logo

అయిదేళ్లలో తప్పుడు కేసులెన్నో!

బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు.

Updated : 29 Jun 2024 06:21 IST

వైకాపా నేతలతో అంటకాగిన పోలీసులు
తెదేపా ఎమ్మెల్యేల ఫిర్యాదులను పట్టించుకోని ఎస్పీ
ఈనాడు, బాపట్ల

బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. చిన్నాచితక ఫిర్యాదులకు స్టేషన్లకు పిలిపించి వేధించారు. సాక్షాత్తు తెదేపాకు చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపైనే నామినేషన్ల సమయంలో పర్చూరులో ఎస్సై శివనాగిరెడ్డి చాలా దురుసుగా  ప్రవర్తించారు. బాపట్ల తెదేపా బాధ్యుడు వేగేశన నరేంద్ర వర్మపై బాపట్ల సీఐ కృష్ణయ్య సైతం నోరుపారేసుకున్నారు. ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పనితీరుపైనా ఆరోపణలు వచ్చాయి. తెదేపా నాయకులు, కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేయటానికి వెళ్లిన అప్పటి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్‌కు సకాలంలో అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదు. పోలింగ్‌ రోజున చీరాల తెదేపా అభ్యర్థి కొండయ్యపై దాడి, కారంచేడు మండలంలో తెదేపా ఏజెంట్లను కొట్టి తరిమేశారని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదు.

  • కర్లపాలెంలో ఎస్సై జనార్దన్‌ అడుగడుగునా వైకాపాకు కొమ్ముకాశారు. రాజేష్‌ అనే దళిత యువకుడు వైకాపా నుంచి తెదేపాలో చేరగా అతనిపై ఎస్సై దాడి చేశారు. స్టేషన్‌కు పిలిపించి తిరిగి వైకాపాలోకి రావాలని చావబాదారు. అప్పటి ఎమ్మెల్యే కోన రఘుపతి అన్నకుమారుడు కోన వెంకట్, ఇతర వైకాపా నేతలు స్టేషన్‌లోకి వచ్చి రాజేష్‌పై దాడి చేసినా ఎస్సై పట్టించుకోలేదు. ప్రస్తుతం అతను సస్పెన్షన్‌లో ఉన్నారు.
  • బల్లికురవలో తెదేపా వార్డు సభ్యురాలిని వైకాపాలో చేరాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి చేశారు. దానికి ఆమె ససేమిరా అనడంతో ఎస్సై శివనాగిరెడ్డి ఆమెకు చెందిన షాపులో తనిఖీలకు వెళ్లారు. అక్రమంగా మద్యం కలిగి ఉన్నారని అందులో పనిచేసే ఓ వృద్ధుడిపై ఎస్సై చేయిచేసుకోవటం అప్పట్లో సంచలనమైంది. ఎన్నికల సంఘం తప్పుబట్టి లూప్‌లైన్‌కు పంపగా మరోసారి పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై దురుసుగా ప్రవర్తించి సస్పెండ్‌ అయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉన్నారు.  
  • చెరుకుపల్లి రూరల్‌ సీఐ శివశంకర్‌ వైకాపాకు అండగా నిలిచారు. ఆ సర్కిల్‌ పరిధిలో ఉప్పాల అమరనాథ్‌ గౌడ్‌ అనే బాలుడిని పెట్రోలు పోసి వైకాపా కార్యకర్త దారుణంగా హతమార్చినా సకాలంలో ఘటనా ప్రదేశానికి వెళ్లలేదు. నిందితుడిపై కేసు నమోదులో ఉదాశీనంగా వ్యవహరించారు. తీవ్రమైన సెక్షన్లు పెట్టకుండా కేసును తేల్చేయటంతో వెంటనే నిందితుడు బెయిల్‌పై బయటకొచ్చేశాడు. ఎంపీ మోపిదేవితో సన్నిహితంగా ఉంటారనే ఆరోపణలు సీఐ శివశంకర్‌పై ఉన్నాయి.
  • బాపట్ల టౌన్‌ సీఐగా పనిచేసిన కృష్ణయ్య తెదేపా నాయకులు, కార్యకర్తలపై అనేక అక్రమ కేసులు పెట్టి ఇబ్బందిపెట్టారు. బాపట్లలో జరిగే తెదేపా ఆందోళనల్లో తెలుగు యువత నాయకుడు కుర్రా ధనేంద్ర చురుగ్గా పాల్గొంటున్నారని ఏకంగా రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారు. దాన్ని ప్రశ్నించినందుకు తెదేపా బాధ్యుడు వేగేశన నరేంద్ర వర్మపై సీఐ కృష్ణయ్య చిందులు తొక్కారు. ప్రస్తుతం అతను అద్దంకి టౌన్‌ స్టేషన్‌లో పనిచేస్తున్నారు. ఆయనకు ముందు టౌన్‌ సీఐగా పనిచేసిన అశోక్‌ తెదేపా నాయకులు, కార్యకర్తలను అణచివేశారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్నారు.
  • బాపట్ల రూరల్‌ సీఐ శ్రీహరి తెదేపా వారిని బాగా ఇబ్బంది పెట్టారు. పోలింగ్‌ రోజున పడమట పిల్లిబోయినవారిపాలెంలో వైకాపా వాళ్లు రాళ్ల దాడిచేసి పోలింగ్‌ కేంద్రాల వద్ద హడావుడి చేస్తుంటే పట్టించుకోలేదు. వారు జరిపిన దాడిలో పలువురు తెదేపా కార్యకర్తలు గాయపడితే తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. వైకాపాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి కుమార్తె పొన్నూరు వద్ద కారు ప్రమాదకరంగా నడపటంతో ఓ మహిళపైకి దూసుకెళ్లి ఆమె చావుకు కారణమైనా ఎలాంటి కేసు లేకుండా చేశారు. ఇసుక మాఫియా ఆగడాలకు కళ్లెం వేయలేదు. ప్రస్తుతం ఎస్‌బీలో ఉన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని