logo

గీత దాటితే వేటే

విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు.

Published : 29 Jun 2024 05:44 IST

నలుగురు సీఐలు, ఎస్సైల సస్పెన్షన్‌
కొందరికి ఛార్జి మెమోల జారీ

ఈనాడు - అమరావతి: విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు. బాధ్యులైన ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలను రోజుల వ్యవధిలోనే సస్పెండ్‌ చేశారు. మరికొందరికి ఛార్జి మెమోలిచ్చి వివరణ కోరడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది. గతంలో మాదిరిగా ఉదాసీనంగా వ్యవహరించే పరిస్థితి లేదని తన చర్యల ద్వారా ఐజీ స్పష్టమైన సంకేతాలిచ్చారు.

శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. గత ఎన్నికల ప్రచారంలోనూ ఇదే విషయాన్ని వారు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలకమైన పోలీసు యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. కిందిస్థాయి యంత్రాంగం పనితీరును నిశితంగా పరిశీలిస్తూ.. నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఇటీవల చీరాల రూరల్‌ స్టేషన్‌ పరిధిలో ఓ యువతిపై హత్యాచారం ఘటనను తెదేపా కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబునాయుడు వెంటనే స్పందించి హోంమంత్రి అనితను సంఘటన ప్రదేశానికి పంపించారు. ప్రత్యేక బృందాలు నిందితులను రోజుల వ్యవధిలోనే పట్టుకున్నాయి. రెండు రోజుల క్రితం గొట్టిపాడులో ఫ్లెక్సీ వివాదం రేగింది. దీన్ని నియంత్రించడంలో ప్రత్తిపాడు సీఐ నిస్సార్‌బాషా, ఎస్సై సోమేశ్వరరావు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఐజీ నిర్ధారించుకుని వారిని సస్పెండ్‌ చేశారు. జనసేన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దీక్షలో ఉండగా బూట్లతో లోపలికి చొచ్చుకెళ్లడం, అక్కడ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మంగళగిరి పట్టణ సీఐ ఎం.శ్రీనివాసరావును వీఆర్‌కు పంపించారు. బాపట్ల జిల్లా చీరాల రూరల్, ఒకటో పట్టణ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న హత్యలకు పోలీసు అధికారులతోపాటు కొందరు కానిస్టేబుళ్లు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండడమే కారణమని గుర్తించి ఛార్జిమెమోలిచ్చారు. పల్నాడు జిల్లా నకరికల్లు ఎస్సై రాంబాబు విధుల్లో అప్రమత్తంగా ఉండడం లేదని, ప్రకాశం జిల్లా చీమకుర్తి సీఐ ఒ.దుర్గాప్రసాద్‌ నమోదు చేసిన కేసుల్లో డొల్లతనం ఉందని గుర్తించి సస్పెండ్‌ చేశారు. రోజుల వ్యవధిలోనే వీరందరిపైనా చర్యలు తీసుకోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని