logo

బదిలీల్లో అంతా అధర్మమే

ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది.

Published : 04 Jul 2024 03:16 IST

కాకినాడలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయం 

న్యూస్‌టుడే, గాంధీనగర్‌(కాకినాడ): ధర్మాన్ని కాపాడాల్సిన దేవాదాయ ధర్మాదాయ శాఖలో గత అయిదేళ్లు అధర్మం తాండవించింది. ఇష్టమైన వ్యక్తులను నచ్చిన స్థానాల్లో నియమించుకుని నిబంధనలు తుంగలో తొక్కారు. ఎప్పుడూలేని విధంగా వైకాపా హయాంలో ఈ అడ్డగోలు తంతు యథేచ్ఛగా సాగిపోయింది. నచ్చిన వారిని కావాల్సిన చోట నియబదిలీల్లో అంతా అధర్మమే గత అయిదేళ్లలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో అడ్డగోలు వ్యవహారంమించడం, నచ్చని వారిని బయటకు పంపించడం పనిగా పెట్టుకున్నారు. వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరుతో ఈ అడ్డుగోలు వ్యవహారం యథేచ్ఛగా సాగింది. దీంతో ఆలయాలు, ధర్మసత్రాల నిర్వహణ, పాలన అస్తవ్యస్తంగా మారింది. గత ప్రభుత్వంలో నియమించిన ఉద్యోగులు ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్నారు.  

సాధారణ బదిలీలకు ప్రత్యామ్నాయంగా....

సాధారణంగా ఏ ఉద్యోగినైనా మూడేళ్ల సర్వీసు తర్వాత నిబంధనల ప్రకారం బదిలీ చేయాలి. బదిలీల విషయంలో వైకాపా  ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే, మంత్రి సిఫార్సులు ఉన్న వారికి మాత్రమే కోరుకున్నచోట పోస్టింగ్‌ దక్కేది. ఒక్కోసారి సీనియారిటీ ప్రకారం అర్హత ఉన్న వ్యక్తికి పోస్టింగ్‌ దక్కినా అటువంటి ఉద్యోగిని వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరుతో వేరే చోటికి బదిలీచేసి, తమకు అనుకూలమైన వ్యక్తులను ఈవోలు, ఉద్యోగులుగా నియమించుకున్నారు.  

నిబంధనలు తూచ్‌ ....

  • కాకినాడ జిల్లా దేవాదాయశాఖ అధికారి కార్యాలయ సూపరింటెండెంట్‌ సుబ్బారావు కాకినాడలో వేతనం పొందుతున్నా, భీమవరం జిల్లా దేవాదాయ శాఖాధికారిగా పనిచేస్తున్నారు. ః గొల్లలమామిడాడ గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవో పెద్దిరాజును ధవళేశ్వరం గ్రూప్‌ టెంపుల్స్‌ ఈవోగా నియమించారు. 
  •  కాకినాడ జిల్లాకు చెందిన గ్రేడ్‌ 1 ఈవో గాయత్రి కత్తిపూడి గ్రూప్‌నకు రెగ్యులర్‌ ఈవో కాగా, జోన్‌ మార్చి విశాఖపట్నంలోని పెదవాల్తేర్‌లో కరకచెట్టు పోలమాంబ ఆలయ ఈవోగా నియమించారు. సాధారణంగా గ్రేడ్‌-1స్థాయి ఈవోలను జోనల్‌(ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు) పరిధిలో మాత్రమే బదిలీ చేయాల్సి ఉంది. ఆమెకు కాకినాడ జిల్లాలోనే వేతనం చెల్లిస్తున్నారు. ః ఇంద్రపాలెం ఈవోగా పనిచేస్తున్న సత్యనారాయణను కాకినాడ నగరంలోని సంతచెరువు శ్రీకనకదుర్గ ఆలయ ఈవోగా నియమించారు. ఇంద్రపాలెం ఈవో(ఇన్‌ఛార్జి)గా కాకినాడ డివిజన్‌ తనిఖీదారు ఫణికుమార్‌ పనిచేస్తున్నారు. 

ఇబ్బందికరమైనా కొనసాగిస్తూ..

వర్క్‌ ఎరేంజ్‌మెంట్‌ పేరిట రాజకీయ సిఫార్సులతో ఆయా ఆలయాలు, సత్రాలు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అక్రమాలు, అవకతవకలకు పాల్పడితే ఎవరు బాధ్యులనేది ప్రశ్నార్థకం. దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఆలయాలు, సత్రాలకు విలువైన ఆస్తులు, భూములు, భవనాలు, బంగారు, వెండి ఆభరణాలు, వస్తువులు ఉన్నాయి. తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహించే ఈవో అక్రమాలకు పాల్పడితే, సాధారణ బదిలీల్లో రెగ్యులర్‌ ఈవోగా నియమించిన వారే బాధ్యులవుతారని సంబంధిత శాఖ ఈవోలే చెబుతున్నారు. ఇది చాలా ఇబ్బందికరమైనప్పటికీ రాజకీయ అండదండలతో నియామకాలు జరగడంతో అధికారులు మిన్నకుండిపోయారు. కూటమి ప్రభుత్వం స్పందించి ఈ విధానానికి స్వస్తి పలకాలని సంబంధిత శాఖ ఈవోలు, అధికారులు కోరుతున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని