logo

మళ్లీ నీటి పరీక్షలు..

జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నీరు అడుగంటడం, నీటి శుద్ధి సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల అతిసార కేసులు బయటపడుతున్నాయి.

Published : 30 Jun 2024 05:18 IST

అతిసారం ప్రబలుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు

నీటి పరీక్షలు చేస్తున్న సచివాలయ ఉద్యోగి

సత్తెనపల్లి, మాచర్ల, న్యూస్‌టుడే: జిల్లాలో చాలాచోట్ల చెరువుల్లో నీరు అడుగంటడం, నీటి శుద్ధి సక్రమంగా లేకపోవడంతో పలుచోట్ల అతిసార కేసులు బయటపడుతున్నాయి. ప్రధానంగా దాచేపల్లి, మాచర్ల.. తదితర చోట్ల నీళ్ల విరోచనాలతో బాధితులు ఆసుపత్రి పాలయ్యారు. నీరు కలుషితం కావడం వల్లే ప్రజలు అతిసార బారినపడుతున్నట్లు ఇప్పటికే యంత్రాంగం గుర్తించింది. పలుచోట్ల బోర్లు నుంచి వచ్చే నీరు వాడొద్దని హెచ్చరికలు జారీచేశారు. నీటి పరీక్షలపై ప్రత్యేక దృష్టిసారించారు. గత వైకాపా ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరీక్షలు అటకెక్కాయి. గతేడాది జూన్‌తో గ్రామ పంచాయతీలకు అందజేసిన నీటి పరీక్షల కిట్ల కాలం చెల్లింది. మళ్లీ కిట్లు ఇచ్చి నీటి పరీక్షలు చేయడం లేదా ప్రత్యేక కిట్లతో నీటి నమునాలు సేకరించి పరీక్షలు చేయడం వంటివి చేయలేదు. దీంతో గ్రామాల్లో నీటి కలుషితంతో అతిసారం ప్రబలుతోంది. అతిసారం మరణాల నేపథ్యంలో పూర్తిస్థాయిలో సీజనల్‌ వ్యాధులకు అడ్డుకట్ట వేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ నీటి పరీక్షలు చేపడుతోంది. అన్ని గ్రామాల్లో నీటి నమునాలు సేకరించి తాగేందుకు ఏ నీరు సురక్షితంగా గుర్తించే ప్రక్రియ చేపడుతున్నారు. శుక్ర, శనివారాల్లో ముప్పాళ్ల గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో నీటి నమునాలు సేకరించి పరీక్షలు చేశారు. అదేవిధంగా అన్ని గ్రామాల్లోనూ నీటి నమునాల సేకరణ, శాస్త్రీయంగా పరీక్షలు చేసి వాటి ఫలితాల్ని ఉన్నతాధికారులకు నివేదిస్తున్నారు. పరీక్షా ఫలితాలకు అనుగుణంగా అందరికి సురక్షిత జలం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనను చేస్తున్నారు. జులై ఒకటో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అతిసారంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అతిసారపై అవగాహన కల్పించేందుకు ఆశా, ఆరోగ్య కార్యకర్తలు తమ పరిధిలోని గృహాలు సందర్శించి ఎవరైనా డయేరియాతో బాధపడుతున్నారా అనేది గుర్తించడంతో పాటు ఐదేళ్లలోపు పిల్లలు ఉంటే వారికి రెండు ప్యాకెట్లు ఓఆర్‌ఎస్, 14 జింక్‌ మాత్రలు అందజేస్తారన్నారు. కార్యక్రమం జులై 1 నుంచి 30 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు