logo

ద్వారంపూడి మార్కు అరాచకం

వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్‌ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్‌ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది.

Published : 03 Jul 2024 04:34 IST

అనుచరుడి అక్రమ కట్టడానికి ఊతం.. సిబ్బందిపై దాష్టీకం
నిర్మాణం కూల్చివేస్తున్నవారిపై ఇటుకలతో అనుచరుల దాడి
చేష్టలుడిగి చూసిన పోలీసులు
న్యూస్‌టుడే,  కాకినాడ కలెక్టరేట్, నగరం, సాంబమూర్తి నగర్‌

ఘటనా స్థలంలో ద్వారంపూడి ఆగ్రహం

వైకాపా పాలనలో గత అయిదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ప్రభుత్వానివే కాదు ప్రైవేట్‌ ఆస్తులకూ రక్షణ లేకుండా పోయింది. నేతల అండ చూసుకొని కబ్జాదారులు రెచ్చిపోయారు. తమ పూర్వీకుల సొత్తు మాదిరి మున్సిపల్‌ స్థలాలను అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. అన్నివేళలా ఈ పప్పులు ఉడకవు. ప్రభుత్వం మారింది. అధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాల జోలికి వెళ్తుంటే మొన్నటివరకు ఎమ్మెల్యేగా ఉండి శాసించిన ద్వారంపూడి, ఆయన అనుచరులకు ఆగ్రహం వచ్చింది. వీటి జోలికి రావడానికి ఎంత ధైర్యమంటూ దాడులకూ తెగబడ్డారు. మంగళ వారం జరిగిన ఈ ఘటన చర్చనీయాంశమైంది.

కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ప్రధాన అనుచరుడు బళ్లా సూరిబాబు.. ఆయన స్థానిక 9వ డివిజన్‌ గొడారిగుంట ప్రాంతంలోని రాజ్యలక్ష్మినగర్‌లో జీ ప్లస్‌ వన్‌ భవనం నిర్మించేందుకు అనుమతి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా రెండో అంతస్తు నిర్మించడంతో నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసింది. గడువు ముగియడంతో మంగళవారం సాయంత్రం ప్రణాళిక విభాగం అధికారులు, సిబ్బంది పోలీసుల సహాయంతో అక్రమ కట్టడం కూల్చివేతకు ప్రయత్నించారు. వైకాపా నాయకులు అడ్డుకుని మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి దృష్టికి తీసుకెళ్లారు. అంతే అనుచరులతో అక్కడికి చేరుకున్న ఆయన సిబ్బందితో వాగ్వాదం చేస్తూ పోలీసులతోనూ దురుసుగా వ్యవహరించారు. కూల్చివేత ఆపివేయాలని హుకుం జారీ చేశారు. ఈలోగా కట్టడం కూల్చివేత పనులు చేపడుతున్న సిబ్బందిపై ఆయన అనుచరులు ఇటుకలతో దాడికి పాల్పడ్డంతో ప్రాణభయంతో వారు పరుగులు తీశారు. ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి కూల్చివేతను ఆపేందుకు ద్వారంపూడి చేసిన ప్రయత్నం ఫలించలేదు. దీంతో ఆయన వెనుదిరిగారు. అనంతరం సిబ్బంది కూల్చివేత పనులు ఆరంభించారు.

సూరిబాబు ఇంటి ముందు గుమిగూడిన స్థానికులు

1000 గజాల స్థలాన్ని ఆక్రమించి..

ఈ భవనం సమీపంలోనే పీడబ్ల్యూడీ కాలువకు చెందిన 1000 గజాల స్థలాన్ని ద్వారంపూడి అనుచరుడు బళ్లా సూరిబాబు ఆక్రమించేశాడు. ఇది నగరపాలక సంస్థ పార్కు కాగా క్రీడా పరికరాలను తీసేసి స్థలాన్ని అమ్మేశాడు. ఏడు షెడ్లు నిర్మించారు. వాటికీ అధికారులు నోటీసులు జారీచేశారు. గతంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని అకారణంగా మార్పు చేశారని.. ఓ మాజీ కార్పొరేటర్‌ ఇంటినీ ఆక్రమించారన్న ఫిర్యాదులూ ఆయనపై ఉన్నాయి.

విధులకు ఆటంకంపై కేసు

మున్సిపల్‌ సిబ్బందిని అడ్డుకున్న వారిపై కేసులు పెడతామని.. దాడికి పాల్పడిన అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేకి జీహుజూర్‌ అన్న పోలీసులే ఇప్పుడు విధుల్లో ఉన్నారు. ద్వారంపూడి, అనుచరులు సిబ్బందిపై వీరంగం చేసినా చేష్టలుడిగి చూశారు. గతంలో ప్రజల సమస్యలపై తెదేపా నేతలు నిరసన తెలిపితే చాలు గృహ నిర్బంధం చేసిన పోలీసులు ఇప్పుడు వైకాపా
విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారు.

పోలీసులతో సూరిబాబు, అతడి అనుచరుల వాగ్వాదం

మీ అంతు చూస్తా..

అక్రమ కట్టడం కూల్చివేత సమయంలో తెదేపా నాయకులను సూరిబాబు దూషించారు. ఎమ్మెల్యే కొండబాబు పేరు ప్రస్తావిస్తూ నా ఇంటిని కూల్చి వేయిస్తున్నావ్‌.. అంతు చూస్తా అంటూ ఊగిపోయారు. ఎస్సీ సెల్‌ నాయకుడు సీకోటి అప్పల కొండబాబు పేరు ప్రస్తావిస్తూ నిన్ను వదిలే ప్రసక్తే లేదు.. నిన్ను బతకనిస్తే.. అంటూ అనుచరులతో కలిసి అసభ్య పదజాలంతో దూషించారు.

అక్రమ కట్డడాలను ఉపేక్షించం..

అక్రమ కట్టడాలను ఉపేక్షించం. రాజ్యలక్ష్మినగర్‌లో అక్రమంగా అదనపు అంతస్తు నిర్మించడంతో నోటీసు ఇచ్చాం. స్పందించకపోవడంతో మంగళవారం కూల్చివేత చర్యలు చేపట్టాం. మా విధులను అడ్డుకుంటే ఎవరినీ వదిలేది లేదు.

జె.వెంకట్రావు, కమిషనర్, కాకినాడ నగరపాలక సంస్థ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని