logo

మెట్టలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు

ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

Published : 04 Jul 2024 03:36 IST

మంత్రి నిమ్మల రామానాయుడు 

ఎత్తిపోతల స్విచ్ఛాన్‌ చేస్తున్న మంత్రి నిమ్మల, ఎమ్మెల్యేలు

సీతానగరం: ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో రెండు లక్షల ఎకరాలకు పైబడి సాగునీరుతో పాటు ఉత్తరాంధ్రకు తాగునీరు అందించే లక్ష్యంతో గోదావరి ఎడమగట్టున ఉన్న ఎత్తిపోతల పథకాలను ప్రారంభించామని జలవనరులశాఖమంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. వైకాపా పాలనలో అస్తవ్యస్తంగా వదిలేసిన ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు పూర్తిచేసి గోదావరి మిగులు జలాలు వృథా కాకుండా సద్వినియోగం చేస్తున్నామన్నారు. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం, పుష్కర ఎత్తిపోతల పథకాలను రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణతో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. గతంలో తెదేపా ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు 2020లో పూర్తిచేయాలనే లక్ష్యంతో దాదాపుగా 72 శాతం పనులు పూర్తిచేసిందన్నారు. గోదావరి వరదల వల్ల ఏటా 3,000 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలవకుండా ఉండేలా ఎడమగట్టున పోలవరం కాలువలను అనుసంధానం చేస్తూ ‘పురుషోత్తపట్నం’ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేశామన్నారు. దీని నుంచి 30 టీఎంసీల నీటిని ఏలేరు జలాశయంలో నింపడంతోపాటు పిఠాపురం బ్రాంచి కెనాల్‌ పరిధిలో 67,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేలా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేశామన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే జాతీయ హరిత ట్రైబ్యునల్‌ నుంచి వచ్చిన న్యాయపరమైన అంశాలను పట్టించుకోకుండా పథకాన్ని నిరుపయోగంగా వదిలేసిందన్నారు. జలవనరులశాఖ ఎస్‌ఈ ఏసుబాబు మాట్లాడుతూ తొలిదశలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి రెండు పంపుల ద్వారా 700 క్యూసెక్కులు, పుష్కర నుంచి రెండు పంపుల ద్వారా 350 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామన్నారు. గోదావరి నీటిమట్టం 14.9 మీటర్లకు పెరిగిందని, అన్ని మోటార్లు పనిచేసేందుకు నీటి ప్రవాహం వేగవంతంగా ఉందన్నారు. మెట్ట ప్రాంతంలోని తుని వరకు సాగునీటి అవసరాలను బట్టి మోటార్లు పెంచుతామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సత్యప్రభ, కలెక్టర్‌ ప్రశాంతి, ఆర్డీవో చైత్రవర్షిణి, డీఈ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని