logo

గుట్టుగా.. గుత్తగా

ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు.

Published : 04 Jul 2024 04:13 IST

రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు.. తరలింపు

ఆత్రేయపురం మండలం పులిదిండిలో... 
ఈనాడు, రాజమహేంద్రవరం: ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడంలేదు. కొద్దిరోజుల్లో కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం తీసుకువచ్చేందుకు విధివిధానాలు రూపొందిస్తున్న తరుణంలో.. సందట్లో సడేమియాగా నిల్వ కేంద్రాల్లో ఉంచిన ఇసుక గుట్టలను ఓ వైపు కొందరు కరిగించేస్తున్నారు. తూర్పులోని లాలాచెరువు, కడియం, కొవ్వూరు ప్రాంతాల్లో నిత్యం వందలలారీల్లో ఇసుక తరలుతోంది. ః డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేట, పి.గన్నవరం నియోజకవర్గాల్లోని నదిలో యంత్రాలతో తవ్వి రాత్రి సమయంలో తరలిస్తున్నారు. ఆత్రేయపురం మండలంలోని పులిదిండిలో వశిష్ఠ ఎడమ గట్టును ఆనుకుని పక్కాగా బాటలు వేసి రేయింబవళ్లు తవ్వేస్తున్నారు. బుధవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో సుమారు 50 లారీలు రీచ్‌లో ఉన్నా యంత్రాంగానికి పట్టలేదు. ఈ ప్రాంతం నుంచి రోజుకు సుమారు 300 లారీలు ఇసుకతో వెళ్తున్నాయని అంచనా. ః అయినవిల్లి మండలం సరిహద్దులో గంగవరం పరిధిలోకి వచ్చే మాన్సాస్‌ ట్రస్ట్‌ భూముల్లో కొద్ది రోజులుగా రాత్రి సమయాల్లో ఇసుక తరలింపు జరుగుతోంది. దీనిపై కథనాలు రావడంతో అధికారులు పరిశీలించారు. మంగళవారం రాత్రి నుంచి తవ్వకాలు నిలిచాయి. 

నూతన విధానంతోనే అడ్డుకట్ట 

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో బుధవారం అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇసుక రవాణా ఛార్జీల నిర్ణయం, విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. కొత్త విధానం వస్తే ఉమ్మడి జిల్లాలో నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న సుమారు 2 లక్షల మందికి పని దొరుకుతుందని సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. అంతవరకు అక్రమ తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని