logo

సొమ్ము ఉన్నట్టా.. లేనట్టా..?

గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి.

Published : 05 Jul 2024 03:52 IST

వైకాపా పాలనలో నిరుపయోగంగా మారిన వ్యసాయ మార్కెటింగ్‌ శాఖ

గోపాలపురం, న్యూస్‌టుడే: గత వైకాపా సర్కారు పుణ్యామా అని వ్యవస్థలన్నీ తలకిందులయ్యాయి. కొన్ని నిర్వీర్యంగా మారాయి. దీనికి తోడు ప్రజల అవసరాలు తీర్చాల్సిన పన్నులు పక్కదారి పట్టాయి. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రూ.కోట్ల ఆదాయం వస్తుంది. ఆ మొత్తంతో మార్కెటింగ్‌ శాఖ రైతుల అవసరాలు తీర్చాలి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా వచ్చిన సొమ్ము ఆన్‌లైన్‌లో మాత్రమే కనిపిస్తోంది. వారి అవసరం తీర్చింది ఒక్కటీ లేదు. అయిదేళ్లగా అభివృద్ధి జాడే లేదు. తెదేపా ప్రభుత్వంలో మార్కెట్‌ కమిటీ ద్వార వచ్చిన ఆదాయంతో రైతుల అవసరాలకు వినియోగించేవారు. వసతులు కల్పించేవారు. వైకాపా పాలనలో అలంకారప్రాయంగా మారాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు పూర్వవైభవం వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

గతంలో ఎంతో ఉపయోగం..

వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు వ్యవసాయ ఉత్పత్తులు రవాణా, విక్రయాల ద్వారా రూ కోట్లలో ఆదాయం లభిస్తుంది. ఆ సొమ్మును పుంత రోడ్లు, రైతుబజార్లు, పంటలు నిల్వ చేసే గోదాములు తదితరాలకు ఉపయోగిస్తారు. మార్కెట్‌ కమిటీ గోదాములో నిల్వ ఉంచి, రూ.రెండు లక్షల వరకు రుణం పొందేవారు. ఈ మొత్తంతో గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు పెట్టేవారు. గత అయిదేళ్లలో అలాంటివి ఏం జరగలేదు. 

ఆన్‌లైన్‌లో మాత్రమే కనిపిస్తాయి..

జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు 2023-24 ఏడాదికి సుమారు రూ.26.36 కోట్లు లక్ష్యం ఇచ్చారు. దానికి మించి రూ. 30.69కోట్లు ఆదాయం వచ్చింది. ఈ లెక్కన గత అయిదేళ్లల్లో రూ.100కోట్లకు పైగా వచ్చాయి. ఆ మొత్తం ఆన్‌లైన్‌లో కనిపించడమే తప్ప రైతులకు ఉపయోగించిన సందర్భాలు లేవు. వినియోగించాలని మార్కెట్‌ కమిటీ ఛైర్మన్లు మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. 2022లో గ్రామీణ ప్రాంతాల్లో పుంత, బీటీ రోడ్ల నిర్మాణానికి పంచాయతీరాజ్‌ శాఖ అనుసంధానంతో ప్రతిపాదనలు చేశారు. ఆ తర్వాత పనుల మాటే లేదు. ఈ సొమ్మును దారి మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి.

తెదేపా ప్రభుత్వం నిర్మించిన గోదాములు 

ప్రతిపాదనలు పంపించాం..

జిల్లాలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా ఏటా లక్ష్యానికి మించి ఆదాయం వస్తుంది. 2022లో ఆయా కమిటీల పరిధిలో పుంత, బీటీ రోడ్డు నిర్మాణానికి పంచాయతీ రాజ్‌ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాదనలు పంపించాం. అవి వచ్చిన తర్వాత రైతులకు అవసరమైన పనులు చేపడతాం.

ఎం సునీల్‌వినయ్, జిల్లా వాణిజ్య, మార్కెటింగ్‌ అధికారి, తూర్పుగోదావరి జిల్లా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు