logo

మగువా.. అందుకో రుణం

అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది.

Published : 04 Jul 2024 03:44 IST

ఉమ్మడి జిల్లాకు రూ.427 కోట్ల స్త్రీనిధి పెంపు

కాకినాడలో స్త్రీనిధి రుణాలపై మహిళా సంఘాలకు వివరిస్తున్న సీఆర్పీ 

అధికారం చేపట్టింది మొదలు అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు అండగా నిలిచేందుకు, మహిళలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రత్యేక ఆదేశాలు జారీచేసింది. స్త్రీనిధి, బ్యాంకులింకేజీ ఉన్నతి పథకాల ద్వారా రూ.లక్షల్లో లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. జిల్లాల వారీగా లక్ష్యాలను పెంచుతూ వెలుగు ద్వారా మంజూరు చేయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో అర్హులైన సభ్యుల నుంచి వివరాలు తీసుకుంటున్నారు. రెండు, మూడు రోజుల్లోనే నగదు       అందజేయనున్నట్లు చెబుతున్నారు.
- న్యూస్‌టుడే, సీతానగరం, కొంతమూరు


స్త్రీనిధి అమలు ఎలా అంటే..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 71,816 మంది సభ్యులకు రూ.427 కోట్ల మేర స్త్రీనిధి రుణం అందించేందుకు అధికారులు ఇప్పటికే ఆర్థిక ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ మేరకు 11 శాతం వడ్డీ విధించనున్నారు. స్త్రీనిధిలో ఇప్పటివరకు ఒక్కో సభ్యురాలికి రూ.50 వేలు రుణ పరిమితిని రూ.లక్షకు పెంచారు. ఒక్కో సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.23 లక్షల వరకు పెంచేశారు. గతంలో మాదిరిగా కాకుండా 145 రకాల జీవనోపాధులకు సైతం రుణాలను అందించేలా మార్గదర్శకాలు వచ్చాయి. వ్యాపార విస్తరణకు సైతం దరఖాస్తులు చేసుకోవచ్చు. గతంలో ఈ రుణాలు తీసుకోవాలంటే నెలలు తరబడి వేచి ఉండేవారు. ఇకనుంచి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 24 గంటల్లోనే వీవో(గ్రామ సంఘ సహాయకులు) లాగిన్‌ ద్వారా మంజూరు చేస్తారు. అనంతరం సభ్యురాలి వ్యక్తిగత ఖాతాలో నగదు జమవుతుంది. 

ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకం

ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 15 శాతం వరకు ఎస్సీ, ఎస్టీ సభ్యులతో కూడిన సంఘాలు ఉన్నాయి. వీరికి ఇతరుల మాదిరిగానే వెలుగు, సామాజిక పెట్టుబడి నిధి, అంతర్గత రుణాలను మంజూరు చేయనున్నారు. మరోవైపు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేకుండా ఇవ్వనున్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో రూపాయి కూడా వీరికి అందించలేదు. ప్రస్తుతం సంఘాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాల సభ్యుల వివరాల జాబితాలను సిద్ధం చేస్తున్నారు. 
ఒక్కో సీఆర్పీ పరిధిలో 70 మంది..

ఆంధ్రప్రదేశ్‌లో 20.36 లక్షల మంది డ్వాక్రా మహిళలను లక్షాధికారులను చేయాలనే ప్రధానమంత్రి మోదీ ప్రకటించిన ‘3 కోట్ల లక్‌పతి’ కార్యక్రమంలో భాగంగానే ఈ లక్ష్యాన్ని పూర్తిచేసేలా కూటమి ప్రభుత్వం రుణాల ప్రక్రియను వేగవంతం చేసింది. నెలకు రూ.10 వేల ఆదాయం పొందేలా గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) నడుం బిగించింది. మహిళలను ఎంపిక చేయడంతో పాటు సహాయ సహకారాలు అందించేలా డ్వాక్రా మహిళల్ని కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్‌(సీఆర్పీ)లుగా నియమించారు. ఒక్కో సీఆర్పీకి 70 మంది మహిళల ఉపాధి కల్పన బాధ్యతలు అప్పగిస్తారు. ఎంపిక చేసిన మహిళలు ఏ జీవనోపాధిని ఏర్పాటు చేసుకోవచ్చు? దాన్ని సుస్థిర ఆదాయంగా మార్చుకోవడం ఎలా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా వారికి అందే సహకారం ఏంటి? తదితర వాటిని సీఆర్పీలు వివరించేలా ఏర్పాట్లు చేశారు.

 ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటల వ్యవధిలోనే రుణం తీసుకునేలా ఏర్పాట్లు చేశాం. స్త్రీనిధితో పాటు ఉన్నతి, బ్యాంకులింకేజీ తదితర పథకాల కింద పెద్దఎత్తున లబ్ధి చేకూర్చనున్నాం. వీటితోపాటు బ్యాంకులింకేజీ ద్వారా ఒక్కో సంఘానికి రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా ఇవ్వనున్నాం. ఈ మేరకు స్వయంసహాయక సంఘాలకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. 
- ఎం.ధర్మేంద్ర, ఏజీఎం, స్త్రీనిధి క్రెడిట్‌ కోఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌


గ్రేడింగ్‌ ఆధారంగా..

సంఘాలకు కేటాయించిన గ్రేడింగ్‌ ఆధారంగా రుణ ప్రక్రియ ఉంటుంది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉంటే రూ.75 లక్షలు, బి-65 లక్షలు, సి-55 లక్షలు, డి-గ్రేడ్‌లో ఉంటే రూ.45 లక్షల వరకు ఇస్తారు. దీంతోపాటుగా ప్రతి రూ.1000కు రూ.4 చొప్పున బీమా ఉంటుంది. ఒకవేళ సభ్యురాలు ప్రమాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తారు. గడిచిన వైకాపా పాలనలో పొదుపు సొమ్ము జమ చేయడంలోనూ అనేక అవకతవకలు చోటు చేసుకున్న నేపథ్యంలో కొత్త ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేలా మార్పులు చేసింది. గతంలో వీవో ఖాతాలో పొదుపు సొమ్ము జమచేసేవారు. పలుచోట్ల పక్కదారి పట్టినట్లు ఫిర్యాదులొచ్చినా పట్టించుకోలేదు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి నగదు రహిత లావాదేవీలను తీసుకొచ్చేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఇందులో భాగంగానే కొందరు వీవోఏలకు పేటిఎం పరికరాలు అందజేశారు. దీని ద్వారా సభ్యురాలు నేరుగా రుణం చెల్లించుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని