logo

‘మాజీ సీఎస్‌ జవహర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయండి’

దళితుడైన పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్‌ శివశంకర్‌పై తప్పుడు నివేదిక ఇచ్చిన వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బి.విల్సన్‌ డిమాండ్‌ చేశారు.

Published : 30 Jun 2024 05:14 IST

గుంటూరు, న్యూస్‌టుడే: దళితుడైన పల్నాడు జిల్లా మాజీ కలెక్టర్‌ శివశంకర్‌పై తప్పుడు నివేదిక ఇచ్చిన వైకాపా హయాంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన జవహర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు చేయాలని డాక్టర్‌ బీఆర్‌ ఆంబేడ్కర్‌ లిటరేచర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు బి.విల్సన్‌ డిమాండ్‌ చేశారు. గుంటూరు అరండల్‌పేటలో శనివారం దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విల్సన్‌ మాట్లాడుతూ జవహర్‌రెడ్డి సీఎస్‌గా నియమితులైనప్పటి నుంచి మాజీ సీఎం జగన్‌ సేవలో తరించారని విమర్శించారు. ఐఏఎస్‌ అధికారిగా ఉండి కుల దురంహకారాన్ని వదిలిపెట్టకుండా ప్రభుత్వ సేవలో కన్నా జగన్‌ సేవలో మునిగిపోయారని దుయ్యబట్టారు. జగన్‌ అడుగులకు మడుగులొత్తుతు అధికారాన్ని దుర్వినియోగం చేశారన్నారు. ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీకి కొమ్ముకాసి రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలకు మద్దతునిచ్చారని విమర్శించారు. మాచర్ల నియోజకవర్గ వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలను ఎన్నికల కమిషన్‌ సీరియస్‌గా తీసుకొని నివేదిక అడిగితే పాలనలో తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకొని.. ఆ నెపాన్ని పల్నాడు జిల్లాను అభివృద్ధిలోకి తీసుకువస్తున్న మాజీ కలెక్టర్‌ శివశంకర్‌పై నెట్టివేసి ఆయన కెరీర్‌కు మచ్చ తెచ్చారని ఆరోపించారు. ఈ సంఘటనను రాష్ట్ర హైకోర్టు, ఎన్నికల సంఘం, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సుమోటోగా తీసుకొని జవహర్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారురీ సమావేశంలో వీసీకే పార్టీ నాయకురాలు కె. జయసుధ, భీమ్‌ సేనా సేవా దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు నీలాంబరం, సోషల్‌ యాక్టివిస్టు వినయ్‌కుమార్, భారత్‌ బచావో జిల్లా కార్యదర్శి సమత, ఎమ్మార్పీఎస్‌ నాయకులు రవికుమార్, రాజకుమారి పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని