logo

వినాయకా.. నువ్వే దిక్కు!

కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్‌ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఎస్‌ఎస్‌డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్‌ నంబర్‌తో రూ.5 లక్షలు చిట్‌ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది.

Published : 05 Jul 2024 04:17 IST

చీటీ సొమ్ము చెల్లించకుండా చుక్కలు చూపిస్తున్న సంస్థ
180 మంది బాధితుల ఫిర్యాదు.. రూ.కోట్లలో బకాయిలు  
కలెక్టర్‌ ఆదేశించినా.. రిజిస్ట్రార్‌ ఫిర్యాదు స్వీకరించని పోలీసులు

దస్త్రాలు స్వాధీనం చేసుకుంటున్న జిల్లా రిజిస్ట్రార్‌ రామలక్ష్మీపట్నాయక్‌ తదితరులు (పాతచిత్రం)

కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్‌ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో ఎస్‌ఎస్‌డ బ్ల్యూఏఎంవై- 23 గ్రూప్‌ నంబర్‌తో రూ.5 లక్షలు చిట్‌ కట్టాము. 2023 జులైౖతో కాలగడువు పూర్తయింది. సొమ్ము ఇవ్వమని అడిగితే నెలలపాటు తిప్పించారు. చివరికి ఎస్‌బీఐలో చెల్లుబాటయ్యేలా 389388 నంబర్‌తో రూ.4,65,500.. 389403 నంబర్‌తో రూ.9,500కు గతేడాది డిసెంబర్‌ 13న చెక్కులు ఇచ్చారు. అదే నెల 20న బ్యాంకుకు వెళ్తే ఆ సంస్థ ఖాతాలో సరిపడా సొమ్ములేదని చెప్పారు. 

కాకినాడ రామకృష్ణారావుపేటలోని గాబువారి వీధికి చెందిన అహ్మద్‌ షాజహాన్‌ ఆవేదన 

శ్రీవినాయక ఈస్ట్‌ చిట్‌ఫండ్స్‌లో నెలకు రూ.10వేల చొప్పున 30 నెలల పాటు రూ.3 లక్షలు కట్టాను. వారు కమీషన్‌ తీసుకోగా నాకు రూ.2.85 లక్షలు ఇవ్వాలి. చెక్కు ఇచ్చారు. అది బ్యాంకులో బౌన్స్‌ అయ్యింది. 

సర్పవరం గోపీనాథ్‌కాలనీకి చెందిన మోటూరి చంద్రశేఖర్‌ 

ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, గాంధీనగర్‌: ఒకరిద్దరు కాదు.. 198 మంది బాధితులు.. వీరిలో 180 మంది చిట్‌ఫండ్‌ సంస్థ నిర్వాకంపై రిజిస్ట్రార్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని తిరిగినా వైకాపా ప్రభుత్వంలో ఉలుకూ పలుకూలేదు. కూటమి సర్కారు నిర్వహించిన తొలిరోజు ప్రజాసమస్యల పరిష్కార వేదికలో.. కలెక్టర్‌ షాన్‌మోహన్‌కు విన్నవించారు. తక్షణం పరిష్కారం చూపాలని కలెక్టర్‌ యంత్రాంగాన్ని ఆదేశించారు. చిట్‌ రిజిస్ట్రార్‌ స్పందించినా.. కాకినాడ రెండో పట్ణణ పోలీసులు ఫిర్యాదు స్వీకరించలేదు. సమ్రగ వివరాలతో ఫిర్యాదు ఇస్తేనే స్వీకరిస్తామంటూ తిరస్కరించారు. దీంతో బాధితుల్లో అయోమయం నెలకొంది.

కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్‌ చిట్‌ఫండ్స్‌ కార్యాలయం 

దస్త్రాలు స్వాధీనం.. 

కాకినాడలోని శ్రీవినాయక ఈస్ట్‌ చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను 1998లో ఏర్పాటుచేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఎదురుగా పేర్రాజుపేటలో ప్రధాన కార్యాలయం ఉంది. 28 గ్రూపుల్లో 850 మంది వరకు పొదుపరులు ఉన్నట్లు సమాచారం. గత రెండేళ్లుగా చీటీలు పాడుకున్నవారికి  సొమ్ములు చెల్లించకపోవడం వివాదాస్పదమైంది. బాధితుల ఫిర్యాదులపై మార్చి 13న జిల్లా రిజిస్ట్రార్‌ రామలక్ష్మీ పట్నాయక్, చిట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఎం.సుధారాణి, సీనియర్‌ సహాయకులు భాస్కర్‌ల బృందం లావాదేవీల దస్త్రాలు పరిశీలించారు. రికార్డులు స్వాధీనం చేస్తున్నారు. చెల్లించాల్సింది రూ.4 కోట్లకుపైనే ఉండొచ్చని చెబుతున్నారు..ఈ ఏడాది డిసెంబరు 31లోగా చెల్లిస్తానని సంస్థ ఎండీ అధికారులకు వెల్లడించినా.. ఖాతాలో సొమ్ములేకపోవడం, చెక్కులు చెల్లుబాటు కాకపోవడం దుమారం రేపింది. బాధితుల ఫిర్యాదుతో కలెక్టర్‌ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రిజిస్ట్రార్‌ రామలక్ష్మీ పట్నాయక్‌ను ఆదేశించారు. ఇప్పటికే మేనేజింగ్‌ డైరక్టర్‌ పి.శేతుమాధవరావుకు డిప్యూటీ రిజిస్ట్రార్‌ షోకాజ్‌ నోటీసు జారీ చేసినా బాధితులకు భరోసా దక్కలేదు.

ప్రశ్నలు సంధిస్తూ వెనక్కు పంపి..

ఖాతాదారులకు చీటీ సొమ్ము చెల్లించని శ్రీవినాయక చిట్స్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయాలని కోరుతూ బాధితుల ఫిర్యాదులు జోడించి చిట్స్‌ రిజిస్ట్రార్‌ సుధారాణి ఈనెల 1న ఫిర్యాదు చేశారు. సమగ్ర వివరాలతో ఇవ్వాలంటూ కాకినాడ రెండోపట్టణ పోలీసులు వెనక్కిపంపారు. సంస్థను కాకినాడలో రిజిస్ట్రేషన్‌ చేశారా..? సంస్థలో వాటాదారులు ఎవరు..? బాధితుల ఫిర్యాదులపై శాఖాపరమైన విచారణకు ఎవరిని నియమించారు..? చిట్‌ఫండ్‌ చట్టం ప్రకారం యాజమాన్యంపై ఇప్పటివరకు మీరు తీసుకున్న చర్యలేమిటి..? ఎవరిపై నేరం రుజువయ్యింది..? ఎంత మోసపుచ్చారు..? వారి వివరాలు ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేస్తామని లిఖితపూర్వక లేఖ పంపడం గమనార్హం. రిజిస్ట్రేషన్‌ శాఖ ఉద్యోగులపైనా రాజకీయ ఒత్తిళ్లు వచ్చాయి. ఆరోగ్య అవసరాలు, పిల్లల చదువులకు సొమ్ము అందక ఇబ్బందిపడుతున్నామని బాధితులు లబోదిబోమంటున్నారు.

ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం..

కలెక్టర్‌ ఆదేశాలతో బాధితుల ఫిర్యాదులు జోడించి చిట్స్‌ రిజిస్ట్రార్‌ కాకినాడ రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినా స్వీకరించలేదు. ఫిర్యాదు కాపీని రిజిస్టర్‌ పోస్టులో పంపినా తిరస్కరించారు. కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తేనే కేసు నమోదు చేస్తామంటున్నారు. ఆయా వివరాలు విజిలెన్స్, సీఐడీ విచారణ సమయంలోనే మేము ఇస్తాం. బాధితుల ఫిర్యాదులు జతచేసి ఫిర్యాదు ఇస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయకపోతే ఎలా..? సమస్యను కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం.

పి.రామలక్ష్మీపట్నాయక్, జిల్లా రిజిస్ట్రార్, కాకినాడ జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని