logo

నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు జవసత్వాలు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.

Published : 04 Jul 2024 03:25 IST

సౌకర్యాలు మెరుగుపరిచి శిక్షణ కార్యక్రమాలు
యువతకు ఉపాధి లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు

శిక్షణ పొందుతున్న యువత 
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో యువత ఉద్యోగాల సాధనపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఎన్నికల హామీ ప్రకారం మెగా డీఎస్సీ ప్రకటించి.. డిసెంబరులోగా నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇతర శాఖలకు సంబంధించిన ప్రకటనలపై దృష్టి సారించింది. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌ : డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల పరిధిలోనూ స్కిల్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఉన్న వాటిలో సౌకర్యాలు కల్పించి మరింత మెరుగైన శిక్షణ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. గతంలో డొమెస్టిక్‌ డాటా ఎంట్రీ ఆపరేటర్, డొమెస్టిక్‌ నాన్‌ వాయిస్, ఐటీ సహాయకులు, మల్టీ స్కిల్‌ డెవలెప్‌మెంట్, వైద్యం తదితరాలకు సంబంధించిన శిక్షణ ఇచ్చే వారు. గత కొన్నాళ్లుగా కేంద్రాల నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో వీటిలో శిక్షణ కార్యక్రమాలు నిలిచిపోయాయి. 

అయిదేళ్లలో నిస్తేజం..

వైకాపా ప్రభుత్వం హయాంలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు పూర్తిగా నిస్తేజంగా మారాయి. అధికారం చేపట్టిన నాటి నుంచి జగన్‌ సర్కార్‌ వీటిని కన్నెత్తి చూడలేదు. సమస్యలను పట్టించుకోలేదు. దీంతో వివిధ పథకాల అమలులో భాగంగా అందించాల్సిన శిక్షణ తరగతులు నిలిచిపోయాయి. దీంతో వేలాది మంది నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు కోల్పోయారు. 

స్కిల్‌ సైన్సెస్‌ పేరిట సర్వే..

నైపుణ్యాభివృద్ధి సంస్థను గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం నడుంబిగించింది. దీనిలో భాగంగా చంద్రబాబు నాయడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే నైపుణ్య గణనపై సంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్‌ సెన్సెస్‌ పేరిట ప్రత్యేక యాప్‌ రూపొందించి ఇంటింటా సర్వే చేపట్టన్నుట్లు అధికారులు తెలిపారు. దీనిని మూడు విభాగాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్న వారు, చదువు పూర్తి చేసిన వారు, మధ్యలో నిలిపి వేసిన వారు ఈ మూడు కేటగిరీల్లో సర్వే నిర్వహించి, మొదటగా నిరుద్యోగులకు కావాల్సిన నైపుణ్య శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రెండో విడతలో డ్రాపౌట్్సకు ఉపాధి కల్పన, మూడో విడతలో విద్యార్థులకు తరగతులతోపాటు నైపుణ్య అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. 

ఉన్నదే ఒక్కటి.. అదీ మూత

జిల్లాలో ఎంప్లాయిబిల్టీ స్కిల్‌ కేంద్రం(స్కిల్‌ కళాశాల) ముమ్మిడివరంలో ఉండేది. దీనిలో డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువతకు వైద్య విభాగంలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే వారు. ఇక్కడ శిక్షణ తీసుకునే వారికి ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పించేవారు. పూర్తి  శిక్షణ కాలానికి సంబంధించి రూ.2 వేలు నగదు ప్రోత్సాహకం అందించేవారు. ఇప్పటి వరకు ఇక్కడ నాలుగు బ్యాచ్‌లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో సుమారు 70 మంది వరకు స్థానిక ఆసుపత్రుల్లో నర్సింగ్‌ విభాగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ కేంద్రం నిర్వహణకు సంబంధించిన బిల్లులు విడుదల చేయకపోవడంతో ఈ కళాశాల గత కొన్నాళ్లుగా మూత పడింది. ఈ కేంద్రానికి వైకాపా సర్కార్‌ హయాంలో సుమారు నూ.15 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్‌ ఉన్నట్లు సమాచారం.


కొలువులు ఆధారంగా శిక్షణ..

నైపుణ్య గణనపై ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదు. ప్రత్యేక యాప్‌ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న ఉద్యోగాల ఆధారంగా నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నాం.
- లోక్‌మాన్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని