logo

ఇష్టానుసారం తోడేస్తున్నారు!

గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది.

Published : 30 Jun 2024 05:37 IST

గుండ్లకమ్మ పరివాహకంలో ఆగని ఇసుక తవ్వకాలు

పాతకొటికలపూడి ఎదుట తవ్విన ఇసుక  

అద్దంకి, న్యూస్‌టుడే: గుండ్లకమ్మ నదిలో ఇసుక తవ్వకాలు పునః ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో కూటమి అధికారం చేపట్టింది. ఇసుక విధానం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇసుక అక్రమ తవ్వకందార్లు ఏమాత్రం ఓర్పు వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. గుండ్లకమ్మ నది పరివాహకంలో రామాయపాలెం, తిమ్మాయపాలెం, వేలమూరిపాడు, కొటికలపూడి, మోదేపల్లి, పేరాయపాలెం, ధేనువకొండ గ్రామాల సరిహద్దుల్లో తవ్వేస్తున్నారు. గతంలో రూ.4,500 నుంచి రూ.5 వేలకు ట్రక్కు ఇసుక లభించేది. ఇపుడు మాత్రం రూ.2,500 నుంచి రూ.3,500 వరకు     విక్రయిస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఇసుక తవ్వకాలను ప్రత్యేకించి కొందరు మాత్రమే కొనసాగిస్తున్నట్లు సమాచారం. అందువల్లనే గ్రామాల్లో వాదనలు చోటు చేసుకుంటున్నాయి.
జాతీయ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిన ప్రజాసంఘాలు: అద్దంకి సమీపంలోని గుండ్లకమ్మ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు పెద్దఎత్తున జరుగుతున్నాయంటూ ప్రజాసంఘాల తరఫున మన్నం త్రిమూర్తులు గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. ఆమేరకు స్థానికంగా పనిచేసే అధికార యంత్రాంగానికి తాకీదులు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే గుండ్లకమ్మ నది పరివాహకంలో పూర్వం తవ్వకాలు జరిపిన ఇసుక కుప్పల్ని అధికారుల బృందం వారానికి ఒక పర్యాయం పరిశీలించి వెళుతోంది. తవ్వకందార్లు తామేమీ తక్కువ తినలేదంటూ వాటిని వదిలి వేసి కొత్తప్రదేశాల్లో తవ్వకాలు ప్రారంభించారు. కొంతమంది గ్రామస్థాయి నాయకులు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇసుక తవ్వకాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై అద్దంకి సీఐ పి.కృష్ణయ్యను వివరణ కోరగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. రాత్రి పూట పహారా ఉంచినట్లు స్పష్టం చేశారు. ఇసుకపై ప్రభుత్వ విధానం వెలువడే వరకు ఎవరూ తవ్వరాదని హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని