logo

పేద విద్యార్థులపై కపట ప్రేమ

విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.

Published : 05 Jul 2024 03:38 IST

కొన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో వివక్ష 

ఈనాడు, రాజమహేంద్రవరం: విద్యాహక్కు చట్టం మేరకు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25 శాతం మంది పేద విద్యార్థులను ఉచితంగా చదివించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా.. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వివక్ష చూపుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. 

ఫీజులకు సంబంధించి గత ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500, పట్టణాల్లో రూ.8వేలు చొప్పున నిర్ణయించింది. ఈ మొత్తాలు అమ్మఒడి నుంచి ఆయా బడులకు చెల్లించాలన్న నిబంధన పెట్టిందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై తల్లిదండ్రులకు సమగ్ర సమాచారం లేకపోవడం, ప్రభుత్వమే చెల్లిస్తుందనే నేపథ్యంలో సమస్య మరింత జటిలమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుదనే అంశంపై అంతా ఎదురు చూస్తున్నారు. 

  • ఈ ఏడాది ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఒకటో తరగతిలో ప్రవేశాలకు పలువురు దరఖాస్తు చేసుకోగా.. జిల్లాల వారీగా లాటరీ విధానంలో రెండు జాబితాలు విడుదలయ్యాయి. మూడోది తాజాగా విడుదల చేశారు. ప్రవేశాల సమయంలో ఇబ్బందులు, తరగతి గదిలో కొన్ని చోట్ల విద్యార్థులపై వివక్ష కనిపిస్తోందన్నది తల్లిదండ్రుల ఆవేదన.
  • ట్యూషన్‌ ఫీజు మినహా అక్కడి యూనిఫాం, పుస్తకాలకు తల్లిదండ్రులు చెల్లిస్తున్నారు. అయినా కొన్ని చోట్ల పాఠశాలల్లో విద్యార్థులకు హోమ్‌ వర్క్‌ ఇస్తున్నా, ఉచిత విద్యార్థులకు ఇవ్వడం లేదన్నది వాదన. శుక్రవారం కోనసీమ జిల్లాలోని ఓ పాఠశాలలో తల్లిదండ్రుల సమావేశం నిర్వహించినా, 25 శాతం ఉచిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానం పంపలేదు. దీనిపై ఎంఈవోకు పలువురు ఫిర్యాదులు చేయగా.. యాజమాన్యంతో సమావేశమై పలు సూచనలు చేశారు.

ఉమ్మడి జిల్లాలో ఇలా..

  • తూర్పుగోదావరి జిల్లాలో రెండు విడతల్లో 2,265 మందిని ఎంపిక చేస్తే.. 1,509 మంది వివిధ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారు. నచ్చిన పాఠశాల రాలేదని, దూరం ఇతర కారణాలతో 750 మంది ప్రవేశాలు పొందలేదు. మూడో విడతలో 121 మందిని ఎంపిక చేయగా ప్రవేశాల ప్రక్రియ సాగుతోందని జిల్లా విద్యాశాఖాధికారి వాసుదేవరావు తెలిపారు. యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సూచనలు చేశామని, ఎక్కడైనా ఇబ్బంది ఉంటే సమస్య పరిష్కరిస్తామన్నారు.
  • కాకినాడ జిల్లాలో 3,700 మంది దరఖాస్తు చేయగా.. ఇప్పటికి 2,200 మంది ప్రవేశాలు పొందారు. విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవని డీఈవో రమేష్‌ తెలిపారు.
  • డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మొదటి విడతలో 1439, రెండో విడతలో 754, మూడో విడతలో 93 మందిని ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని