logo

తీపి బతుకుల్లో చేదు నిజాలు

మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం..

Published : 05 Jul 2024 03:44 IST

మామిడితాండ్ర తయారీదారులకు తప్పని కష్టాలు
ధరల పతనంతో వెత: మార్కెటింగ్‌ లేక గిడ్డంగుల్లో ఉత్పత్తులు

చాపలపై మామిడితాండ్ర తయారు చేస్తున్న కూలీలు

న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌: మామిడితాండ్ర.. ఈ పేరు చెప్పగానే ఎవరికైనా ఠక్కున నోరూరుతుంది.. అంతలా జనంతో అనుబంధం పెనవేసుకుంది ఈ పదార్థం.. అయితే, తయారీదారులకు మాత్రం ఇది తీపిని పంచలేకపోతోంది. ధరల పతనం ఓవైపు, మార్కెటింగ్‌ సౌకర్యం సరిలేక గిడ్డంగుల్లో ఉత్పత్తులు మూలుగుతూ మరోవైపు కునారిల్లుతూ కనిపిస్తోంది. ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తోంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనేక గ్రామాలు నోరూరించే మామిడితాండ్ర తయారీలో పేరెన్నికగన్నాయి. 17 మధ్య, చిన్నతరహా,  10 కుటీర పరిశ్రమలు దీనిపైనే ఆధారపడ్డాయి. తూర్పు, పశ్చిమ, కృష్ణ, ఖమ్మం, విశాఖ జిల్లాల నుంచి మామిడి కాయలను తీసుకుని వచ్చి వేసవి సీజన్‌లో సంప్రదాయ పద్ధతిలో తాండ్రను తయారు చేస్తుంటారు. కాకినాడ గ్రామీణంలోని పండూరు, తమ్మవరం, సర్పవరం గ్రామాలతో పాటు గొల్లప్రోలు మండలంలో కత్తిపూడి, తొండంగి, జగ్గంపేట, పి.చిన్నాయపాలెం, చేబ్రోలు, ధర్మవరం, కొమ్మనాపల్లి, మల్లిసాల.. తూర్పుగోదావరి జిల్లాలోని మెట్ట ప్రాంతాలు, కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఈ తయారీ సాగుతోంది. కుటీర పరిశ్రమల్లో 3 నెలలు, మిగిలిన పరిశ్రమల్లో సుమారు 9 నెలలు పాటు ఉత్పత్తి చేస్తున్నారు. వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు సీజన్‌లో ఈ తయారీలో పాలుపంచుకుంటూ కుటుంబాలను పోషించుకోవడం పరిపాటైంది. దేశంలోని అనేక 
రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి.

నిత్యావసర వస్తువుగా...

తమ్మవరంలో మామిడితాండ్ర తయారీకి కాయలు గ్రేడింగ్‌ చేస్తున్న కూలీలు 

మన రాష్ట్రంలో మామిడితాండ్రను ఒక మిఠాయిగానే తింటారు. కానీ ఒడిశా, బిహార్, పశ్చిమబంగ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో దీన్ని నిత్యావసర వస్తువుగా వాడుతున్నారు. రోజూ మూడు పూటలా తినేలా అలవాటు చేసుకున్నారు. కొందరు అల్పాహారంలో చట్నీలుగా, బర్గర్‌ మధ్యలో మామిడితాండ్ర పొరలను పెట్టి తినడం అలవాటు చేసుకున్నారు. సుమారు 25 రోజుల పాటు మామిడితాండ్ర తయారీకి పడుతుంది. అయితే, ముడిపదార్థాల పెరుగుదల, కూలీల కొరత, మార్కెటింగ్‌ సౌకర్యం లేకపోవడం.. ఇలా అనేక కారణాలతో తయారీదారులు ఉత్పత్తిని అమ్ముకోలేక శీతల గిడ్డంగుల్లో పెట్టి ఎదురుచూస్తున్నారు.

ముడి సరకుల ధరలు పెరిగాయి

ఉమ్మడి జిల్లాలో మామిడితాండ్ర రైతులు తీవ్ర నష్టాలతో ఇబ్బందులు పడుతున్నాం. తాతల కాలం నుంచి అలవాటు అయిన వ్యాపారం మానలేక పోతున్నాం. గత కొంతకాలంగా సరకు కొనుగోలుచేసే హోల్‌సేల్‌ వ్యాపారులు లేక ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు కరవయ్యాయి. తయారైన తాండ్రను కోల్డుస్టోరేజ్‌లో పెట్టడం వల్ల తయారీదారులకు అదనపు భారంగా మారింది.

వలవల వెంకటేశ్వరరావు, వ్యాపారి, పండూరు, కాకినాడ గ్రామీణం

నష్టాలు వెంటాడుతున్నాయి

ఈ సీజన్‌లో మామిడి కాయల పంట సరిగా లేదు. దీంతో సుమారు రూ.12 వేలు ఉండే ధరలు రూ.26వేలకు విపరీతంగా పెరిగాయి. ఆ మేరకు తాండ్ర ధరలు పెరగడం లేదు. కూలీలకు రోజుకు రూ.600 వరకు ఇస్తున్నాం. కేజీ రూ.100 కంటే ఎక్కువ అమ్మితేనే నష్టాల నుంచి బయట పడగలం. కానీ రూ.70కి కూడా అమ్మకం జరగడం లేదు. ప్రభుత్వం దృష్టి పెట్టాలి.

మామిడాల వెంకటసుబ్రహ్మణ్య పాపారావు, తాండ్ర తయారీదారు, తమ్మవరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని