logo

సహకార సంఘాల ప్రక్షాళన షురూ..!

సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది.

Published : 03 Jul 2024 04:23 IST

న్యూస్‌టుడే, అమలాపురం కలెక్టరేట్‌

కాకినాడ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయం

సహకార సంఘాల్లో ప్రక్షాళన దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా మొదటి దశ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటివరకు వైకాపా ప్రభుత్వ హయాంలో పాలన సాగించిన త్రిసభ్య కమిటీలను రద్దు చేసి వాటి స్థానంలో పర్సన్‌ ఇన్‌ఛార్జి వ్యవస్థను కూటమి ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. వీరి కాలపరిమితి ఆరు నెలలుగా నిర్ణయించారు. దీంతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు(పీఏసీఎస్‌), డీపీఎంఎస్, డీసీసీడీలు అధికారులు నియంత్రణలోకి వెళ్లనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

డీసీసీబీ, డీసీఎంఎస్‌ పీఐగా కాకినాడ జేసీ..

జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ(డీసీఎంఎస్‌)లకు కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి పర్సన్‌ ఇన్‌ఛార్జిగా నియమించారు. గతంలో తెదేపా ప్రభుత్వంలో డీసీసీబీకి కలెక్టర్‌ పీఐగా వ్యవహరించే వారు. ఈ సారి ఆ బాధ్యతలను జేసీలకు అప్పగించారు. ఆయన ఈ బాధ్యతలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. సహకార శాఖలో పనిచేసే సహాయ రిజిస్ట్రార్, సీనియర్, జూనియర్‌ ఇన్‌స్పెక్టర్లను సొసైటీల పీఐలుగా నియమించారు. వీరంతా గత నెల 29న వారికి కేటాయించిన పీఏసీఎస్‌లలో ఛార్జి తీసుకున్నారు.

అయిదేళ్లు వైకాపా కార్యాలయాలుగా..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 303 పీఏసీఎస్‌లున్నాయి. గతంలో తెదేపా ప్రభుత్వం అధికారంలో ఉండగానే వీటికి ఎన్నికలు నిర్వహించారు. అప్పటి పాలకవర్గాల కాలపరిమితి 2018లోనే ముగిసింది. పాత పాలక వర్గాలనే కొనసాగించారు. 2019లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పార్టీ నాయకులు, కార్యకర్తలకు వీటిలో నామినేటెడ్‌ పదవులు ఇచ్చేందుకు త్రిసభ్య కమిటీలను తెరపైకి తీసుకువచ్చింది. డీసీఎంస్, డీసీసీబీలకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీలు ఏర్పాటయ్యాయి. దీంతో సహకారశాఖ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలు వైకాపా పార్టీ కార్యాలయాలుగా మార్చి వేశారు.

సేవలు శూన్యం

రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయ సహకార పరపతి సంఘాలు ఏర్పాటయ్యాయి. వైకాపా పాలనలో ఇవి అంకారప్రాయంగా మిగిలిపోయాయి. కనీసం వీటినుంచి రైతులకు సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో అందలేదు. గతంలో వీటికి అధ్యక్షులుగా గ్రామంలో ఉన్న రైతులే ఉండేవారు. వైకాపా వ్యవసాయేతర వ్యక్తులను వీటికి ఛైర్మన్లుగా నియమించింది. వారికి వ్యవసాయంపై కనీస అవగాహన లేకపోవడంతో వచ్చి ఛైర్మన్‌ కుర్చీలో కూర్చుని వెళ్లిపోయేవారు. జిల్లాలో పలు సహకార సంఘాల్లో అవకతవకలు కూడా చోటుచేసుకున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సహకారశాఖ ఆధ్వర్యంలో ఉన్న సొసైటీలు పూర్వ వైభవాన్ని సంతరించుకోనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటికి త్వరలోనే ఎన్నికల జరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని