logo

నా విజయం మీకే అంకితం

నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను.

Updated : 04 Jul 2024 06:17 IST

వైకాపా ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారు

18 నెలల్లో సముద్ర తీర కోత సమస్యకు పరిష్కారం
పిఠాపురం బహిరంగసభలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌

నన్ను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించడమే కాకుండా.. నేను కోరుకోని ఉప ముఖ్యమంత్రి స్థానాన్ని ఇచ్చారు. ఆ విజయాన్ని మీకే అంకితం చేస్తున్నా..రాజ్యాంగ పదవులను గౌరవిస్తా.. ఆఖరి శ్వాస వరకు మీకు రుణపడి ఉంటాను.
ఏ రాజ్యాంగం రాసింది. ఒక వ్యక్తిని మీ గుండెల మీద పచ్చబొట్టు పొడిపించుకోమని.. ఒక ఆడబిడ్డ ‘అన్నా’ అని ప్రేమగా పిలిచే ఆత్మీయత పంచమని.. ఒక తల్లి వచ్చి నా ఆయుష్షు కూడా నువ్వే పోసుకుని చల్లగా ఉండాలని.. మీ అందరి ప్రేమ, ఆశీస్సులే ఈ స్థాయిలో నిలబెట్టాయి.

- పిఠాపురంలో నిర్వహించిన   బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌

ఈనాడు, కాకినాడ న్యూస్‌టుడే, పిఠాపురం, కొత్తపల్లి: ప్రజల ప్రతి సమస్య వింటామని, పరిష్కారం చూపుతామని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. పిఠాపురంలో బుధవారం సాయంత్రం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన వారాహి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతా సమష్టిగా పనిచేసి ఈ అయిదేళ్లలో సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతామన్నారు. గెలిస్తే సంతోషం అనుకున్నానని, తనకు 70వేల పైచిలుకు మెజార్టీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ఏమూలకు వెళ్లినా 10వేల నుంచి 90వేలకు పైనే మెజార్టీలు వచ్చాయని..యువత, ప్రజలు గత ప్రభుత్వంపై ఎంత విసిగిపోయారో అర్థమైందన్నారు.  

మాట్లాడుతున్న పవన్‌ కల్యాణ్‌.. చిత్రంలో ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వర్మ, నేతలు కృష్ణంరాజు, మర్రెడ్డి, తుమ్మల బాబు

అందరికీ రక్షిత జలాలు ఇవ్వడమే లక్ష్యం..

గ్రామాల్లో ప్రజలందరికీ రక్షిత జలాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పవన్‌ అన్నారు. యు.కొత్తపల్లి మండలం వాకతిప్ప శివారులో సూరప్ప చెరువు సమ్మర్‌ స్టోరేజి ట్యాంకు, తాగునీటి శుభ్రత, నీటి పరీక్ష ల్యాబ్‌ల పనితీరు పరిశీలించారు. నాబార్డు నిధులతో 22 ఎకరాల్లో నిర్మించిన ఈ ట్యాంకు ద్వారా 54 గ్రామాలకు తాగునీరు అందిస్తున్నామని..రూ.12 కోట్లతో అదనపు ట్యాంకు నిర్మించాల్సి ఉందన్నారు.

గ్రామాల రూపురేఖలు మారుస్తా..

‘విజయం అందుకున్నాక చాలామంది హోం మంత్రి, ఆర్థిక, రెవెన్యూ శాఖలు తీసుకోమన్నారు. గాంధీజీ కలలు నెరవేర్చడానికి క్లిష్టమైన పంచాయతీరాజ్‌ శాఖ తీసుకున్నా.. కమిషన్లు, కాంట్రాక్టులు అడగను..ఇచ్చిన కాంట్రాక్టులు సవ్యంగా చేయాలనే అడుగుతా. మీరిచ్చిన బలంతో 9 నెలల క్రితం అదృశ్యమైన ఆడబిడ్డ ఆచూకీ తొమ్మిది రోజుల్లో కనుగొన్నాం.’ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

తీరం కోత సమస్యపై మ్యాప్‌ను పరిశీలిస్తున్న పవన్, అధికారులు

అడ్డగోలుగా నిధులు మళ్లించారు...

పిఠాపురంలో 54 పంచాయతీలకు నిధుల్లేవు. వీటికి రావాల్సినవి సైతం గత ప్రభుత్వం ఇవ్వలేదు. ఏ మూల చూసినా అడ్డగోలుగా దారిమళ్లించేశారని పవన్‌ అన్నారు. రూ.600 కోట్లు పెట్టి రుషికొండపై ప్యాలెస్‌ కట్టారని, కనీసం రూ.25 కోట్లు ఏ నియోజకవర్గానికి ఇచ్చినా రోడ్లు, నీటి సమస్య తీరేదన్నారు. రూ.30 లక్షలతో బాత్‌టబ్‌ ఎవరైనా పెట్టుకుంటారా.? రూ.కోట్లు సంపాదించే తానే పెట్టుకోలేదని వ్యాఖ్యానించారు. సభలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్, తెదేపా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.వి.ఎస్‌.ఎన్‌.వర్మ, భాజపా ఇన్‌ఛార్జి బుర్రా కృష్ణంరాజు, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, జనసేన సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్, అధికార ప్రతినిధి అజయ్‌కుమార్, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ కల్యాణం శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

పిఠాపురం సభకు హాజరైన జనం 


సమస్యలు పరిష్కరిస్తాం..ప్రగతి నివేదిస్తాం.. 

  • పిఠాపురం నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి మాస్టర్‌ప్లాన్‌పై కసరత్తు జరుగుతోందని వచ్చే వారం డాక్యుమెంట్‌ విడుదల చేస్తామన్నారు. 
  • ఉప్పాడ తీరం కోత సమస్యపై నిపుణుల బృందంలో అధ్యయనం చేయించి.. 18 నెలల్లో నివారణ చర్యలు చేపడతామన్నారు. ఉప్పాడ నుంచి కాకినాడ వరకు కోస్టల్‌ రోడ్డు.. కుటుంబాలు ఆహ్లాదంగా సేదతీరేలా, యువత క్రీడలకు వీలుగా వసతులు కల్పిస్తామన్నారు. 13 కి.మీ తీర ప్రాంతం అభివృద్ధితో యువతకు సేవారంగంలో ఉపాధి చూపిస్తామన్నారు. 
  • ఏలేరు, సుద్దగడ్డ ఆధునికీకరణతో పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాలకు మేలు చేకూరుస్తామన్నారు. దీ పురుహూతికా అమ్మవారి ఆలయాన్ని ప్రసాద్‌ స్కీం కింద అభివృద్ధి చేస్తామన్నారు. దీ పట్టుపరిశ్రమకు ముడి సరకు కోసం ఆప్టిమైజింగ్, రీలింగ్‌ సెంటర్లు, విత్తన కేంద్రం ఏర్పాటు.. దుర్గాడలో మిర్చి థ్రస్సింగ్‌ ఫ్లోర్, గొల్లప్రోలులో ఉద్యాన పంటల నిల్వలకు కోల్డ్‌ స్టోరేజి నిర్మిస్తామన్నారు. దీ పిఠాపురం ఆర్వోబీ పనులకు నిధులు తెచ్చి ఏడాదిలో పూర్తిచేస్తామని.. ట్రాఫిక్‌ సమస్య లేకుండా చూస్తానన్నారు. సామాజిక ఆరోగ్యకేంద్రాన్ని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి స్థాయికి తీసుకెళ్తామన్నారు. దీ కాకినాడ సెజ్‌కు నియోజకవర్గం నుంచి 8వేల ఎకరాలు పోయిందని.. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేస్తామన్నారు. పరిశ్రమలతో యువతకు ఉపాధి చూపుతామన్నారు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని