logo

మోరంపూడి పైవంతెన పనుల వేగవంతానికి ఆదేశాలు

మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు.

Published : 04 Jul 2024 04:07 IST

ఎన్‌హెచ్‌ఏఐ పీడీ నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్‌ ప్రశాంతి   

రాజమహేంద్రవరం కలెక్టరేట్, న్యూస్‌టుడే: మోరంపూడి పైవంతెన పనులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. బుధవారం సాయంత్రం తన ఛాంబర్‌లో ఎన్‌హెచ్‌ఏఐ, ఆర్‌అండ్‌బీ అధికారులతో పెండింగ్, రహదారుల అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మోరంపూడి పైవంతెన నిర్మాణం పూర్తిచేసి ఆగస్టు చివరి నాటికి ట్రాఫిక్‌కు అనుమతించేలా సిద్ధం చేయాలన్నారు. రాజానగరంలో ఏడీబీ రోడ్డు పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ విషయంలో పెండింగ్‌ లేకుండా చూడాలని ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా రాజమహేంద్రవరం మీదుగా వెళ్లే జాతీయ రహదారులకు(ఎన్‌హెచ్‌-16, ఎన్‌హెచ్‌-216) ఇరువైపులా పచ్చదనం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, జిల్లా సరిహద్దులు ప్రజలకు తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

రూ.486 కోట్లతో మరో నాలుగు పైవంతెనలు

జిల్లాలో రూ.486 కోట్లతో మరో నాలుగు పైవంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించినట్లు ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు డైరెక్టర్‌ డి.సురేంద్రనాధ్‌ తెలిపారు. జాతీయ రహదారిలోని లాలాచెరువు, బొమ్మూరు, వేమగిరి కూడళ్లలో పైవంతెనలు, సర్వీసు రోడ్లు, విద్యుత్తు దీపాల ఏర్పాటుకు సంబంధించి రూ.345 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. దీంతోపాటు గామన్‌ బ్రిడ్జి జంక్షన్‌ నుంచి దివాన్‌చెరువు వరకు 2.4 కిలోమీటర్ల మేర పైవంతెన నిర్మాణానికి మరో రూ.141 కోట్లతో ప్రతిపాదనలు పంపగా దీనిని ప్రభుత్వం మంజూరు చేసిందని, త్వరలో టెండర్లు ప్రక్రియ కూడా ప్రారంభించనున్నట్లు కలెక్టర్‌కు ఆయన వివరించారు. ఈ సమావేశంలో సబ్‌కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాత్సవ, ఆర్‌అండ్‌బీ అధికారి ఎస్‌.బి.వి.రెడ్డి, ఆర్డీబీ ఈఈ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని