logo

వైకాపా నాయకులకు స్థలాలు రాసిచ్చేశారు..!

కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్‌ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు.

Published : 05 Jul 2024 03:29 IST

ఎన్నికల్లో పనిచేసినందుకు ‘పట్టాలు’ బహుమతి
అక్రమాలను కూటమి ప్రభుత్వం నిగ్గుతేల్చేనా..?

సామర్లకోట రోడ్డులో పట్టా జారీ చేసిన రహదారి స్థలం 

న్యూస్‌టుడే, కాకినాడ కలెక్టరేట్‌:  కాకినాడ నగర నియోజకవర్గంలో గత వైకాపా పాలనలో ప్రభుత్వ, మున్సిపల్, పోరంబోకు స్థలాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాసిచ్చేశారు. పొజిషన్‌ పట్టాలు సృష్టించి, రెవెన్యూ అధికారుల ఆమోదముద్ర వేసి అప్పనంగా కట్టబెట్టేశారు. సర్వేశాఖ అధికారులతో కాకినాడ నగరంలోని ప్రభుత్వ, మున్సిపల్, పోర్టు, పోరంబోకు స్థలాలను గుట్టుచప్పుడు కాకుండా అప్పటి వైకాపా ప్రజాప్రతినిధి సర్వే చేయించారు. ఎక్కడెక్కడ స్థలాలు ఖాళీగా ఉన్నాయో గుర్తించారు. ఎన్నికల్లో వైకాపాకు పని చేస్తే పట్టాలు ఇస్తామని ఆశ చూపారు. ఈ పట్టాలపై తహసీల్దారు సంతకాన్ని ముందుగానే చేయించి, వైకాపా ప్రజాప్రతినిధ వద్ద దాచిపెట్టి, ఎన్నికల అనంతరం పంపిణీ చేశారు.

అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయం కేంద్రంగా..

గత అయిదేళ్ల కాలంలో కాకినాడ అర్బన్‌ తహసీల్దారు కార్యాలయ కేంద్రంగా పట్టాల పందేరాన్ని నడిపారు. సుమారు వంద పట్టాల వరకు జారీ చేసినట్లు తెలుస్తోంది. స్థలాలు ముందుగా ఇవ్వకుండానే పొజిషన్‌ పట్టాలు తయారు చేసి అప్పటి అధికార పార్టీ నేత వద్ద పెట్టుకున్నారు. 100, 70, 60, 52 గజాల చొప్పున పట్టాలను సిద్ధం చేసుకున్నారు. వీటిలో కొన్నింటిని ఎన్నికల ముందు కార్యకర్తలకు పంచేయగా, వారు రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు అమ్మేసుకున్నారు. గత అయిదేళ్లలో కాకినాడ అర్బన్‌ తహసీల్దారు కార్యాలయంలో ఇద్దరు అధికారులు పనిచేశారు. వీరిలో ఉప తహసీల్దారుగా ఉండి, ఇన్‌ఛార్జి తహసీల్దారుగా వ్యవహరించిన అధికారి హయాంలోనే ఈ పట్టాల పందేరం ఎక్కువగా నడిచింది.

ఈ ప్రాంతాల్లో అక్రమాలు..

  • జగన్నాథపురంలోని ఏటిమొగ ప్రాంతంలో సుమారు 50 మంది వైకాపా కార్యకర్తలకు  తహసీల్దారు జారీ చేసిన పొజిషన్‌ పట్టాలు పంపిణీ చేశారు.  ఒక్కో కార్యకర్తకు 60 గజాల వరకు స్థలాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది.  పట్టాలు పొందిన వైకాపా కార్యకర్తలు వీటిని రూ.4లక్షలు చొప్పున అమ్మకానికి పెడుతున్నారు.
  • సంజయ్‌నగర్‌ ప్రాంతంలోని ఫులె పాకలు వద్ద సుమారు 30 మంది వైకాపా కార్యకర్తలకు పొజిషన్‌ పట్టాలు జారీ చేశారు. వీటిని రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు అమ్ముకుంటున్నారు.
  • కాకినాడ-సామర్లకోట రోడ్డులో ఐడియల్‌ కళాశాల సమీపంలో అయిదుగురికి స్థలాలు రాసిచ్చేశారు. ఇది ఆర్‌అండ్‌బీ రహదారి స్థలం. వీటిని రూ.7లక్షలు చొప్పున వైకాపా నాయకులు అమ్మేసుకున్నారు. వీటిని కొన్న వ్యక్తులు ఈ స్థలంలో నిర్మాణాలు చేపట్టారు.
  • సూర్యనారాయణపురంలో విలువైన ప్రభుత్వ స్థలాన్ని అప్పటి వైకాపా ప్రజాప్రతినిధి ప్రధాన అనుచరుడు, ఇద్దరు నాయకులకు కట్టబెట్టారు. సుమారు 300 గజాల స్థలాన్ని వీరికి ముట్టజెప్పారు. వీటికి పట్టాలు జారీ చేశారు. ఆ స్థలం విక్రయానికి ప్రస్తుతం బేరం పెట్టారు.
  • గాంధీనగర్‌లో మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో వైకాపా నాయకుడికి 66 గజాల స్థలాన్ని ఇచ్చేశారు. అప్పటి వైకాపా ప్రజాప్రతినిధి ఆదేశాలతో రెవెన్యూ అధికారులు మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో పొజిషన్‌ పట్టా ఇచ్చారు. దీనిపై అనేక ఫిర్యాదులు వెళ్లవడంతో, ప్రస్తుతం నిర్మాణాన్ని ఆపేశారు.

అధికారుల వత్తాసు..?:

కాకినాడ కేంద్రంగా సాగుతున్న పొజిషన్‌ పట్టాల దందాను ‘ఈనాడు’ అనేకసార్లు వెలుగులోకి తెచ్చినా.. అప్పటి కలెక్టర్, ఆర్డీవో వైకాపా నాయకులకు వత్తాసు పలికారు. తూతూమంత్రంగా విచారణ చేపట్టారు. కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో రహదారి స్థలంలో పట్టాలు జారీ చేసినా  అధికారుల్లో చలనం లేదు. పొజిషన్‌ పట్టాల జారీ ఆర్డీవో స్థాయి అధికారుల పర్యవేక్షణలో జరగాలి. ఇవేవీ పట్టకుండా నిబంధనలకు విరుద్ధంగా వైకాపా నాయకులు, కార్యకర్తలకు పట్టాలు పంచేశారు.

కొన్నేళ్లుగా పట్టాల పందేరం

నగరంలో ఎక్కడెక్కడ  ఖాళీ స్థలాలు ఉన్నాయో ముందుగా గుర్తించి, వాటికి పట్టాలు సృష్టిస్తున్నారు. 20 ఏళ్ల కిందట దీనిపై పెద్ద దుమారం రేగింది. విచారణ వరకు వెళ్లింది. పట్టా పుట్టించడం.. దానికి గృహ నిర్మాణ సంస్థ ద్వారా రుణం జారీ చేయించడం ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కా ప్రణాళిక చేస్తున్నారు. వైకాపా పాలన వచ్చాక.. ఈ దందా బాగా పెరిగిపోయింది. కూటమి ప్రభుత్వం పెద్దలు ఈ అక్రమాలను వెలికితీసే దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని