logo

వైద్యవిద్యను వదిలేశారు..

పతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి

Published : 04 Jul 2024 04:04 IST

రాజమహేంద్రవరం బోధనాసుపత్రిలో ఇదీ పరిస్థితి

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యకళాశాల

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం వైద్యం: పతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఓ వైద్యకళాశాల కేటాయించి 150 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చామని.. బోధనాసుపత్రులుగా మార్చి రోగులకు ఎంతో మేలు చేశామని గత వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతూ ఏర్పాటు చేసిన వైద్యకళాశాలలు ఆరంభశూరత్వంతో కొట్టుమిట్టాడుతున్నాయి. వైద్యకళాశాల, జీజీహెచ్‌లో బోధన, బోధనేతర, వైద్యులు, సిబ్బంది, మౌలిక వసతుల కొరతతో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి.

రాజమహేంద్రవరం వైద్యశాలను గతేడాది బోధనాసుపత్రిగా మార్చి వైద్యకళాశాలను కేటాయించారు. గత విద్యాసంవత్సరం నుంచి 150 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు సీనియర్‌ రెసిడెంట్‌(ఎస్‌ఆర్‌)ల కొరత వేధిస్తోంది. వీరితో పాటు ఎంతో కీలకమైన స్టాఫ్‌నర్సుల పోస్టులు ఖాళీలున్నాయి. గత ప్రభుత్వం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చడంతో పాటు నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలకూ వైఎస్‌ఆర్‌ ప్రభుత్వ వైద్యకళాశాలగా పేరు పెట్టడం గమనార్హం.

కీలక విభాగాలు

రాజమహేంద్రవరం బోధనాసుపత్రి, కళాశాల పరిధిలో మొత్తం 116 మంది వివిధ క్యాడర్ల ప్రొఫెసర్లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 83 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. 33 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో మొదటి ఏడాది విద్యార్థులకు బోధించే అనాటమీ విభాగానికి ప్రొఫెసర్‌ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కీలకమైన ప్రొఫెసర్ల విభాగంలో 20 మంది ఉండాల్సి ఉండగా కేవలం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారు. ఫిజియాలజీ విభాగానికి సైతం సరైన బోధన సిబ్బంది ఉండటం లేదని వాపోతున్నారు. రేడియాలజీ, మైక్రోబయాలజీ, పెథాలజీ విభాగాల్లోనూ కొరత వేధిస్తోంది. రేడియాలజీ విభాగంలో వైద్యులు లేకపోవడంతో ఆల్ట్రాసౌండ్, సీటీ స్కానింగ్‌ కోసం రోగులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్యసేవలకు ఎంతో కీలకమైన స్టాఫ్‌నర్సుల విభాగంలో 200 మంది ఉండాల్సి ఉండగా 117 మంది మాత్రమే సేవలందిస్తున్నారు. ఆసుపత్రిలో వైద్యసేవలు, ఆయా విభాగాల్లో కీలకంగా ఉండే సీనియర్‌ రెసిడెంట్‌(ఎస్‌ఆర్‌) వైద్యుల ఖాళీలు అధికంగా ఉన్నాయి. మొత్తం 84 మంది ఉండాల్సి ఉండగా 32 మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.

విద్యార్థులకూ ఇబ్బందే..

వైద్యకళాశాలలో గతేడాది నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. బోధనకు మౌలిక వసతులు, ల్యాబ్‌లకు సౌకర్యాలు సక్రమంగా కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మొదటి ఏడాది అనాటమీ విభాగంలో డిసెక్షన్‌కు మృతదేహాలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. గుండె, మెదడు, ఇతర శరీర అవయవాలన్నీ ఫార్మాలిన్‌ ద్రావణంలో ఉంచి బోధించే స్పెసిమెన్‌లు అందుబాటులో లేవు. ఎముకల విభాగానికి సంబంధించి అస్తి పంజరాలను చూపించి బోధించాల్సి ఉంది. అవికూడా అందుబాటులో లేకపోవడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు త్వరితగతిన స్పందించాల్సి ఉంది. మొదటి ఏడాదికి సంబంధించి మూడు ప్రధాన విభాగాలైన ఎనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీకి సంబంధించి ఒక్కోచోట ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్, ముగ్గురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ట్యూటర్లు ఉండాల్సి ఉంది. అలాంటి పరిస్థితి లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని