logo

భూహక్కు పత్రాల ఉపసంహరణకు రంగం సిద్ధం

వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు.

Updated : 03 Jul 2024 04:52 IST

త్వరలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల జారీ
న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

గత ప్రభుత్వంలో జగన్‌ బొమ్మతో భూహక్కు పత్రం

వైకాపా ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు-భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో అనేక ఆందోళనలు, విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేకమంది రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెట్టినా వైకాపా పాలకులు పట్టించుకోలేదు. భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి రీ సర్వే చేపట్టినట్లు చెప్పుకొచ్చినా.. సరిహద్దు తగాదాలు రెట్టింపయ్యాయి. జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పులున్నాయంటూ పలువురు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. భూహక్కు పత్రంపై యాజమాని ఫొటో కంటే పెద్దగా జగన్‌ చిత్రం ఉండటంపైనా వ్యతిరేకత వ్యక్తమయింది. ఇప్పుడు జగన్‌ ఫొటోను తొలగించి గతంలో మాదిరిగానే రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలను జారీ చేస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది.  ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు త్వరలోనే కొత్త పాసుపుస్తకాలు జారీ కానున్నాయి.

  • జిల్లాలో 272 రెవెన్యూ గ్రామాలకు గాను మూడు విడతల్లో 189 గ్రామాల్లో రీసర్వే చేపట్టగా ఇంకా 83 గ్రామాల్లో అసలు ప్రారంభమే కాలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల కోడ్‌కు ముందు వరకు 86,799 భూహక్కు పత్రాలు జారీ చేశారు.
  • మొదటి విడతలో రాజమహేంద్రవరం, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లలోని కలిపి 45 గ్రామాల్లోని 64,438.83 ఎకరాల్లో రీసర్వే చేసి గతేడాది జులైలో 32,498 భూ యాజమానులకు హక్కు పత్రాలు ఇచ్చారు.
  • రెండో విడతలో 54 గ్రామాల్లో 84,088.22 ఎకరాల్లో రీసర్వే చేసి గతేడాది నవంబరు నాటికి 39,546 భూహక్కు పత్రాలు జారీ చేశారు.
  • మూడో విడతలో 90 గ్రామాల్లో 1,18,885.39 ఎకరాల్లో రీసర్వే పూర్తయినట్లు చెబుతున్నప్పటికీ 24 గ్రామాలకు సంబంధించి మాత్రమే 17,231 భూహక్కు పత్రాలు ముద్రితమయ్యాయి. వాటిలో ఈ ఏడాది మార్చి 14 వరకు 14,755 పత్రాలు మాత్రం సంబంధిత యజమానులకు జారీ చేశారు. మిగతా 2,476 పత్రాలకు జారీకి సంబంధించి ఈకేవైసీ పూర్తికాకపోవడం.. తర్వాత ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో వాటిని నిలిపేశారు. ఇప్పటివరకు జారీ చేసిన భూహక్కు పత్రాలను కూడా వెనక్కి తీసుకోనున్నారు.

లోపాలతో గగ్గోలు

భూ రీసర్వేలో లోపాల కారణంగా రైతులు, భూ యాజమానులు గగ్గోలు పెడుతున్నారు. కొన్నిచోట్ల భూ యాజమానులకు సమాచారం ఇవ్వకుండా, మరికొన్నిచోట్ల క్షేత్రస్థాయికి సర్వేయర్లు వెళ్లకుండా హద్దులు నిర్ణయించేసి ఆన్‌లైన్‌ చేసేశారనే ఆరోపణలు వచ్చాయి. రీసర్వే తర్వాత భూ విస్తీర్ణంలో తేడాలు.. భూ హక్కు పత్రాల్లో తప్పులు దొర్లడంతో కొందరు సంబంధిత రెవెన్యూ కార్యాలయాలు, తహసీల్దారు, మండల సర్వేయర్లు చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. సర్వేలో తమ భూమి తగ్గిపోయిందంటూ అనేకమంది గత ప్రభుత్వంలో నిర్వహించిన స్పందన కార్యక్రమాల్లోనూ ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. సెంటు నుంచి 50 సెంట్లు ఆపైనే భూమి తగ్గడంపై పక్క పొలందారుడితో సరిహద్దు వివాదాలపై కొందరు ఫిర్యాదులు చేశారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో కొంతమంది రైతులకు 1బీ, అడంగళ్‌ పత్రాలకు ఆన్‌లైన్‌లో రావడం లేదని, బ్యాంకు రుణాలకు ఇబ్బందులు పడుతున్నట్లు పలువురు చెబుతున్నారు. రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల జారీతోపాటు సర్వే లోపాలు.. సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని