logo

ప్రత్తిపాడు సీఐ, ఎస్సైల సస్పెన్షన్‌

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్‌బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది.

Published : 29 Jun 2024 05:46 IST

విధి నిర్వహణలో అలసత్వమే కారణం

ప్రత్తిపాడు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్‌బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్‌ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది. ఈ నెల 27న చెరువు కట్టపై ఉన్న ఆక్రమణలను తొలగించాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడన్న అక్కసుతో తెదేపా నాయకుడు కమ్మా శివప్రసాద్‌పై వైకాపా మూకలు కత్తితో దాడి చేశాయి. ఆయా ఘటనలపై తగిన రీతిలో స్పందించకపోవడం, ఆ వివరాలను ఉన్నతాధికారులకు తెలియజేయకుండా దాచి పెట్టారనే ఆరోపణలపై ఇరువురినీ సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకెళితే.. కాలనీలో ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన కార్యకర్త పిల్లి రాజేశ్‌ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాన్ని తొలగించాలని అతడిపై ఎస్సై సోమేశ్వరరావు ఒత్తిడి తెచ్చారు. కొద్ది రోజులకు అదే కాలనీకి చెందిన వైకాపా కార్యకర్త పిల్లి జయరావు తన పిల్లల పుట్టిన రోజుకు అదే ఫ్రేమ్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటానని కోరడంతో రాజేశ్‌ అప్పటికే ఉన్న దాన్ని తొలగించారు. ఈ క్రమంలో జయరావు వైకాపా మాజీ మంత్రి, మరో ఇద్దరు నేతల చిత్రాలతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు రాసి డిప్యూటీ సీˆఎంను అసభ్యకరంగా, అవమానించేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తీసివేయాలని కోరినా పట్టించుకోకపోవడంతో రాజేశ్‌ దాన్ని బ్లేడుతో కోసేశారు. దీంతో జయరావు తిరిగి అలాంటి మరొక ఫ్లెక్సీని ఈ నెల 23న ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసి ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు గ్రామానికి చేరుకుని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో వైకాపా సానుభూతిపరులైన యువకులు చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. సవాళ్లు విసురుతూ పోలీసులను ఎదిరించి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అనంతరం ఎస్సై సోమేశ్వరరావు అక్కడకు చేరుకుని యువకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితి చేయిదాటి పోతుందని గ్రహించిన ఎస్సై సోమేశ్వరరావు పెదనందిపాడు ఎస్సై రాజ్‌కుమార్‌కు సమాచారం ఇచ్చారు. 24వ తేదీ ఉదయం వరకు ఇద్దరు ఎస్సైలు, సిబ్బంది గ్రామంలోనే ఉండి పంచాయతీ కార్యదర్శి నాగిరెడ్డి సూచనలతో పంచాయతీ కార్మికులతో వైకాపా ఫ్లెక్సీని తీయించేశారు. ఇంత జరిగినా ఆ వివరాలను పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి ఎస్సై సోమేశ్వరరావు తీసుకెళ్లలేదు. వరస ఘటనల నేపథ్యంలో విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో ఇద్దరినీ సస్పెండ్‌ చేశారు. సీˆఐ, ఎస్సైలు సార్వత్రిక ఎన్నికలకు ముందు బదిలీపై ప్రత్తిపాడు వచ్చారు. కాకుమాను ఎస్సై రవీంద్రకు ప్రత్తిపాడు ఎస్సైగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డీఎస్పీ మహబూబ్‌ బాషా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని