logo

Guntur: కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది

కన్నకుమార్తె పెళ్లి చేసుకుని రావడంతో ఆమెపై ఉన్న మమకారంతో కన్నపేగు రోదించింది. మైనార్టీ తీరిన యువతి ఓ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుని నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌ చేరుకుంది.

Published : 04 Jul 2024 05:00 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట 
పోలీసు స్టేషన్‌కు చేరిన పంచాయితీ

మంగళగిరి, న్యూస్‌టుడే: కన్నకుమార్తె పెళ్లి చేసుకుని రావడంతో ఆమెపై ఉన్న మమకారంతో కన్నపేగు రోదించింది. మైనార్టీ తీరిన యువతి ఓ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుని నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్‌ చేరుకుంది. తమకు రక్షణ కల్పించాలని మైనార్టీ తీరినందున వివాహం చేసుకున్నట్లు పోలీసులకు వివరించారు. సమాచారం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు అది ప్రేమకాదు ఆకర్షణ మాత్రమే ఇంటికి వెళదాం రమ్మని కోరారు. ఇందుకు ఆ యువతి నిరాకరించింది.

ఎంతో మమకారంతో పెంచి పెద్దచేసిన కుమార్తె ఇంట్లో ఎవరికీ తెలియకుండా మరొకరిని పెళ్లిచేసుకోవడం జీర్ణించుకోలేకపోయారు. గుండెలవిసేలా స్టేషన్‌ వద్ద రోదించారు. దాదాపుగా గంటపాటు యువతిని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇందుకు పోలీసులు నిరాకరించారు. పెళ్లిచేసుకుని వచ్చిన కుమార్తెను చూసి తల్లి, తండ్రి కుప్పకూలిపోయారు. బంధువులు ఎంత ప్రయత్నించినా తిరిగి వచ్చేందుకు యువతి అంగీకరించలేదు. ఈ పరిస్థితుల్లో పెళ్లిచేసుకుని వచ్చిన యువతీ యువకులపై కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనితో పోలీసులు ప్రేమికులను కార్లో ఎక్కించి పంపించేందుకు ప్రయత్నించారు. కారుకు అడ్డుపడి ఇంటికి వెళదాం రమ్మన్నా యువతి రాకుండా వెళ్లిపోవడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన చూసిన వారందరికీ కళ్లలో నీళ్లు తిరిగాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని