logo

మేం వింటాం.. నిధులూ ఇస్తాం

గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది.

Published : 05 Jul 2024 04:11 IST

వరద రక్షణ పనులకు రూ.2 కోట్లు కేటాయించిన కూటమి సర్కారు

కాట్రేనికోన బూలావారి మొండిగట్టు వద్ద రక్షణ పనులు(పాతచిత్రం) 

ఈనాడు, రాజమహేంద్రవరం: గత అయిదేళ్లలో సాగునీటి పారుదల వ్యవస్థను వైకాపా సర్కారు పూర్తిగా విస్మరించింది. గోదావరి వరదల నుంచి రక్షణకు అవసరమైన పనులనూ పక్కనబెట్టింది. ఏటిగట్ల నిర్వహణ, ఇతర మరమ్మతులు గాలిలో దీపంలా చేసింది. ప్రతిపాదనలు వెళ్లడమే తప్ప నిధులు విదల్చని దుస్థితి. ప్రస్తుతం వరదల కాలం వచ్చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాధాన్య క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తాజాగా జలవనరులశాఖ హెడ్‌వర్క్స్‌ విభాగం పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదించి రూ.2 కోట్ల నిధులు విడుదలచేసింది. ప్రధానంగా అఖండ గోదావరి, గౌతమీ, వశిష్ఠ పరిధిలో ఏటిగట్ల వద్ద రక్షణ సామగ్రి, నిర్వహణకు అవసరమైన పనులకు అధికారులు టెండర్లు పిలిచారు.

వారం రోజుల గడువుతో టెండర్లు

అత్యవసర పనుల నేపథ్యంలో నిబంధనల మేరకు ఈనెల 2, 3 తేదీల్లో వారం గడువుతో ఆన్‌లైన్‌లో టెండర్లు పిలిచామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 8తో గడువు ముగుస్తుందన్నారు. ఆ తరువాత గుత్తేదార్లతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభిస్తామన్నారు.

ఏ పనులకు ఎంత నిధులంటే..

  • రాజోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో వశిష్ఠ ఎడమ ఏటిగట్టు (లోయర్‌ సెక్షన్‌) వద్ద రక్షణ చర్యలకు రూ.14.04 లక్షలు, అప్పర్‌ సెక్షన్‌లో 47 కి.మీ మేర నిర్వహణ పనులు రూ.4.71 లక్షలతో చేపట్టనున్నారు.
  • కోటిపల్లి వద్ద గౌతమి ఎడమ ఏటిగట్టు 34 కి.మీ నుంచి 63 కి.మీ వరకు నిర్వహణ, మరమ్మతులకు రూ.13.35 లక్షలు మంజూరు చేశారు.
  • అఖండగోదావరి ఎడమ ఏటిగట్టు 40 కి.మీ మేర రక్షణ చర్యలకు రూ.10.92 లక్షలు..గట్టు పొడవునా నిర్వహణకు రూ.5.47 లక్షలతో టెండర్లు పిలిచారు.
  • ఐ.పోలవరం మండలం మురమళ్ల పరిధిలో గౌతమి ఎడమ ఏటిగట్టు 51 కి.మీ నుంచి 85.10 కి.మీ వరకు నిర్వహణ, రక్షణ చర్యలకు రూ.4.08 లక్షలు, పీఐపీ ఫ్లడ్‌ బ్యాంక్‌కు 40 కి.మీ మేర నిర్వహణ పనులకు రూ.3.17 లక్షలు కేటాయించారు.
  • కొత్తపేట మండలంలో గౌతమి కుడి ఏటిగట్టు 51 కి.మీ వద్ద నిర్వహణకు రూ.2.06 లక్షలు విడుదల చేశారు 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని