logo

అరాచకాలు చేసి.. అడ్డంగా దొరికేసి..

ఇరవై ఏళ్లు అక్రమాలు.. అరాచకాలతో మాచర్లను ఏలిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పతనం ఈవీఎం యంత్రం ధ్వంసంతో ప్రారంభమైంది.

Updated : 27 Jun 2024 08:06 IST

ఈవీఎం ధ్వంసంతో పిన్నెల్లి పతనం ప్రారంభం
మహిళలని చూడకుండా అసభ్యపదజాలంతో దూషణలు
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అరెస్టు

అరెస్టు అనంతరం వైద్య పరీక్షలకు ప్రభుత్వ ఆసుపత్రికి పిన్నెల్లి తరలింపు

ఈనాడు డిజిటల్, నరసరావుపేట: ఇరవై ఏళ్లు అక్రమాలు.. అరాచకాలతో మాచర్లను ఏలిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పతనం ఈవీఎం యంత్రం ధ్వంసంతో ప్రారంభమైంది. అంతవరకూ అతని అరాచకాలను ప్రపంచం వినడమే తప్పించి చూసింది లేదు. సార్వత్రిక ఎన్నికల  పోలింగ్‌ రోజు రెంటచింతల మండలం పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రం 202లో ఈవీఎం యంత్రాన్ని ధ్వంసం చేసే దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవ్వడం పోలింగ్‌ ముగిసిన కొన్నిరోజుల తర్వాత అవీ బయకు రావడంతో పిన్నెల్లి అరాచకాన్ని యావత్తు దేశం కళ్లారా చూసింది. అధికారంలో ఉన్న అప్పటి ఎమ్మెల్యే ఇలా చేయడం ఏంటని అందరూ విస్తుపోయారు. అప్పటివరకూ అతని అరాచకాన్ని వినడమే తప్ప కళ్లారా చూడలేదని ఎంతోమంది అనంతరం చర్చించుకున్నారు.

నిలదీసిన తెదేపా ఏజెంటుపై దాడి..

పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం యంత్రాన్ని ఎందుకు ధ్వంసం చేశావని నిలదీసిన తెదేపా ఏజెంటు నంబూరి శేషగిరిరావుపై గొడ్డలితో దాడి చేశారు. బయటకు వస్తున్న ఎమ్మెల్యేను ఇద్దరు మహిళలు కూడా ధైర్యంగా అడ్డుకుని ఎందుకు ధ్వంసం చేశారని నిలదీశారు. మహిళలకు వేలు చూపిస్తూ అసభ్యపదజాలం వాడుతూ బెదిరింపులకు దిగారు. ఇవన్నీ సీసీ కెమెరాల ద్వారా రికార్డయి ప్రపంచానికి అతని అరాచకత్వాన్ని కళ్లకు కట్టాయి.

మహిళలనూ దూషించి..

ఒక ప్రజాప్రతినిధి ఈవీఎం ధ్వంసం చేయడమే కాకుండా మహిళలను అసభ్యపదజాలంతో దూషించడంతో సమాజం అతన్ని చీదరించుకుంది. ఇప్పటివరకూ ఏవైనా కేసులుంటే వాటి నుంచి తప్పించుకోవడం అరెస్టు కాకుండా బయటపడడం చేశారు. కానీ సీసీ కెమెరాల్లోనే సాక్ష్యం రికార్డు కావడంతో తప్పించుకోవడం పిన్నెల్లి వల్ల కాలేదు. పోలింగ్‌ రోజున చేసిన అరాచకం సరిపోలేదని మరుసటి రోజు అంటే మే 14న కూడా కారంపూడిలో విధ్వంసం సృష్టించారు. పోలింగ్‌ చరిత్రలోనే ఇంతవరకూ కారంపూడిలో ఒక్క గొడవ కూడా జరగలేదని, అలాంటిది ఈసారి పోలింగ్‌ అనంతరం అరాచకవాదులు చేలరేగిపోయారని స్థానికులు పేర్కొన్నారు. తన కార్యకర్తలను పరామర్శిస్తానని వెళ్లి.. ముందస్తు ప్రణాళిక ప్రకారమే తెలంగాణ నుంచి 300 మందిని కార్లలో రప్పించుకుని కర్రలు, మారణాయుధాలతో కారంపూడిలో దాడులకు తెగబడ్డారు. ‘తెలుగుదేశం పార్టీకి చెందిన ఎవరో ఒకరిని చంపితే కానీ మా జోలికి రాకుండా ఉంటారు’ అంటూ అరుస్తూ వీధుల్లో రాడ్లతో దొరికిన వారిపై దాడి చేశారు. అప్పుడు కారులో పిన్నెల్లి ఉండి అల్లరిమూకను దాడులకు ప్రోత్సహించారు. దాడుల్ని అడ్డుకోబోయిన అప్పటి కారంపూడి సీఐ నారాయణస్వామిపై కూడా తెగబడ్డారు. సీఐ మెడపై నుంచి రక్తం కారుతున్న వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఇలా సామాన్యులు, పోలీసులు అని చూడకుండా ఎవరు అడ్డొచ్చినా వారిపై దాడులకు తెగబడుతూ చేసిన అరాచకానికి నేడు అరెస్టు అయ్యారు.

నెల తర్వాత అరెస్టు

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల తర్వాత అరెస్టు చేశారు. మే 28న ఆయన హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్‌ తెచ్చుకున్నారు. అంతేకాకుండా ఇప్పటివరకూ కోర్టు పొడిగిస్తుండడంతో ఆయన అరెస్టు కాకుండా తప్పించుకోగలిగారు. ఎట్టకేలకు హైకోర్టు బెయిల్‌ రద్దు చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. మాచర్ల నియోజకవర్గాన్ని నియంతలా ఏలుతూ తనకు అడ్డేలేదనుకున్న పిన్నెల్లి చివరకు జైలుపాలయ్యారు.

నాడు తప్పించుకుని..

  • పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నో అక్రమాలు, అరాచకాలకు పాల్పడినా కేసులు నమోదైనా అరెస్టు కాకుండా ఇప్పటివరకూ తప్పించుకున్నాడు. కానీ చివరకు పూర్తి సాక్ష్యాలతో అడ్డంగా దొరికిపోయాడు.
  • 2004-05 సమయంలో వెల్తుర్తి మండలంలో పంచలోహాల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ కేసులో నిందితుడు అని మాచర్ల వాసులందరికీ తెలుసు కానీ ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేకుండా జాగ్రత్తపడ్డాడు.
  • 2014లో మాచవరం మండలంలో సరస్వతీ భూముల వివాదంలో రైతులపై దాడి చేసి గాయపరిచాడు. అప్పట్లో 120 మందిపై కేసు నమోదైంది. ఇందులో ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు. కానీ అరెస్టు కాలేదు.
  • 2016లో వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామంలో తెదేపా నేత పాపిరెడ్డి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు. కానీ ఇతని తమ్ముడు వెంకట్రామిరెడ్డి మాత్రమే జైలుకెళ్లి వచ్చాడు. అప్పుడూ ఆయన తప్పించుకున్నాడు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని