్టింగ్‌లు కట్టబెట్టారనే విమర్శలు మూటగట్టుకున్నారు. 
  • యూజీసీ నుంచి వచ్చిన రూసా నిధులతో విద్యా ప్రమాణాలు పెంచటానికి చర్యలు చేపట్టకుండా రహదారుల్లో డివైడర్ల నిర్మాణం వంటివి చేపట్టి దుర్వినియోగానికి పాల్పడ్డారనే విమర్శలు వచ్చాయి.
  • కొందరికి ఇష్టానుసారం పదోన్నతులు కల్పించి మంచి పోస్టింగ్‌లు కట్టబెట్టారు. నియమ, నిబంధనలు తుంగలో తొక్కి అడ్డగోలుగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని