logo

వైకాపా పాలనలో.. రైతన్న నిరాశపాలు..

వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి.

Published : 05 Jul 2024 03:25 IST

అమలాపురం మండలం నల్లమిల్లిలో మూతపడిన పాలసేకరణ కేంద్రం 

వ్యవసాయం-పశుపోషణ రైతులకు రెండు కళ్లు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్నదాతలకు కాడే కాదు పాడి కూడా భారమైంది. ప్రకృతి ఆటుపోట్లు మరింత కుంగదీస్తున్నాయి. గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. పెట్టుబడి క్రమేణా పెరిగిపోతోంది. ఆదాయం మాత్రం ఆశించిన స్థాయిలో రావడం లేదు. 

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

మాటలతో మాయ..

ఊరూరా పాలధారలు పొంగేలా చేస్తాం. పాడి పరిశ్రమను లాభసాటిగా మారుస్తాం అంటూ.. అమూల్‌ సంస్థతో ఒప్పందాలు చేసుకుంటున్నామని ఏవేవో మాయమాటలతో అయిదేళ్లూ గడిపేశారు.

వైకాపా ప్రభుత్వం గొప్పగా చేసిన ప్రచారమిది.

చేతలు లేవాయె..

ఆచరణలోకి వచ్చేసరికి జగన్‌ సర్కారు చేతులెత్తేసింది. గ్రాసం నుంచి పశువైద్యం, పశువులు చనిపోయిన వారికి పరిహారం.. ఇలా ఏదీ అందించలేని దయనీయత పాడిరైతును కుంగదీసింది.

ఆశలు మొదలాయె..

ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. స్థిరమైన ఆదాయాన్ని తీసుకొచ్చే పశుపోషణకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొండంత అండగా నిలుస్తారని పశుపోషకుల్లో ఆశలు మొదలయ్యాయి.

జిల్లాలో పాల ఉత్పాదకత పెరిగినా మార్కెట్లో కొందరు ప్రైవేటు వ్యాపారులు పాడి రైతులను నిలువునా దోచేస్తున్నారు. తక్కువ ధర చెల్లించడంతో ఆదాయం పెద్దగా రావడం లేదు. గత వైకాపా పాలనలో పాల సేకరణకు అమూల్‌ సంస్థతో అవగాహన ఒప్పందం జరిగింది. మొత్తం 22 మండలాల పరిధిలో 385 పంచాయతీల్లోనూ పాల సేకరణకు సర్వే నిర్వహించారు. కానీ జిల్లావ్యాప్తంగా ఒక లీటరు పాలు కూడా సేకరించలేకపోయారు. జిల్లాలో పాలు సేకరించేందుకు అయిదు చోట్ల బల్క్‌మిల్క్‌ యూనిట్లు నెలకొల్పారు. వీటికి ఒక్కో దానికి రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. చివరి నిమిషంలో అమూల్‌ సంస్థ అప్పటి వైకాపా ప్రభుత్వంతో పాలసేకరణ ఒప్పందం రద్దు చేసుకోవడంతో చేసేదిలేక జగన్‌ సర్కారు చేతులెత్తేయడంతో రూ.కోట్ల ప్రజాధనం వృథాపాలైంది.

కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని..

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడంతో తమ జీవితాలు మెరుగుపడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించి ఐఏఎస్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతుల సమస్యలపై అధ్యయనం చేయాలని సూచించడంతో తమకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్యకాలంలో తమకు ఏ విధమైన ప్రోత్సాహం అందించారో అదేవిధంగా ప్రస్తుతం మళ్లీ తమను ఆదుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు. వ్యవసాయ రంగానికి అనుబంధంగా ఉన్న పాడి పరిశ్రమ గత అయిదేళ్ల కాలంలో పూర్తిగా నిరాదరణకు గురైంది.

భవనాల నిర్మాణంతో సరి..

గత వైకాపా ప్రభుత్వంలో గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు. వాటికి అనుసంధానంగా ప్రతిచోటా జగనన్న పాలవెల్లువతో బీఎంసీయూ భవనాలు నిర్మించాలని నిర్ణయించారు. ఉపాధి హామీ పథకం పద్దు కింద ఒక్కొక్క భవన నిర్మాణానికి సంబంధించి మొదట రూ.15.74 లక్షలకు అనుమతులు ఇవ్వగా, మళ్లీ అదనంగా మరో రూ.1.94 లక్షలు ఇవ్వాలని ఉత్తర్వులిచ్చారు. జిల్లాలో 5 చోట్ల ఈ భవనాలను నిర్మించారు.

లేనివి ఉన్నట్లుచూపి దగా..

గత జగన్‌ సర్కారు పశువుల కొనుగోలుకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించింది. మహిళలకు వైఎస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని మాటిచ్చింది. రైతుల వద్ద అప్పటికే ఉన్న పాత గేదెలు, ఆవుల ఫొటోలు తీసి, మళ్లీ కొత్తగా కొన్నట్లు ప్రచారం చేసుకున్నారు. ఇన్ని అవకతవకలు చోటుచేసుకోవడంతో ఈ పథకం నీరుగారిపోయింది. భవన నిర్మాణాలు, యంత్ర సామగ్రికి చేసిన ఖర్చు వృథాగా మారింది.

మార్గదర్శకాలు రావాల్సిఉంది

పాడి పరిశ్రమకు సంబంధించి కొత్త ప్రభుత్వం నుంచి నూతన మార్గదర్శకాలు రావాల్సిఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన ‘జగనన్న పాలవెల్లువ’ పథకాన్ని నిలిపివేయాలని ఆదేశాలొచ్చాయి. త్వరలోనే కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

వెంకట్రావు, పశుసంవర్థకశాఖ జిల్లా అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని