logo

ముద్దగా అన్నం.. అర్ధాకలితో సతమతం

ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 29 Jun 2024 05:04 IST

రుచి లేకుండా వంటలు
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థినుల అవస్థలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట

ఆహారం బాగా లేదని చెబుతున్న బొల్లాపల్లి కేజీబీవీ విద్యార్థినులు

ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవో వచ్చి విచారణ చేపట్టారు. సరకుల సరఫరాలో గుత్తేదారు చేతివాటంతో అరకొరగా నిత్యావసర వస్తువులు వస్తున్నాయని, అందుకే సరిపడా వండడం లేదని అప్పట్లో గుర్తించారు.

తాజాగా బొల్లాపల్లి మండలంలోని కస్తూర్బాలో తమకు సరైన అన్నం పెట్టడం లేదని విద్యార్థినులంతా బోరున విలపించడం.. అదీ ఎమ్మెల్యే విద్యాకానుక కిట్ల పంపిణీకి వచ్చిన సమయంలో సమస్యలేమైనా ఉంటే చెప్పండని అడిగినప్పుడు ఒక విద్యార్థిని ధైర్యంగా నిల్చోని అన్నం సరిగా ఉండడం లేదని ఏడుస్తూ చెప్పింది. అంతేకాకుండా ఆమె చెబుతున్నప్పుడు మిగతా విద్యార్థినులు కూడా విలపించడంతో అక్కడున్న వారంతా బాధపడ్డారు. పై రెండు ఘటనలు కేవలం వెలుగులోకి వచాయి. కానీ బయటకు రాని ఘటనలెన్నో. చెబితే ఏమవుతుందోనని భయం. వేధింపులుంటే తట్టుకోవడం కష్టం. చేసేదిలేక తమలో తామే కష్టాల్ని దిగమింగుకుంటూ చాలీచాలని ఆహారాన్ని, ముద్దగా ఉన్నా, ఉడికీ ఉడక్కపోయినా భరిస్తూ ఆకలి తీర్చుకుని తరగతి గదులకు వెళ్తున్న విద్యార్థినులు ఎందరో ఉన్నారు. కస్తూర్బా విద్యాలయాలకు కొన్ని నియమాలు ఉండడంతో బయటవ్యక్తుల్ని లోపలకు రానివ్వరు. దీంతో లోపల ఏం జరుగుతుందో బయటకు తెలియదు. అంతేకాకుండా అధికారులు వచ్చినప్పుడు ఏమైనా బయటకు చెబితే ఆ తర్వాత వాళ్లకు తరగతిగదుల్లో కక్షసాధింపు చర్యలుంటాయి. దీంతో ఎందుకొచ్చిన తంటా అని బాలికలంతా పెట్టింది ఎలా ఉన్నా కళ్లుమూసుకుని తింటున్నారు. ఒక్కో విద్యార్థిని ఆహారానికి సంబంధించి ప్రభుత్వం నెలకు రూ.1400 ఖర్చుపెడుతోంది. ఇవీ సరిపోవడం లేదు. మరోపక్క ఇచ్చేదే తక్కువ అయితే అందులో గుత్తేదారులు కొంత నొక్కుతున్నారు. డబ్బులు మిగుల్చుకోవడానికి కొంతమంది తక్కువ రకం సరకులు సరఫరా చేస్తుంటారు. దీనికితోడు వంట మనుషులు. తమకు ఏమీ దక్కనివ్వడం లేదనే ధోరణిలో ఉంటూ రుచీపచీలేకుండా వండుతుంటారు. ఏమైనా అంటే సరిపడా సరకులు ఇవ్వరని, తామేం చేసేది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. తక్కువ సరకులు ఇచ్చి ఎక్కువ మందికి వండమంటే ఎలా? అంటూ ఉపాధ్యాయుల వైపు వేలు చూపే పరిస్థితి. ఉపాధ్యాయులకు, వంట వారికి చాలా కస్తూర్బాల్లో పొసగదు. మధ్యలో విద్యార్థినులు నష్టపోతున్నారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులు కూడా తమ పిల్లల వంటివారేనని భావించరు. పెట్టింది తినాలంటూ కసురుకుంటారు. ముఖ్యఅతిథులు ఎవరైనా పాఠశాలకు వచ్చినప్పుడు గట్టిగా అడిగితే ఏడుస్తూ అసలు విషయం బయట పెడుతున్నారు.

ఎమ్మెల్యే జీవీ తనిఖీతో సమస్య వెలుగులోకి...

‘‘విద్యాకానుక కిట్ల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విద్యార్థినుల కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఏం పరవాలేదు.. ధైర్యంగా చెప్పండని ప్రోత్సహించడంతో ఒక బాలిక ధైర్యంగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లి అన్నం సరిగా పెట్టడం లేదని, బాగుండడం లేదని ఏడుస్తూ చెప్పింది. ఆ బాలిక చెప్పడంతో అక్కడే ఉన్న మిగతా విద్యార్థినులు కూడా ముక్తకంఠంతో అవునంటూ ముందుకొచ్చారు. ఆ సమయంలో బాలికల్లో దుఃఖం ఒక్కసారిగా పొంగుకొచ్చింది’’ ఆహార నాణ్యతపై కస్తూర్బా అధికారులను వివరణ అడగ్గా ‘సరకుల్లో కొరత లేదని, గుత్తేదారులు కూడా సక్రమంగానే సరఫరా చేస్తున్నారని, కొత్తబియ్యం కావడం వల్ల అన్నం మాత్రమే ముద్దగా అవుతోందని జీసీడీవో రేవతి ‘ఈనాడు’తో చెప్పారు. ఇప్పటికైనా అధికారులు, ఉపాధ్యాయులు ఆలోచించి బాలికల బాగోగులకు కృషి చేయాలని కోరుకుందాం. ప్రజాప్రతినిధులు సైతం తమ పరిధిలోని పాఠశాలలను తరచూ సందర్శించి సమస్యలు తెలుసుకుంటే విద్యార్థులకు మేలు జరుగుతుంది.

  • పిడుగురాళ్ల కేజీబీవీలో సెప్టింగ్‌ ట్యాంకు సమస్య ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతోంది. దీంతో వసతిగృహాల్లో విద్యార్థినులు భరించలేని దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మోటారు పదేపదే మొరాయిస్తోంది. నీటి సమస్య నెలకొంది.
  • 2 దుర్గి మండలం కేజీబీవీలో తాగునీటి సమస్య వేధిస్తోంది. మోటారు లేదు. పంచాయతీ నుంచి కొళాయి కనెక్షన్‌ ఇచ్చారు. దీని ద్వారా వచ్చేనీరే గతి. ఎప్పుడైనా సరఫరాలో అంతరాయం కలిగితే చాలాకష్టం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని