logo

ఎంబుక్‌ రికార్డుపై గందరగోళం

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్‌ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్‌వర్గాల్లో గందరగోళం నెలకొంది.

Published : 29 Jun 2024 05:34 IST

ఏఈలతో చేయిస్తే వెనక్కి పంపిన కమిషనర్‌
నగరపాలక సంస్థ తీరుపై గుత్తేదారుల గరంగరం
ఈనాడు - అమరావతి

గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్‌ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్‌వర్గాల్లో గందరగోళం నెలకొంది. ఈ విభాగం తన ఏఈలతో ఎంబుక్‌ రికార్డు చేసి బిల్లుల కోసం పంపిన దస్త్రాలను కమిషనర్‌ అంగీకరించలేదు. వాటిని ఎమినిటీ సెక్రటరీలు రికార్డు చేయాలంటూ వెనక్కి పంపేశారు. ఈ వ్యవహారం నగరపాలక సంస్థలో చర్చనీయాంశంగా మారింది. పనులు చేశాక బిల్లులు ఎన్నాళ్లకు మంజూరవుతాయో గత వైకాపా హయాంలో అయోమయంగా ఉండేది. చివరకు గుత్తేదారులు కోర్టులను ఆశ్రయించాల్సి వచ్చేది. అసలు చేసిన పనులను ఎంబుక్‌ రికార్డు చేయడానికే నెలల తరబడి సమయం తీసుకుంటున్నారు. ఇక చెల్లింపులకు ఎంతకాలం పడుతుందోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఏఈలకే ఆ ఆధికారం

గత కొన్నేళ్లుగా పనుల వివరాలను తొలుత ఆ ప్రాంత ఏఈలు ఎంబుక్‌లో నమోదు చేస్తున్నారు. అసలు ఈ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ప్రస్తుతం ఇంజినీరింగ్‌ అధికారులకు స్పష్టత లేకుండాపోయింది. గత జనవరి, ఫిబ్రవరిలో చేసిన పనులను నగరపాలక సంస్థ ఏఈలు రికార్డు చేయగా.. వాటిని డీఈలు చెక్‌ మెజర్‌మెంట్‌ చేశారు. వీటిల్లో 30 శాతం పనులను ఈఈలు చెక్‌ చేసి ఎస్‌ఈకి పంపించారు. ఎస్‌ఈ నిర్ధారించాక కమిషనర్‌ లాగిన్‌కు పంపారు. చాలారోజుల తరువాత పరిశీలించిన కమిషనర్‌.. ఎంబుక్‌ రికార్డు ఏఈలు చేయడమేమిటంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అధికారం సచివాలయాల్లో ఉండే ఎమినిటీ సెక్రటరీలకు అప్పగించారని, వారితో రికార్డు చేయించి ప్రాసెస్‌ చేయాలని ఆదేశించి.. రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు విలువైన 60 బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. దీంతో గుత్తేదారులు లబోదిబోమంటున్నారు.

ఇదీ గుత్తేదారుల వాదన

ఏఈ స్థాయి అధికారి ఎంబుక్‌ రికార్డు చేస్తే చెల్లదంటున్నారు... ఏమాత్రం అర్హతల్లేని ఎమినిటీస్‌ సెక్రటరీలకు ఆ బాధ్యత అప్పగించడం సరికాదని గుత్తేదారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు చెప్పినట్టు ఎమినిటీస్‌ సెక్రటరీలు రికార్డు చేశాక కూడా.. ఆ బిల్లులను సీఎఫ్‌ఎంఎస్‌కు పంపడమో లేక చెక్కులు రాసి ఇవ్వడమో చేయకుండా పెండింగ్‌లో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. వాటిని ప్రాసెస్‌ చేయకుండా ఇంజినీరింగ్‌ అధికారులు మిన్నకుండిపోయారని ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు.

  • ఒక్కో పని విలువ సగటున రూ. 10 లక్షల నుంచి రూ. 40 లక్షల వరకు ఉంది. వీటిని చిన్న గుత్తేదారులు చేశారు. ఒక్క ఎంబుక్‌ రికార్డు చేయడానికే యంత్రాంగం నాలుగు నెలలుగా దోబూచులాడుతోందని, ఇలాగైతే తామెలా పనులు చేస్తామని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.
  •  వైకాపా హయాంలో గడపగడపకు మన ప్రభుత్వం కింద చేసిన పనులకు వెంటనే బిల్లులు చెల్లిస్తామని, ఆ నిధులు కలెక్టరు ఖాతాలో ఉన్నాయని నమ్మించారు. తీరా పనులు పూర్తయ్యాక పది నెలలైనా బిల్లులివ్వలేదు. దీంతో చాలామంది గుత్తేదారులు గుంటూరు నగరపాలకసంస్థపై కోర్టుకెళ్లారు. తరువాత ఎంబుక్‌ రికార్డు పేరు చెప్పి బిల్లులను పక్కనబెట్టారని వారు గుర్రుమంటున్నారు. కొంతమంది బిల్లుల విషయంలో మాత్రం ఉన్నతాధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారని, మిగిలినవారివి ఎందుకు పక్కన పెడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. జీటీ రోడ్డు ప్రాంతంలో రూ. 18 లక్షలతో పైపులైన్‌ పనులు చేస్తే ఇంతవరకు బిల్లులు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారని ఓ గుత్తేదారు వాపోయారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని