logo

మెట్ట రైతుకు గోదావరి జలాలు

గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది.

Published : 03 Jul 2024 04:26 IST

నేడు మంత్రి నిమ్మల చేతుల మీదుగా ప్రారంభం

పుష్కర ఎత్తిపోతల వద్దకు చేరిన గోదావరి నీటి ప్రవాహం

సీతానగరం, న్యూస్‌టుడే: గత వైకాపా ప్రభుత్వంలో వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను కూటమి ప్రభుత్వం రాగానే యుద్ధప్రాతిపదికన చేయించి జులై మొదటి వారంలోనే సాగునీరు సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం వద్ద గోదావరి ఎడమ గట్టున పుష్కర-1, 2 ఎత్తిపోతల పథకాల పరిధిలో మోటార్ల మరమ్మతులు, లీకేజీలు, ఇతరత్రా పనులకు సుమారుగా రూ.12 కోట్లకు పైబడి గుత్తేదారులకు వైకాపాలో బకాయిలు పెట్టారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేసరికి ఈ ఏడాది మార్చిలోనే అవసరమైన పనులు చేపట్టాల్సి ఉన్నా గుత్తేదారుడు చేతులెత్తేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలవనరుల శాఖకు చెందిన ఎత్తిపోతల ప్రాజెక్టులపై దృష్టిసారించారు. గతేడాది అక్టోబరు 18న ప్రాజెక్టు పరిశీలనకు విచ్చేసిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పుష్కర ఎత్తిపోతల పథకాల అధ్వాన పరిస్థితిపై మెట్ట రైతులు వివరించారు. జులై మొదటి వారానికల్లా తూర్పు, కాకినాడ జిల్లాల్లోని 18 మండలాల్లోని ఆయకట్టుకు సాగునీరు సవ్యంగా వెళ్లేలా అత్యవసర పనులు చేయించాలనే సీఎం, జలవనరులశాఖ మంత్రి ఆదేశాలతో మొత్తం 8 మోటార్లకు గాను 6 మోటార్లను సిద్ధం చేసినట్లు జలవనరులశాఖ డీఈ సీహెచ్‌ కోటేశ్వరరావు మంగళవారం రాత్రి పుష్కర ప్రాజెక్టు వద్ద ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఒక్కో మోటారు నుంచి 175 క్యూసెక్కుల చొప్పున తొలుత మూడు మోటార్లు ఆన్‌చేస్తామన్నారు. కొన్నిచోట్ల ఇంకా లీకేజీల పనులు చేయాల్సి ఉండటంతో వాటి పనులు పూర్తిస్థాయిలో చేయించి ఆరు మోటార్లు ద్వారా నీరు పెంచుతామన్నారు. మెట్ట ప్రాంతంలో గతేడాది 1.27 లక్షల ఎకకరాలకు మాత్రమే సాగునీరు సరఫరా అయిందని, ఈ ఏడాది 1.42 లక్షల ఎకరాలకు అందించేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ ఏడాది ఆరు మోటార్ల ద్వారా 1,050 క్యూసెక్కులు సరఫరా చేయడంలో ఇబ్బందులు లేకుండా చేశామన్నారు. రెండేళ్ల క్రితం మరమ్మతులకు ఇచ్చిన మోటార్లు కాకినాడలో ఉన్నాయని, అవసరమైన బిల్లులు చెల్లించి వాటిని తీసుకొచ్చి పూర్తిస్థాయిలో 1400 క్యూసెక్కులు పంపించేలా కార్యాచరణ ఉందన్నారు. తొర్రిగెడ్డ ఎత్తిపోతల పథకం కాలువ పూడికతీత పనులు రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తన సొంతనిధులు వెచ్చించి చేయించారు. దీనివల్ల కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 16,500 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు చేరుతోంది.

పది రోజుల ముందుగానే..

పుష్కర, తొర్రిగడ్డ ఎత్తిపోతల పథకాల నుంచి బుధవారం జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా సాగునీరు విడుదల చేసేలా ఏర్పాట్లు చేసినట్లు రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ తెలిపారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన ఎత్తిపోతల పథకాల పనులను వేగవంతంగా చేయించడమే కాకుండా ఈ ఏడాది పది రోజులు ముందుగానే మెట్టకు సాగునీరు ఇవ్వగలుగుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని