logo

ఎయిమ్స్‌కు నీటి కష్టాలు తీరినట్లే

మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్‌ మాధవానంద కార్‌ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది.

Published : 30 Jun 2024 05:46 IST

అధికార యంత్రాంగంలో కదలిక
పనుల పూర్తికి యుద్ధప్రాతిపదికన చర్యలు 

ఎయిమ్స్‌ ఆసుపత్రి

ఈనాడు - అమరావతి: మంగళగిరి ఎయిమ్స్‌లో నీటి సమస్య పరిష్కారానికి తెదేపా కూటమి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ అంశంపై ఆసుపత్రి డైరెక్టర్‌ మాధవానంద కార్‌ శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసిన నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ఆ పనులను పర్యవేక్షిస్తున్న మున్సిపల్‌ ప్రజారోగ్య ఇంజినీరింగ్‌ విభాగం గుంటూరు సర్కిల్‌ అధికారులు అటవీ, పర్యావరణ శాఖల జాతీయ అధికారులతో శనివారం సంప్రదింపులు జరిపారు. ఆపై గుత్తేదారుతో మాట్లాడారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తామని ఇంకా అప్‌లోడ్‌ చేయాల్సిన వాటిని వెంటనే సీఎఫ్‌ఎంఎస్‌కు పంపుతామని, గతంలో నిలిపేసిన పైపులైను అనుసంధాన పనులు, సంపుల నిర్మాణం వంటివి వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. 

ఈసారి ఎలాగైనా...

కేంద్ర అటవీ పర్యావరణశాఖ, జాతీయ రహదారుల విభాగం నుంచి స్టేజ్‌-1 అనుమతులతో ఆసుపత్రికి జాతీయ రహదారి నుంచి (కొలనుకొండ వద్ద) లోపలికి ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు నిర్మించారు. ప్రస్తుతం కొలనుకొండ నుంచి అటవీశాఖ భూములు మీదుగా 850 మీటర్ల మేర పైపులైను నిర్మాణానికి అనుమతులు కోరుతూ దస్త్రాన్ని చెన్నై అధికారులకు పంపించారు. గతంలో రహదారిని నిర్మించినప్పుడు రోడ్డు కటింగ్‌ ఛార్జీలు రూ. 3 లక్షలను జాతీయ రహదారుల సంస్థకు బకాయి ఉంది. ఈ మొత్తాన్ని చెల్లించి స్టేజ్‌-1 అనుమతితో పైపులైను పనులు ప్రారంభించాలన్నది ఆలోచన. ఆమోదం రాకపోతే స్టేజ్‌-2 అనుమతి పొంది పైపులైన్‌ పనులు వెంటనే చేపట్టేలా మరో దస్త్రం రూపొందించారు. ఆత్మకూరు ఛానల్‌ నుంచి రోజుకు 2.5 మిలియన్‌ లీటర్ల నీటిని పైపులైన్‌ ద్వారా ఆసుపత్రికి తరలించి సంపుల్లో నిల్వ చేసే పనులకు 2022 అక్టోబరులో గుత్తేదారుతో అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏడాది వ్యవధిలోనే పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. అప్పట్లో రూ. 7.74 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించగా.. సకాలంలో పూర్తికాక రూ. 8.94 కోట్లకు పెరిగింది. ఇప్పటికే మూడుసార్లు గడువు పొడిగించారు. ఆగస్టునాటికి పూర్తి చేయాలని అనుకున్నా... అప్పటికి కష్టమని భావిస్తున్న అధికారులు మరో రెండు నెలల సమయం కోరాలని యోచిస్తున్నారు. గతంలో చేసిన రూ. 2.97 కోట్ల పనులకు బిల్లులు చెల్లించేశారు. రూ. 2.05 కోట్ల బిల్లులు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఇంకా రూ. 5.96 కోట్లు అవసరమవుతాయని ఈ బడ్జెట్‌ విడుదల చేస్తే వెంటనే పనులను పూర్తి చేస్తామని తాజాగా ఉన్నతాధికారులను కోరుతూ దస్త్రం పంపించారు. 

అసంపూర్తిగా  సంపు నిర్మాణం  

నాటి జగన్‌ సర్కారు హయాంలో

  • 2019కు ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎయిమ్స్‌ నిర్మాణం సాకారమైంది. నిర్మాణాలకు అనుమతులు, భూముల కేటాయింపు వంటి విషయాల్లో అప్పట్లో ప్రభుత్వం వేగంగా స్పందించి పనులను శరవేగంగా పూర్తి చేసి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత అధికారంలోకొచ్చిన వైకాపా ప్రభుత్వం నీటి సమస్యను పరిష్కరించకుండా ఐదేళ్లు నాన్చింది. నీళ్లు లేక రోగులు సహా వైద్యులు, సిబ్బంది, వైద్య, నర్సింగ్‌ విద్యార్థులు పడ్డ ఇబ్బందులెన్నో. అయినా జగన్‌ మనసు కరగలేదు. 
  • విజయవాడ, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్ల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకోవాల్సి వచ్చేది. నిత్యం ఏడు మిలియన్‌ లీటర్ల (ఎంఎల్‌డీ) నీరు అవసరం కాగా.. కేవలం రెండు మిలియన్‌ లీటర్లే వచ్చేవి. వైకాపా హయాంలో ఐదేళ్లపాటు ఇదే పరిస్థితి. కిరాయిల రూపేణా భారీగా బిల్లులు చెల్లించాల్సి వచ్చేది. 
  • సంపులు, నీటిశుద్ధి ప్లాంట్లకు సంబంధించి సివిల్‌ పనులు పూర్తయ్యాయి. మెకానికల్, ఫిల్టర్‌బెడ్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. జాతీయ రహదారి క్రాసింగ్‌ వద్ద పనులు కొంతమేర పెండింగ్‌లో ఉన్నాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని