logo

బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారు

మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్‌ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్‌ క్రషర్స్‌ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.

Published : 29 Jun 2024 04:58 IST

మాజీ మంత్రి రజిని, ఆమె మరిది గోపి, పీఏ రామకృష్ణపై ఫిర్యాదు

అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీపతికి ఫిర్యాదు చేస్తున్న బాధితులు

చిలకలూరిపేట గ్రామీణ, న్యూస్‌టుడే : మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్‌ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్‌ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్‌ క్రషర్స్‌ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. బాధితుల వివరాల మేరకు.. 2010 నుంచి నంబూరి శ్రీనివాసరావు, కట్టా శ్రీనివాసరావు, రావిపాటి వేణుగోపాలకృష్ణ కలిసి స్టోన్‌ క్రషర్‌ వ్యాపారం చేసుకుంటున్నాం. 2020 సెప్టెంబరు 4న రజిని పీఏ మా క్రషర్‌ వద్దకు వచ్చి రూ.5 కోట్లు ఎమ్మెల్యేకు ఇవ్వాలని చెప్పారు. అన్ని అనుమతులతో నడుపుతున్నామని, కరోనా వల్ల వ్యాపారాలు లేవని, నగదు ఇవ్వలేమని చెప్పగా భయభ్రాంతులకు గురి చేశారు. అదే సంవత్సరం సెప్టెంబరు 11న విజిలెన్స్‌ ఎస్పీ జాషువా సిబ్బందితో వచ్చి మా క్రషర్‌లో అవకతవకలు జరిగాయని రూ.50 కోట్లు కట్టాలని బెదిరించి వెళ్లారు. నెల తర్వాత జాషువా ఫోన్‌ చేసి ఎమ్మెల్యే రజినితో మాట్లాడుకోండి లేకపోతే రూ.50 కోట్లు జరిమానా వేస్తామని, క్రషర్‌ సీజ్‌ చేస్తామని బెదిరించారు. విధిలేక ఎమ్మెల్యేను కార్యాలయానికి వెళ్లి కలవగా తన పీఏ రామకృష్ణను సంప్రదించమని సూచించారు. అతను రూ.5 కోట్లకు సెటిల్‌ చేస్తానని చెప్పగా.. అంత ఇచ్చుకోలేమని సంస్థలో కొంత వాటా ఇస్తామని ప్రాధేయపడ్డాం. అయినా వినకుండా డబ్బులు మాత్రమే కావాలని బెదిరించారు.. దీంతో కొంత గడువు కోరగా సరే అని చెప్పి పంపారు. మార్చి 2021లో విజిలెన్స్‌ ఎస్పీ జాషువా మమ్మల్ని పిలిపించి విడదల గోపిని కలిసి త్వరగా విషయం సెటిల్‌ చేసుకోమని బెదిరించారు. వారం రోజుల్లో చేసుకోకపోతే జరిమానా రాసి కేసు ఫైల్‌ చేస్తానని చెప్పారు. భయపడి విడదల గోపిని కలిసి ప్రాధేయపడగా తనకు రూ.10 లక్షలు, ఎస్పీ జాషువాకు రూ.10 లక్షలు, ఎమ్మెల్యే రజినికి రూ.2 కోట్లు ఇవ్వాలని బెదిరించారు. దీంతో బంధువులు, మిత్రుల వద్ద అప్పు తీసుకుని 2021 ఏప్రిల్‌ 4న పురుషోత్తమపట్నంలోని విడదల గోపికి ఇంటి వద్ద ఆ మొత్తం ఇచ్చాం. విషయం ఎవరికైనా చెబితే క్రిమినల్‌ కేసులు  పెట్టడమే కాకుండా వ్యాపారం పూర్తిగా నిలిపివేస్తామని, ప్రాణహాని కలిగిస్తామని బెదిరించారు. దీంతో భయపడి ఏమీ చేయలేకపోయాం. ప్రస్తుతం అధికారం మారడంతో న్యాయం జరగుతుందనే ధైర్యంతో ఫిర్యాదు చేశామని బాధితులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని