logo

పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారు

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ దుయ్యబట్టారు.  

Published : 05 Jul 2024 03:34 IST

మాజీ ఎంపీ హర్షకుమార్‌

మాట్లాడుతున్న హర్షకుమార్‌ 

దేవీచౌక్, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వ పెద్దలు ఏటీఎంలా వాడుకున్నారని మాజీ ఎంపీ జి.వి.హర్షకుమార్‌ దుయ్యబట్టారు.  గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోని అన్ని ప్రాజెక్టులు రాతిపొరలపై నిర్మించారని, పోలవరం మాత్రం ఇసుక పొరలపై నిర్మాణం చేపట్టారన్నారు.  1990లో వడ్డి వీరభద్రరావు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ఉద్యమం చేయగా 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అంకురార్పణ చేశారన్నారు. 2014లో రాష్ట్రం విడిపోవడంతో కాలువల నిర్మాణ పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించారన్నారు. 30 లక్షల క్యూసెక్కుల నిల్వ అంచనావేస్తే దాన్ని 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో చేపట్టారన్నారు. ఇంత కష్టతరమైన డ్యామ్‌ నిర్మాణానికి డబుల్‌ డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించినప్పటికీ ఖర్చు మిగుల్చుకోవడం కోసం ఒక్కటే నిర్మించారని ఆరోపించారు. అదికాస్తా ఇప్పుడు కొట్టుకుపోయిందన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్తులో పోలవరం నుంచి కాకినాడ వరకు ముంపునకు గురై 40 లక్షల మంది ప్రాణాలు గాలిలో దీపంలా మారే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాపర్‌డ్యామ్, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం తదితర పనులు ఎక్కువ శాతం చంద్రబాబు హయాంలోనే జరిగాయన్నారు. ఇందులో లోపాలు ఏ ముఖ్యమంత్రివని ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వైఫల్యానికి నిర్మాణ సంస్థలు బాధ్యత వహిస్తాయా లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని నిలదీశారు. ముంపు మండలాల గురించి తెలంగాణ నాయకులు ఇప్పుడు మాట్లాడటం సబబుకాదన్నారు. అలాగనుకుంటే మళ్లీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేయండి.. కేంద్రపాలిత ప్రాంతం చేయండని మనం కూడా డిమాండ్‌ చేయవచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని