logo

వెలుగుల మాటున చీకటి దందా!

నాటి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ అవసరానికి మించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు నియంత్రికల (ట్రాన్స్‌ఫార్మర్లు)ను కొనుగోలు చేయించింది.

Published : 29 Jun 2024 05:24 IST

నిరుపయోగంగా వేలాది నియంత్రికలు
‘షిరిడీసాయి’కి లబ్ధి కోసం అడ్డదిడ్డంగా కొనుగోళ్లు

గుంటూరులోని విద్యుత్తుశాఖ ఎస్‌ఈ కార్యాలయంలో నియంత్రికలు

అవసరం ఉందా..? లేదా..? అని చూడలేదు.. ఒక ప్రణాళికంటూ లేదు.. వేలాది విద్యుత్తు నియంత్రికలను కొనుగోలు చేసేశారు... ఏడాదిన్నరగా వృథాగా పడి ఉన్న వాటిని వినియోగించే దారే కనబడడం లేదు... నాటి వైకాపా పెద్దల మెప్పు కోసం వారు చెప్పారని షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌కు భారీగా లబ్ధి చేకూర్చిన విద్యుత్తు శాఖ ఉన్నతాధికారుల నిర్వాక ఫలితమిది...

ఈనాడు - అమరావతి: నాటి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితమైన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థ అవసరానికి మించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు నియంత్రికల (ట్రాన్స్‌ఫార్మర్లు)ను కొనుగోలు చేయించింది. గుంటూరు ఎస్‌ఈ కార్యాలయ ఆవరణ, బాపట్ల, నరసరావుపేటలోని ప్రైవేటు స్థలంలో 25, 100 కేవీ నియంత్రికలు వేలాదిగా వృథాగా పడి ఉన్నాయి. మరికొన్నింటిని జిల్లా విద్యుత్తు సామగ్రి నిల్వ కేంద్రం (స్టోర్స్‌)లో ఉంచారు. వీటిని కొనడంలో శ్రద్ధ చూపించిన అధికారులు.. అనుబంధ సామగ్రి విషయాన్ని మరచిపోయారు. మరోవైపు వ్యవసాయం, గృహ, వాణిజ్య సర్వీసులకు మంజూరు చేసిన చోట నియంత్రికలు అమర్చడానికి అవసరమైన పరికరాల్లేక సకాలంలో పనులు పూర్తి చేయలేకపోతున్నారు.

విద్యుత్తు సంస్థపై పెనుభారం

  • అప్పట్లో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఉన్నతస్థాయిలో ఈ కొనుగోళ్లు జరిపారు. అవసరానికి మించి వచ్చినా ఇక్కడి అధికారులు మిన్నకుండిపోయారు. వీటిని నిల్వ చేయడానికి స్థలం లేక ప్రైవేటు స్థలాలను తీసుకోవాల్సి వచ్చింది.
  • గత ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ, గృహ, వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కనెక్షన్లు మంజూరు చేసి నియంత్రికలను అమర్చినా ఇంకా భారీగా మిగిలిపోయాయి.
  • వృథాగా ఉంటే అనేక నష్టాలున్నాయని ఆ శాఖ ఇంజినీర్లు వాపోతున్నారు. ఆరుబయట ప్రదేశాల్లో ఏడాదిన్నరగా ఉంచేయడం వల్ల వాటి పనితీరు, సామర్థ్యం తగ్గిపోతాయని చెబుతున్నారు. వాడుకలో ఉంటేనే మన్నిక పెరుగుతుందని, నిల్వ చేయడం వల్ల తేమ చేరి దెబ్బతింటాయని వివరించారు.
  • నియంత్రిక తయారీ తేదీ నుంచి ఐదేళ్లపాటు గ్యారంటీ ఉంటుంది. ఈ సమయంలో అది విఫలమైతే కొత్తది సరఫరా చేస్తారు. ఏడాదిన్నర కిందట కొనుగోలు చేయడంతో గ్యారంటీ కాలం తగ్గిపోతుందని వాపోతున్నారు.
  • ఈ అనవసర కొనుగోళ్ల వల్ల సంస్థపై మోయలేని ఆర్థిక భారం పడింది. ఆర్థికంగా, సాంకేతికంగా అనేక నష్టాలున్నాయని తెలిసినా.. తయారీ కంపెనీకి లబ్ధి చేకూర్చాలన్న ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే వీటిని భారీగా కొనుగోలు చేశారు.

అనుబంధ సామగ్రి ఏదీ

నియంత్రికలు, ఎర్త్‌ పైపులను అవసరాలకు మించి కొనుగోలు చేసిన ఉన్నతాధికారులు.. వాటికి అనుబంధంగా ఉన్న సామగ్రిని కొనలేదు. అవసరమైనప్పుడు అప్పటికప్పుడు కొంటున్నారు. కీలకమైన కండక్టరు (వైరు), హెచ్‌జీ ఫ్యూజ్‌ సెట్‌లు, పీవీసీ కేబుల్‌ కొరత పీడిస్తున్నాయి. నూతన కనెక్షన్లు ఇవ్వడానికి, లైన్లు వేయడానికి సామగ్రి లేక సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు. ఒక నియంత్రిక అమర్చాలంటే అందుకు సంబంధించిన సామగ్రి మొత్తం సరఫరా చేస్తేనే పనులు వెంటనే పూర్తవుతాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో మొత్తం వ్యవహారంపై సమీక్ష చేస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి రావడం ఖాయం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని