logo

ఎన్నాళ్లీ ఇక్కట్లు?

రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న  అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్‌లోని మిలీనియం బ్లాక్‌లో గుండె, నరాలు, ట్రామాకేర్‌ విభాగాలు ఉన్నాయి.

Published : 29 Jun 2024 05:53 IST

జీజీహెచ్‌లో రోగులకు తప్పని పాట్లు
అయిదు లిఫ్టులున్నా మూడు పని చేయని వైనం
నగరంపాలెం, న్యూస్‌టుడే

మిలీనియం బ్లాక్‌లో ఒకే లిఫ్ట్‌ పని చేయడంతో వార్డుకు వెళ్లేందుకు స్ట్రెచర్‌పై ఎదురు చూస్తున్న రోగులు, సహాయకులు

రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న  అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్‌లోని మిలీనియం బ్లాక్‌లో గుండె, నరాలు, ట్రామాకేర్‌ విభాగాలు ఉన్నాయి. రోగులను ఇక్కడి వార్డులకు చేర్చాలంటే తప్పకుండా లిఫ్టులు ఉపయోగించాల్సిందే. జీజీహెచ్‌లో మొత్తం ఐదు లిఫ్ట్‌లు ఉన్నా రెండు మాత్రమే పని చేస్తున్నాయి. మరో మూడు ఏళ్ల తరబడి పని చేయకపోవడంతో రోగులు ఆయా వార్డులకు వెళ్లేందుకు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రోగులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది.

సర్వజనాసుపత్రిలో గుండె విభాగానికి సంబంధించి రోగులకు ఎక్కువగా 2డి-ఎకో పరీక్షను వైద్యులు సూచిస్తారు. ఆ పరీక్ష చేయించుకునేందుకు వచ్చే రోగికి తోడుగా సహాయకులు వస్తుంటారు. వీరంతా ఆయా విభాగాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఓవైపు అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే రోగులకు కనీసం స్ట్రెచర్లు, వీల్‌ఛైర్స్‌ సైతం అందుబాటులో లేకుండా పోతున్నాయి. మరోవైపు ఆ లిఫ్టుల్లోనే ఆయాలు, నర్సింగ్‌ సిబ్బంది వైద్య పరికరాలు తరలిస్తుండడంతో రోగులను తీసుకుని వెళ్లడానికి వేచి చూడాల్సి వస్తోందని సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు పొందేందుకు ఎన్నో వ్యయప్రయాసలు పడి వస్తే కనీసం ఆసుపత్రిలో ఉన్న లిఫ్ట్‌లు కూడా అందుబాటులో లేకపోవడం బాధాకరమని రోగులు, సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీలకమైన గుండె, నరాలు, ట్రామా కేర్‌ యూనిట్లకు రోగులను తరలించేందుకు ఐదు లిఫ్టుల్లో కేవలం ఒక్కటే అందుబాటులో ఉండటం పెద్దాసుపత్రికి చెడ్డపేరు తీసుకోస్తుంది. పని చేస్తున్న రెండింటిలో వైద్యులకు ఒకటి, రోగులకు మరొకటి అంటూ సిబ్బంది ఆంక్షలు పెడుతున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.

ఏళ్ల తరబడి పని చేయక..

జీజీహెచ్‌ ఆవరణలోని పొదిల ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌ సుమారు పదేళ్ల కిందల దాతల సహకారంతో నిర్మించారు. ప్రారంభ సమయంలో ఆసుపత్రి నిర్వహణ బాగుండేది. ప్రతి వార్డు ఆధునికంగా, శీతలీకరణ యంత్రాలు రోగికి ఎంతో వెసులుబాటుగా ఉండేవి. గత అయిదేళ్లలో మిలీనియం బ్లాక్‌ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. నిర్వహణ లోపంతో పారిశుద్ధ్యం, విద్యుత్తు వంటి సమస్యలు రోగులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. పదేళ్ల కిందట ఏర్పాటు చేసిన పొదిల ప్రసాద్‌ మిలీనియం బ్లాక్‌లోని ఐదు లిఫ్టుల్లో మూడు పని చేయడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పని చేయని లిఫ్టులను వినియోగంలోకి తీసుకురావాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు.

మరమ్మతులు చేయిస్తాం

పని చేయని లిఫ్టులను మరమ్మతులు చేయించేందుకు ఇప్పటికే నగదు చెల్లించామని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు. త్వరలోనే వాటిని బాగుచేయించి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు.

ఐసీయూ సమీపంలో పని చేయని లిఫ్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని