logo

Guntur: ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు

ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు.

Updated : 04 Jul 2024 04:59 IST

ఆరు నెలల చిన్నారికి ప్రాణాంతక వ్యాధి 
ప్రభుత్వం, దాతలపైనే తల్లిదండ్రుల ఆశలు
ఈనాడు డిజిటల్, నరసరావుపేట 

ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు. అయితే మూడు నెలల వయసులో మెడ వంగి ఉండటం, కాళ్లు చేతులు ఆడించకపోవడంతో ఆసుపత్రిలో చూపించారు. చివరకు ఆ పసిప్రాణాన్ని జన్యుపరమైన వ్యాధి పీడిస్తోందన్న చేదు నిజం వాళ్లను ఆందోళనకు గురి చేసింది. అంతకంటే ఈ వ్యాధికి ఇచ్చే ఇంజక్షన్‌ ఖరీదు రూ.16 కోట్లు అనగానే దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఓ సాధారణ ప్రైవేటు ఉద్యోగి అయిన బాలుడి తండ్రి అంత మొత్తం సమకూర్చడం అయ్యేపని కాదు. దీంతో వసివాడని ఆ పసిప్రాణాన్ని దక్కించుకునేందుకు దాతల సాయం అర్థిస్తున్నారు  ఆ కన్నవారు. 

ళ్ల ముందే ఆరు నెలల బాబు ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధి బారిన పడటం ఆ తల్లిదండ్రులను కుంగదీసింది. తండ్రి ఒక్కడే జీవనాధారమైన ఆ కుటుంబానికి అంత ఖర్చు భరించడం వారి వల్ల కాక ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. నరసరావుపేట పనసతోటకు చెందిన షేక్‌ యాఫీన్, షేక్‌ షీరీన్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. షేక్‌ యాఫీన్‌ ఓ ప్రైవేటు ఉద్యోగి. రెండోబాబు జయాన్‌కు మూడు నెలల సమయంలో మెడ వంగి ఉండటం.. కాళ్లు, చేతులు ఆడించకపోవడం గమనించిన తల్లిదండ్రులు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చూపించారు. జన్యుపరమైన వ్యాధి ఉందని, కొన్ని పరీక్షలు చేసి అనంతరం హైదరాబాద్‌కు సిఫార్సు చేశారు. దీంతో అక్కడ మరో ప్రైవేటు ఆసుపత్రిలో జన్యుపరమైన వ్యాధి ఉందని పరీక్షలు చేయగా ప్రాణాంతకమైన ‘‘స్పైనల్‌ మస్కులర్‌ అట్రోఫీ (ఎస్‌ఎంఏ)’’ ఉందని వైద్యులు నిర్ధరించారు. ప్రస్తుతం టైప్‌ 1లో ఉందని, ఏడాదిలోపు ఖరీదైన ఇంజక్షన్‌ వాడాలని, ఇందుకు రూ.16 కోట్లు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారు. దీంతో బాబు తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఆర్థిక స్థోమత లేక, నిర్లక్ష్యం చేస్తే బాబు ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని కన్నీరు మున్నీరవుతున్నారు. మధ్య తరగతి కుటుంబీకులైన తాము అంత వెచ్చించే పరిస్థితి లేక ప్రభుత్వం, దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌ నిమ్స్‌లో కూడా చూపించామని, ఆ ఇంజక్షన్‌ తమ వద్ద లేదని వైద్యులు చెప్పారని, చివరకు దాతలు, ప్రభుత్వం ద్వారా తమ బాబును కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే వ్యాధితో గుంటూరుకు చెందిన గాయత్రి, ప్రీతమ్‌ల చిన్నారి హితైషి బాధపడుతూ దాతలు ఆదుకోవాలని వేడుకున్న విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. వీరికి విదేశాల నుంచి ఇంజక్షన్లు, ఔషధాలు సమీకరించుకుని చికిత్స అందివ్వాలి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని