logo

పల్లె గడపకు స్వచ్ఛ జలాలు

కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్‌ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు.

Updated : 03 Jul 2024 04:50 IST

ప్రతి సమస్యకూ దశలవారీ పరిష్కారం చూపుతాం
పర్యాటక సీమగా హోప్‌ ఐలాండ్‌
కీలక శాఖల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌
ఈనాడు, కాకినాడ

సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, వేదికపై ఎమ్మెల్యేలు వరుపుల సత్యప్రభ, జ్యోతుల నెహ్రూ,
ఎంపీ ఉదయ్‌ శ్రీనివాస్, కలెక్టర్‌ షాన్‌ మోహన్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీ

‘‘మా దగ్గర అల్లావుద్దీన్‌ అద్భుతదీపం లేదు.. ప్రతి  సమస్యకు వెంటనే పరిష్కారం దొరకదు.. నిధులన్నీ గత ప్రభుత్వం ఖాళీ చేసింది.. రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లింది.. మా ప్రభుత్వానికి ప్రజల సమస్యలపై అవగాహన ఉంది.. దశలవారీగా అన్నింటికీ పరిష్కారం చూపుతాం’’

పవన్‌కల్యాణ్‌

  • పంచాయతీలకు సంబంధించి సలహాలు సూచనలు ఇవ్వమంటే.. ఒక్క రోజులోనే 12వేల సలహాలు వచ్చాయి.
  • గతంలో పారిశుద్ధ్య పనుల నిధులు సైతం నిర్మాణ పనులకు మళ్లించడంతో అతిసారం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.
  • పంచాయతీల నుంచి సంపాదించిన డబ్బు తిరిగి వాటికి ఇవ్వకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయి.
  • ఉప్పాడ తీరంలో కోత సమస్య తీవ్రంగా ఉంది. రాబోయే 10, 20 ఏళ్లలో ఎంత ప్రాంతం పోతుందన్న దానిపై అధ్యయనం చేస్తాం..

పవన్‌కల్యాణ్‌

కాకినాడ కలెక్టరేట్‌లో మంగళవారం నాలుగు గంటలపాటు కీలక శాఖలతో ఉపముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, కాలుష్య నియంత్రణ మండలి, అటవీశాఖ, శాస్త్ర- సాంకేతిక, జిల్లా పరిషత్తు తదితర అంశాలపై సమీక్షించి బడ్జెట్‌ కేటాయింపులు.. చేపట్టిన, చేపట్టాల్సిన పనులపై ఆరా తీశారు.

అదే మా లక్ష్యం

  • జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇవ్వలేని పరిస్థితి నెలకొందని పవన్‌కల్యాణ్‌ వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామానికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యమన్నారు. పిఠాపురం నియోజకవర్గంలోనే 40 పంచాయతీల్లో నిధుల్లేక సక్రమంగా తాగునీరు అందడంలేదన్నారు.
  • ఆర్‌డబ్ల్యూఎస్‌ సమీక్షలో సీపీడబ్ల్యూ పథకాల నిర్వహణకు ఏడాదికి రూ.16.83 కోట్లు అవసరమని ఎస్‌ఈ సత్యనారాయణ తెలిపారు. జల్‌జీవన్‌ మిషన్‌కింద 81 శాతం పనులు పూర్తిచేశామన్నారు. భూసేకరణ పూర్తికాక వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ముందుకు సాగడంలేదన్నారు.
  • ఉమ్మడి జిల్లా పరిషత్తు, మండల పరిషత్తు సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులను జడ్పీ సీఈవో శ్రీరామచంద్రమూర్తి వివరించారు. జడ్పీ పరిధిలో 191 పనులకు రూ.91.77 కోట్లు..మండల పరిషత్తుల్లో 31 పనుల పూర్తికి రూ.85.45 కోట్లు అవసరమని తెలపగా మంత్రి స్పందించి జరిగిన పనులపై నివేదిక కోరారు.
  • పంచాయతీల సాధారణ నిధులు సిబ్బంది జీతాలకే చాలడంలేదని జిల్లా పంచాయతీ అధికారి భారతీ సౌజన్య తెలిపారు.
  • కోనసీమ కొబ్బరికి ఊతమిస్తామని మంత్రి అన్నారు.

సమీక్షలో పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు

ఎకో టూరిజంగా మార్చుతాం..

హోప్‌ ఐలాండ్‌ను ఎకో టూరిజంగా మార్చుతామని పవన్‌ తెలిపారు. కాకినాడ స్మార్ట్‌సిటీ సుందరీకణకు నిధులు, ప్రత్యేక ప్రాజెక్టులపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీ ఉదయ్‌శ్రీనివాస్‌కు సూచించారు. ఎంపీ మాట్లాడుతూ ప్రసాద్‌ స్కీం కింద పర్యాటక ప్రాజెక్టు, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌అండ్‌ టెక్నాలజీ ఏర్పాటుచేయాలని ప్రధానిని కోరామన్నారు. అడవుల అభివృద్ధికి రూ.9.92 కోట్లు కేటాయించారని డీఎఫ్‌వో భరణి తెలిపారు.

ప్రమాదాలకు ఆస్కారం లేకుండా..

వనరులు పుష్కలంగా ఉన్న తూర్పులో గెయిల్, ఓఎన్జీసీ, రిలయన్స్‌ తదితర ఆయిల్, గ్యాస్‌ సంస్థలు ఉన్నాయని, ఇక్కడ ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని పవన్‌కల్యాణ్‌ అన్నారు. దేశానికి కావాల్సిన గ్యాస్‌ వెలికి తీత అవసరం.. స్థానికంగా భద్రత చర్యలూ ముఖ్యమే అన్నారు. ఎమ్మెల్యేలు వనమాడి, నానాజీ, చినరాజప్ప, నెహ్రూ, సత్యప్రభ, జడ్పీ ఛైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని