logo

జగనన్న కాలనీల్లో రూ.కోట్ల దోపిడీ

జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్‌.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి.

Published : 29 Jun 2024 05:08 IST

వైకాపా నేతల చేతివాటం
రైతులకు చేసిన మోసాలు వెలుగులోకి

సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల జగనన్న కాలనీ

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్‌.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. భూములిచ్చిన రైతుల ద్వారా ఇప్పుడవన్నీ బయటపడుతున్నాయి. జిల్లాలో జగనన్న కాలనీ లేఔట్‌ పేరిట ఇళ్లు నిర్మిస్తాం అంటూ ప్రైవేట్‌ వ్యక్తులు, రైతుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి గత ప్రభుత్వానికి మాత్రం మార్కెట్‌ కంటే రెండింతల అధిక ధరకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. ఇప్పుడా రైతులంతా మా డబ్బు మాకిప్పించాలంటూ ఎమ్మెల్యేలు, ఎస్పీకి విన్నవించుకుంటున్నారు. తాజాగా చిలకలూరిపేట పసుమర్రు రైతులు అప్పట్లో మాజీమంత్రి రజినికి ఇచ్చిన డబ్బులను తిరిగి వసూలు చేయించుకోవడంలో సఫలీకృతులయ్యారు. పసుమర్రు శివారు గ్రామం గుదేవారిపాలెం రైతులు కూడా మాజీమంత్రి అనుచరులు చేసిన మోసాన్ని సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.

ఇవిగో మోసాలు..

 వినుకొండ పట్టణానికి దూరంగా 7 కిలోమీటర్ల దూరంలోని వెంకుపాలెం, జాలలపాలెం మధ్యలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు చెందిన సుమారు 125 ఎకరాల్లో జగనన్న లేఔట్‌ వేశారు. ఇక్కడ గతంలో ఆయన ఎకరా రూ.4.5 లక్షలకు కొనుగోలు చేశారు. ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం కూడా ధర అంతే ఉంది. వ్యవసాయానికి పనికిరాని భూములు. కానీ ఎకరా రూ.18 లక్షలు చొప్పున గత ప్రభుత్వం ఆయన వద్ద కొనుగోలు చేసింది.

నూజండ్లలో ఎకరం రూ.14 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్‌ ప్రకారం రూ.6 లక్షలే. ఎకరం అరవై సెంట్లు ఇక్కడ కొనుగోలు చేశారు. అంబాపురంలో ఎకరం రూ.12 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ మార్కెట్‌ ప్రకారం రూ.6 లక్షలే. 3 ఎకరాల లేఔట్‌ ఉంది ఇక్కడ. పమిడిపాడులో రూ.10 లక్షలకు కొనుగోలు చేశారు. కానీ ఇక్కడ మార్కెట్‌ ధర రూ.5 లక్షలే. ఇలా ఐదు ఎకరాలను గత ప్రభుత్వానికి అమ్మారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని