logo

బాధ్యతలు చేపట్టిన యంత్రాంగం

సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది.

Published : 30 Jun 2024 05:32 IST

గుంటూరు, మాచర్ల, న్యూస్‌టుడే: సహకార రంగం ప్రక్షాళనకు కూటమి ప్రభుత్వం వడివడిగా చర్యలు చేపట్టింది. 2018లో సహకార సొసైటీల పాలకవర్గాల సమయం ముగిసింది. ఆ తర్వాత కొద్దికాలం పాటు వారినే కొనసాగించారు. తర్వాతి ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో వైకాపా పాలనలో సహకార సంఘాల బాధ్యతలను నామినేటెడ్‌గా భర్తీ చేశారు. దీంతో ఈ పదవులను అడ్డు పెట్టుకుని కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. ఏడుగురు సభ్యులతో సహకార బ్యాంకు పాలకమండలిని, ముగ్గురు సభ్యులతో ఒక్కొక్క సొసైటీకి కమిటీని ఏర్పాటు చేసింది. వీరిది ఆడిందే ఆట అన్నట్లుగా గత అయిదు సంవత్సరాలు గడిచాయి. అదే స్థాయిలో పలుచోట్ల భారీ కుంభకోణాలు జరిగాయి. 

పాలకమండళ్ల రద్దు...

కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకమండలి రాజీనామా చేసి వైదొలిగింది. సొసైటీల త్రిసభ్య కమిటీలు వైదొలగాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా మాచర్ల, గురజాల ప్రాంతాల్లోని కొన్ని సంఘాల్లోని కమిటీ సభ్యులు రాజీనామా చేయలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని 167 సంఘాలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సహకార బ్యాంకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జిగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి ఇప్పటికే బాద్యతలు స్వీకరించారు. శుక్రవారం వెలువడిన ఉత్తర్వులతో శనివారం రోజున ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అన్ని సొసైటీలలో ప్రత్యేకాధికారులు బాధ్యతలు కేటాయించారు. వీరంతా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేకాధికారులుగా బాధ్యతల్లో కొనసాగనున్నారు. 

రూ.కోట్లు కొల్లగొట్టినా.. కితాబులా..

వైకాపా సర్కారు డీసీసీబీకి ఎన్నికలు జరపకుండా నామినేటెడ్‌ విధానంలో పాలకవర్గాన్ని ఏర్పాటు చేసింది. సొసైటీలకు త్రిసభ్య కమిటీని నియమించింది. పాలకవర్గాలు చక్కగా పనిచేస్తున్నాయి. అందువల్లనే సహకార సొసైటీలకు ఎన్నికలు నిర్వహించ లేదని అప్పట్లో మంత్రిగా పనిచేసిన కాకాణి గోవర్దన్‌ రెడ్డి గుంటూరు సహకార భవన్‌లో జరిగిన సమావేశంలో అన్నారు. అయితే అప్పటికే ప్రత్తిపాడు పరిధిలో నకిలీ పాసు పుస్తకాలతో పొందిన కోట్ల రూపాయల రుణాల అవకతవకలు బయటపడినా మంత్రి కనీసం ఆ ఊసెత్తకపోగా..పాలన బాగుందని కితాబిచ్చారు. సహకార వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చారని చెప్పుకుంటూ సొసైటీలు, సహకార బ్యాంకుల్లో కోట్ల రూపాయలను వైకాపా పాలనలో నియమితులైన పాలకవర్గాలు బొక్కేశాయి. దీనిపై విచారణకు ఆదేశించినా.. ఒక్కరిపై కూడా చర్యలు చేపట్టిన సందర్భం లేదు. 

అన్నింటా ప్రత్యేకాధికారులు

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీలకు అఫీషియల్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా జిల్లా సంయుక్త కలెక్టర్‌ను నియమించారు. ఈమేరకు వారు బాధ్యతలు స్వీకరించారు. తాజాగా పీఏసీఎస్‌లకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాలని ఉత్తర్వులిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని అన్ని సహకార సంఘాలకు కూడా ప్రత్యేకాధికారులను నియమించాం. ఒకవేళ ఎవరైనా ఆయా పదవి నుంచి వైదొలగకపోయినా ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వైదొలగినట్లే. ఆయా సొసైటీలకు కూడా ప్రత్యేక అధికారులను నియమించాం. 

వీరాచారి, జిల్లా సహకారశాఖ అధికారి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని