logo

సముద్ర తీరం.. నిర్మానుష్యం

వారాంతపు సెలవులు వస్తే చాలు తీరం వెంట ప్రధానంగా తెలంగాణ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు చీరాల నియోజవర్గంలోని వాడరేవు, రామాపురం చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేవారు.

Published : 30 Jun 2024 05:35 IST

వరుస ప్రమాదాలతో పర్యాటకులను అనుమతించని పోలీసులు

తీరం వెంట మెరైన్‌ పోలీసులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు 

చీరాల అర్బన్, వేటపాలెం, న్యూస్‌టుడే: వారాంతపు సెలవులు వస్తే చాలు తీరం వెంట ప్రధానంగా తెలంగాణ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు చీరాల నియోజవర్గంలోని వాడరేవు, రామాపురం చేరుకుని కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేవారు. వీరి రాకతో తీరంతో పాటు రిసార్ట్స్‌ సందడిగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కనుచూపు మేర కనపడడంలేదు. దీనికి ప్రధాన కారణం రామాపురం తీరంలో వరుస ప్రమాదాలతో ఈనెలలో ఎనిమిది మంది వరకు మృత్యువాతపడ్డారు. దీనికితోడు అందరూ యువకులు కావడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో వారం రోజుల క్రితం పోలీసులు కొన్ని రోజుల పాటు సముద్రతీరంలో స్నానాలు చేయడాన్ని నిషేధించారు. పడమటి గాలుల ఉద్ధృతి కారణంగా సముద్రంలో సుడులు ఏర్పడడంతో ప్రమాదాలు రోజు రోజుకూ పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పేర్కొన్నారు. ఆనాటి నుంచి పోలీసులు తీరం వెంట గస్తీ ఏర్పాటు చేశారు. పర్యాటకులు తీరంలోకి రావడానికి వీలు లేకుండా స్టాపర్లు ఏర్పాటు చేశారు. ఇదేసమయంలో హెచ్చరిక బోర్డులు సైతం పెడుతున్నారు. విషయం తెలియని వారు ఒక వేళ వస్తే వారికి పోలీసులు సమస్యను వివరిస్తున్నారు. దీంతో వారందరు అతిథి గృహాలకే పరిమితం కావాల్సి వచ్చింది. జనసంచారం లేకపోవడంతో తీరం నిర్మానుష్యంగా మారింది. రిసార్ట్స్‌కి వచ్చే వారి సంఖ్య తగ్గడంతో పాటు స్థానిక వ్యాపారాలు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఎన్నాళ్లుంటుందో తెలియక అటు పర్యాటకులు, ఇటు వ్యాపారులు సందిగ్ధంలో ఉన్నారు.

రామాపురం వద్ద స్నానాలకు అనుమతి లేదని పర్యాటకులకు వివరిస్తున్న పోలీసులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని