logo

పోర్టులో అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలి

కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు.

Published : 05 Jul 2024 03:32 IST

గత అయిదేళ్లలో ద్వారంపూడి భారీ కుంభకోణం
కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే కొండబాబు ధ్వజం

షాన్‌ మెరైన్‌ షిప్‌ తయారీ యూనిట్‌ వద్ద ఎమ్మెల్యే కొండబాబు, పోర్టు అధికారి ధర్మశాస్త 

ఈనాడు, కాకినాడ: కాకినాడ పోర్టులో గత అయిదేళ్లలో భారీ కుంభకోణం జరిగిందని.. పేదల బియ్యం విదేశాలకు ఎగుమతి చేయడమే గాక అనేక అక్రమాలకు పాల్పడ్డారని కాకినాడ నగర తెదేపా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) ఆరోపించారు. న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ యాంకరేజి పోర్టు లంగరు రేవును గురువారం పోర్టు అధికారులు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, బార్జి యాజమాన్యాలతో కలిసి సందర్శించారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి స్వార్థం వల్ల పోర్టుతో పాటు బియ్యం ఎగుమతిదారులు, వ్యాపారులు, 20వేల మంది కార్మికులు నష్టపోయారన్నారు. ద్వారంపూడి కుటుంబీకులు పేదల బియ్యం అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ ఇటీవల ప్రకటించి.. తనిఖీల్లో వేల టన్నుల బియ్యాన్ని సీజ్‌చేశారని గుర్తుచేశారు. రేషన్‌ మాఫియా అక్రమాలపై వైకాపా ప్రభుత్వం స్పందించలేదని, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ సమీక్ష చేయలేదన్నారు. 

ద్వారంపూడి బినామీ కదా.. వదిలేశారు

మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరుడు అలీషా.. షాన్‌ మెరైన్‌ కంపెనీ కోసం పోర్టు నుంచి 3,100 చదరపు మీటర్లు అద్దెకు తీసుకుని.. మరో 6 వేల చదరపు మీటర్లు ఆక్రమించుకున్నా చర్యలు లేవని ఎమ్మెల్యే కొండబాబు మండిపడ్డారు. లోడింగ్, అన్‌లోడ్‌ జరిగే జట్టీని ఆక్రమించి కార్యకలాపాలు సాగిస్తూ నోటీసులకూ స్పందించలేదన్నారు. అలీషా ద్వారంపూడి బినామీ కావడం వల్లనే పట్టించుకోలేదన్నారు. బకాయిలు వసూలుచేసి, ఆక్రమణలు తొలగించాలని పోర్టు అధికారి ధర్మశాస్తకు సూచించారు. వైకాపా ప్రభుత్వం 337 ఎకరాల కాకినాడ పోర్టు భూములు రూ.1,500 కోట్లకు తాకట్టు పెట్టిందని, ఇందులో ద్వారంపూడి వాటా ఎంతో చెప్పాలని కొండబాబు ప్రశ్నించారు. రూ.73 కోట్ల డ్రెడ్జింగ్‌ పనులకు ఏపీ మారిటైం బోర్డు ఛైర్మన్‌ వెంకటరెడ్డి, మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి రెండుసార్లు శంకుస్థాపన చేసినా పనులు సరిగ్గా జరగలేదన్నారు. డ్రెడ్జింగ్‌ పేరుతో రూ.కోట్లు కొట్టేశారన్నారు. సమావేశంలో ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు బాబు, రామ్మూర్తి, సూర్యారావు, సత్తిబాబు, విజయ్, తెదేపా నాయకులు వీరు, తుమ్మల రమేష్, ఒమ్మి బాలాజీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని