logo

వైకాపా నాయకుడిపై బిగుస్తున్న ఉచ్చు..?

అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది.

Updated : 04 Jul 2024 06:19 IST

విధులకు ఆటంకంపై ఫిర్యాదుకు సిద్ధమైన అధికారులు
తెదేపా నాయకులను బెదిరించడంపైనా సీరియస్‌

అక్రమ కట్టడం కూల్చివేత పనులు 
కాకినాడ కలెక్టరేట్, న్యూస్‌టుడే: అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో మున్సిపల్‌ అధికారులు, సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడం, తెదేపా నాయకులపై బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో కాకినాడలోని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబుపై ఉచ్చు బిగిస్తోంది. స్థానిక రాజ్యలక్ష్మినగర్‌లో అక్రమంగా రెండో అంతస్తు నిర్మించడంతో మంగళవారం దాన్ని తొలగించడానికి వెళ్లిన మున్సిపల్‌ సిబ్బందిపై దుర్భాషలు, దాడికి పాల్పడిన అంశాన్ని అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి కూడా పోలీసులను నెట్టుకుంటూ.. దురుసుగా వ్యవహరించిన అంశాన్ని అధికారులు సీరియస్‌గా పరిగణిస్తున్నారు. వీటికి సంబంధించి కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుకు సిద్ధమవుతున్నారు.  గురువారం ఫిర్యాదు ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో విధులకు ఆటంకం కలిగించిన వారందరిపై కేసు పెట్టాలని ఆదేశించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ జె.వెంకట్రావు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. విధులను అడ్డుకుంటే ఎంతటివారినైనా వదిలిపెట్టమని ఆయన స్పష్టం చేశారు. అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో అంతుచూస్తానని సూరిబాబు బెదిరించడంపై మాజీ కార్పొరేటర్, తెదేపా ఎస్సీ సెల్‌ నగర అధ్యక్షుడు సీకోటి అప్పలకొండ బుధవారం కాకినాడ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు..

గత అయిదేళ్ల వైకాపా పాలనలో అప్పటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన ఆయన ప్రధాన అనుచరుడు బళ్ల సూరిబాబు బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల ఆక్రమణలు, దాడులు, భయపెట్టి ఆస్తులు రాయించుకోవడం, కాకినాడ గ్రామీణంలో ఉద్యోగులకు చెందిన భారీ స్థలాన్ని ఆక్రమించడం, ప్రశ్నించిన వారిపై ఎదురుతిరగడం వంటి అనేక అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు బహిరంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆగడాలు, అకృత్యాలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులు కేసులు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఈ నాయకుడి అకృత్యాలకు విసిగిపోయిన జిల్లాస్థాయి పోలీసు అధికారి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. కాకినాడ రెండో పట్టణ పోలీసు అధికారి ఒకరిపై తిరగబడటంతో చర్యలకు ఉపక్రమించాలని పోలీసులు భావించినా, మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖరరెడ్డి అడ్డుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  

చివరి దశకు తొలగింపు పనులు

రాజ్యలక్ష్మినగర్‌లోని అక్రమ కట్టడం కూల్చివేత పనులు బుధవారం కొనసాగాయి. భారీ కట్టడం కావడంతో  సమయం పడుతుందన్నారు.  చాలా వరకు అక్రమ కట్టడాన్ని తొలగించారు. మిగతా పనులు గురువారం పూర్తి చేయనున్నారు. బుధవారం పనులకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడలేదని డీసీసీ 
కె.హరిదాస్‌ ‘న్యూస్‌టుడే’కు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని