logo

అయిదేళ్లుగా జీజీహెచ్‌ని నిర్లక్ష్యం చేశారు

సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Published : 30 Jun 2024 05:50 IST

దశల వారీగా అన్నీ చక్కదిద్దుతాం
పనివేళల్లో వైద్యులంతా విధుల్లో ఉండాల్సిందే 
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ 

ఆస్పత్రిని సందర్శిస్తున్న చంద్రశేఖర్‌. చిత్రంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్, రామాంజనేయులు తదితరులు 

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: సర్వజనాసుపత్రిలో గత అయిదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదని, చాలా సమస్యలు ఉన్నాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. జీజీహెచ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి చంద్రశేఖర్‌ విలేకరులతో మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్య వైఖరితో ఆసుపత్రిలో పనులన్నీ నిలిచిపోయాయన్నారు. రోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్య క్రమంలో పనులను గుర్తించి దశల వారీగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి పనివేళల్లో వైద్యులంతా విధిగా విధుల్లో ఉండాలని సూచించామన్నారు. ఆసుపత్రి అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. బొంగరాలబీడులో జీజీహెచ్‌కు కేటాయించిన 6 ఎకరాల స్థలంలో ఏఏ విభాగాలు ఏర్పాటు చేయాలనుకుంటున్నారో ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. శాసనసభ్యులు మహమ్మద్‌ నసీర్, గళ్లా మాధవి, రామాంజనేయులు, తెనాలి శ్రావణకుమార్, జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి, గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ టీటీకే రెడ్డి, సూపరింటెండెంట్‌ కిరణ్కుమార్, డీఎంహెచ్‌వో విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఆసుపత్రిలో నాయకుల జన్మదిన వేడుకలా..? ఆసుపత్రిలో రాజకీయ నాయకుల జన్మదిన వేడుకల పేరుతో సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారని మంత్రి చంద్రశేఖర్‌ ప్రశ్నించారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు.  
సేవలపై ఆరా.. జీజీహెచ్‌లోని పలు విభాగాల్లోకి వెళ్లి రోగులకు అందుతున్న సేవలు.. వసతులను మంత్రి చంద్రశేఖర్‌  పరిశీలించారు. కలెక్టర్, ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆయా విభాగాధిపతులను విభాగాల వారీగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాన్పులు, రోగుల ప్రవేశాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు తక్కువగా ఉండడాన్ని గుర్తించి బాధ్యులైన వైద్యులను ప్రశ్నించారు.ఆస్పత్రికి వచ్చే ఆదాయవనరులపై  ఎందుకు దృష్టి సారించడంలేదని సూపరింటెండెంట్‌ని ప్రశ్నించారు. నాట్కో ట్రస్టు ఆధ్వర్యంలో క్యాన్సర్‌ ఆసుపత్రి చాలా బాగా నడుస్తోంది ఆసుపత్రి అభివృద్ధి కమిటీలో సభ్యులుగా వారిని భాగస్వాములను చేయాలని సూచించారు.
జయదేవ్‌ నిర్మించినట్లు  మీరెందుకు కట్టలేకపోయారు? ఆసుపత్రిలో రాజన్న ట్రస్టు ద్వారా అప్పటి గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ రూ.కోటి నిధులు వెచ్చించి రోగుల సహాయకులకు విశ్రాంతి మందిరాన్ని నిర్మించారు. అదే రూ.కోటితో ప్రభుత్వం కూడా భవనం పనులు ప్రారంభించి అసంపూర్తిగా వదిలేసింది. ఎంపీ జయదేవ్‌ కట్టగా మీరెందుకు ఆ భవనం పూర్తి చేయలేకపోయారు? దీనికి కారణాలేమిటని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులను ప్రశ్నించి దీనిపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని