logo

కొత్త వంతెన వస్తోంది!

గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్‌విలాస్‌ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్‌.

Published : 29 Jun 2024 05:14 IST

పాత, కొత్త నగరాల అనుసంధానానికి రెండు ప్రతిపాదనలు
కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్‌ ఆదేశాలతో కదిలిన యంత్రాంగం
ఈనాడు - అమరావతి

గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్‌విలాస్‌ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్‌. ప్రతిసారీ ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. మున్సిపల్, రైల్వే, ఆర్‌అండ్‌బీ శాఖల సమన్వయంతో నిర్మించాల్సి ఉంది. ఈ క్రమంలో ట్రాఫిక్‌ మళ్లింపు, రైల్వేశాఖతో సమన్వయం వంటి సమస్యలతో నిర్మాణం వాయిదా పడుతూ వచ్చింది. కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ నూతన వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించడంతో ఇన్నాళ్లకు కదలిక వచ్చింది. ఈ మేరకు మున్సిపల్, రైల్వే, ఆర్‌అండ్‌బీ అధికారులతో సమావేశమై.. వివిధ శాఖల నుంచి రావాల్సిన అనుమతులు, ఎదురవుతున్న అడ్డంకులు, ప్రస్తుత పరిస్థితులపై సమీక్షించారు. కేంద్రం నుంచి నిధులొచ్చే అవకాశం ఉన్నందున యుద్ధప్రాతిపదికన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను 30 నుంచి 45 రోజుల వ్యవధిలో తయారు చేయాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఆర్‌అండ్‌బీ ఇంజినీర్లు ఒక కన్సల్టెంట్‌ సంస్థకు అప్పగించారు.

నాలుగు వరుసలుగా...

  • రెండు వరుసలుగా శంకర్‌విలాస్‌ వంతెన నిర్మించి 68 సంవత్సరాలైంది. పెరిగిన రద్దీకి ఇది సరిపోవడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌ భారీగా స్తంభించిపోతోంది. ఒక్కోసారి వంతెన దాటడానికి 30 నిమిషాల సమయం పడుతోంది.
  • ఆర్‌అండ్‌బీ ఇంజినీర్ల లెక్క ప్రకారం రోజూ దాదాపు 3 లక్షల మంది ఈ వంతెన మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు.
  • పాత, కొత్త నగరాలను అనుసంధానించడంలో ఇది అత్యంత కీలకం.
  • ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా కొత్త వంతెనను నాలుగు వరుసలుగా నిర్మించాలని ఆర్‌అండ్‌బీ అధికారులు చేసిన ప్రతిపాదన దశాబ్దకాలంగా ఆచరణలోకి రాలేదు.
  • రాష్ట్రంలో తెదేపా కూటమి అధికారంలోకి రావడం, కేంద్రంలో ఎన్డీయేలో భాగస్వామి కావడంతో దిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి వంతెన పనులు చేపట్టడానికి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్‌) నుంచి నిధులొచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఆయన ఇంజినీర్లకు సూచించారు. కేంద్రం అనుమతించిన ప్రతిపాదన ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నారు.

తొలి ప్రతిపాదన ఇలా..

పాత వంతెన పూర్తిగా తీసేయాలి. 112 అడుగుల వెడల్పు, 1.05 కిలోమీటర్ల పొడవుతో నాలుగు వరుసలుగా నిర్మించడానికి రూ. 108 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఇందులో రూ. 98 కోట్లను కేంద్రం; తాగునీటి పైపులైన్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్తు, టెలిఫోన్‌ లైన్ల మార్పిడికి నగరపాలక సంస్థ రూ. 2 కోట్లు; భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 8 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. అరండల్‌పేట 9వ లైను నుంచి అటువైపు మహిళా కళాశాల రోడ్డు వరకు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న రహదారిని రెండువైపులా సర్వీసు రోడ్డుగా ఉపయోగించుకోవచ్చు.

రెండో ప్రతిపాదన.. ఎలివేటెడ్‌ ఆర్వోబీ

ప్రస్తుతం ఉన్న పాత వంతెనను అలాగే ఉంచి.. దానిపైన 20 అడుగుల ఎత్తులో ఎలివేటెడ్‌ ఆర్వోబీ నిర్మించాలి. ఇందుకు సుమారు రూ. 170 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. 120 అడుగుల వెడల్పుతో 1.55 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. నాలుగు వరుసలతో లాడ్జి సెంటర్‌ నుంచి హిందూ మహిళా కళాశాల కూడలి వరకు నిర్మించాలి. నిధులు మొత్తం కేంద్ర ప్రభుత్వంలోని మోర్త్‌ నుంచి తెచ్చుకోవాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న వంతెన, రహదారులను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు.

ఈ రెండు ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఆమోదం లభించిన ప్రతిపాదనకు అనుగుణంగా పనులు చేపడతారు. ఈ నేపథ్యంలో అధికారులు యుద్ధప్రాతిపదికన డీపీఆర్‌ తయారీపై దృష్టి పెట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని