logo

YSRCP: ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు

వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు.

Updated : 29 Jun 2024 06:50 IST

వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. కోరిన చోట పోస్టింగ్, పదోన్నతులు, ఇతర బంధుత్వాల నేపథ్యంలో శాంతి భద్రతలు రక్షించాల్సిన రక్షక భటులే ప్రజలకు నరకం చూపించారు. సాధారణ, సివిల్‌ వివాదాలతో స్టేషన్‌కు వెళ్తే స్థానిక వైకాపా నాయకులకు సమాచారం ఇచ్చేవారు. వాళ్లకు అనుకూలంగా పనిచేశారు. నిజాయితీపరులకు బదిలీలు బహుమానంగా లభిస్తే, వైకాపా వీరభక్తులు మాత్రం ప్రయోజనాలు పొందారు.

ఈనాడు, రాజమహేంద్రవరం, కాకినాడ, న్యూస్‌టుడే బృందం

వారు చెబితే కేసులు..

పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో 2021 అక్టోబర్‌1న పంచాయతీ కార్యాలయంలో పింఛన్ల పంపిణీ జరిగింది. తెదేపా గ్రామ సర్పంచి మొయిళ్ల కృష్ణమూర్తి దానికి హాజరయ్యారు. ఇక్కడ నీకేమిటి సంబంధం అంటూ ఆయనతో వైకాపా ఎంపీటీసీ సభ్యుడు బుచ్చిరాజు, కార్యకర్తలు గొడవ పడ్డారు. వైకాపా నాయకుల ఫిర్యాదుపై అప్పటి ఎస్సై బాలాజీ తెదేపా సర్పంచి కృష్ణమూర్తితోసహా నలుగురిపై కేసు నమోదు చేశారు. వైకాపా నాయకుల జోలికి వెళ్లలేదు. ఇదే సర్పంచి, మరో ముగ్గురిపై శ్రీశృంగార వల్లభస్వామి దేవాలయానికి చెందిన ఈవోతో వైకాపా నాయకులు తప్పుడు కేసులు పెట్టించారు. దేవాలయ ఆదాయ, వ్యయాలపై ఈవోను సర్పంచి ప్రశ్నించడంతోనే బలవంతంగా కేసు పెట్టించారు. అప్పటి ఎస్సై మురళీకృష్ణ కేసు నమోదు చేశారు. సర్పంచితోపాటు మరికొందరు గ్రామం విడిచివెళ్లిపోయి 20 రోజుల తర్వాత బెయిల్‌తో తిరిగి వచ్చారు. వ్యవహారం కోర్టు మెట్లెక్కడంతో పొరపాటున వారిపై కేసులు పెట్టినట్లు ఈవో చెప్పడంతో 2023లో కేసు కొట్టేశారు.

లోకేశ్‌నూ నిలువరించిన వైనం..

గతేడాది సెప్టెంబరు 9న చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రాజోలు నియోజకవర్గం పొదలాడలో ఉన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా 8న అక్కడికి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టు సమాచారం తెలుసుకుని విజయవాడ వెళ్లేందుకు యత్నించగా ఆయనను బస కేంద్రం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతున్న లోకేశ్‌ను డీఎస్పీ కె.వి.రమణ బస్సులోకి వెళ్లాలన్నారు. బస్సులోకి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సీఐ గోవిందరాజు అనడంపై లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘తండ్రిని అరెస్టు చేస్తే, ఆయనను కలిసేందుకు వెళ్తున్న నన్ను అక్రమంగా నిర్బంధించి రెస్టు తీసుకోమని చెబుతావా? నీవసలు మనిషివేనా?’’ అంటూ లోకేశ్‌ మండిపడ్డారు. ఈ వీడియోలు అప్పట్లో సామాజిక మాధ్యమంలో హల్‌చల్‌ చేశాయి.

అంతా ఏకపక్షమే..

సఖినేటిపల్లి మండలం గొందిలో తాగునీటి చెరువు సమీపంలో 2021లో కొందరు వైకాపా నాయకులు ఆక్వా చెరువులు తవ్వారు. దీంతో జలాలు ఉప్పుగా మారుతున్నాయని స్థానికులు అభ్యంతరం తెలిపారు. అధికార పార్టీ నాయకులకు కోపం రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అప్పటి ఎస్సై గోపాలకృష్ణ ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం ముగిసింది. మూడు రోజుల తర్వాత వైకాపా నాయకుల ఒత్తిడితో సదరు ఎస్సై ఓ సామాజిక వర్గమే లక్ష్యంగా కేసులు నమోదుచేయడం విరమ్శలకు తావచ్చింది. అప్పట్లో 11 మంది తెదేపా నాయకులపై కేసులు పెట్టి, జైలుకు పంపారన్న ఆరోపణలు ఉన్నాయి.

 సఖినేటిపల్లి, రాజోలు మండలాలకు చెందిన ముగ్గురు 2020లో సామాజిక మాధ్యమంలో వచ్చిన ఓ పోస్టును ఫార్వర్డ్‌ చేశారు. అది సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఉందని.. అప్పటి రాజోలు వైకాపా ఇన్‌ఛార్జి పెదపాటి అమ్మాజీ ఫిర్యాదుతో ఎస్సై గోపాలకృష్ణ కేసు నమోదు చేశారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చే వీలున్నా రాత్రి వరకు ఇబ్బంది పెట్టి, ఆపై న్యాయస్థానంలో హాజరుపరిచారు.

 సీతానగరం ఎస్సై బాద్‌‘షా’!

ఇసుక అక్రమ రవాణాపై నిలదీసిన ఒక దళిత యువకుడికి శిరోముండనం చేయడం అప్పట్లో సంచలనమైంది. 2020 జులై 20న సీతానగరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడ్ని స్టేషన్‌లో అక్రమంగా నిర్బంధించి వైకాపా నాయకుల ప్రోత్సాహంతో అప్పటి ఎస్సై షేక్‌ ఫిరోజ్‌షా స్టేషన్‌లోనే శిరోముండనం చేయించారు. ఎస్సై చేసిన పనులపై అప్పట్లో బాధితుడు చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి. వైకాపా నాయకులపై బాధితుడు కేసు పెట్టినా పోలీసులు నమోదు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆవేదన తట్టుకోలేక ఆ బాధితుడు నక్సలైట్‌గా మారతానని రాష్ట్రపతికి లేఖ రాయడంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు ఆ ఎస్సైను రిమాండుకు పంపారు. తర్వాత ఆ ఎస్సై కోరుకున్న కృష్ణా జిల్లాలో పోస్టింగు ఇచ్చారు. సదరు ఎస్సై బాద్‌షాగా వ్యవహరించేవారనే విమర్శలు గట్టిగా ఉన్నాయి.

 జనసేన కార్యకర్తకు బెదిరింపులు..

నిడదవోలు పట్టణంలో ఓ వైకాపా మహిళా కౌన్సిలర్‌ సమీప బంధువు జనసేనలో చేరారు. దీంతో వ్యక్తిగతంగా, రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని అప్పటి సీఐ వెంకటేశ్వరరావుకు ఆమె చెప్పారు. ఆ బంధువు జనసేనలో చేరడానికి కారకుడిగా భావించిన ఓ జనసేన కార్యకర్తను స్టేషన్‌కు పిలిపించి బెదిరించారు. దీనిపై బాధితుడు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో
విచారణ అనంతరం ఏప్రిల్‌ 8న ఆ సీఐను వీఆర్‌కు పంపించారు.

చిత్రహింసలకు యువకుడి బలి..

సామర్లకోటలో వైకాపా నాయకుల ఒత్తిడితో పోలీసులు చిత్రహింస పెట్టిన ఘటనలో 23 ఏళ్ల యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. పట్టణంలోని బలుసుల పేటకు చెందిన ఆలపు గిరీష్‌బాబు (23) ఆత్మహత్యకు పాల్పడి రెండేళ్లు గడిచినా అతని మృతికి కారకులైన బాధ్యులపై ఇప్పటికీ చర్యలు లేవని, తమకు న్యాయం జరగలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. గిరీష్‌బాబు సోదరుడు ప్రవీణ్‌కుమార్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపాకు వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడమే ఆ కుటుంబం చేసిన నేరమైంది. ఆ అక్కసుతో పింఛను సొమ్ము లాక్కున్నారని, తన చేయి పట్టుకున్నారని వార్డు వాలంటీరుతో వైకాపా నాయకులు ఫిర్యాదు చేయించారు. దీంతో అప్పటి పెద్దాపురం సీఐ జయకుమార్, సామర్లకోట ఎస్సై అభిమన్యు గిరీష్‌బాబును పదేపదే స్టేషన్‌కు పిలిచి చిత్రహింసలకు గురిచేయడంతో అవమానం భరించలేక 2022 జనవరి 5న అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని, రూ.8 లక్షల నష్టపరిహారం, ఇంటి స్థలం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఆ సీఐ, ఎస్సైలను సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని