logo

నిధులు రావాల.. బాగుపడాల

వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి.

Published : 03 Jul 2024 04:22 IST

జిల్లాలో గుంతలుపడిన ర.భ.శాఖ రహదారులు 248 కిలోమీటర్లు
మరమ్మతులకు రూ.14.99 కోట్లు అవసరం

అధ్వానంగా పోతవరం గణేష్‌నగర్‌-కె.ఏనుగుపల్లి ర.భ.శాఖ రహదారి

పి.గన్నవరం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం రహదారుల అభివృద్ధిని విస్మరించడంతో అవి ఏటేటా క్షీణదశకు చేరుకుని అత్యంత దారుణంగా తయారయ్యాయి. గుంతలుపడి వర్షపునీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. అలాంటి రహదారులకు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాలంటే సుమారు రూ.400 కోట్ల నిధులు కావాలి. ఇంత మొత్తం ఇప్పటికిప్పుడు మంజూరు కావడం అంత సులువైన పనికాదు. ఈ నేపథ]్యంలో ర.భ.శాఖకు చెందిన ఇంజినీరింగ్‌ అధికారులు ఆయా రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేయాలని, అందుకోసం రూ.14.99 కోట్ల నిధులు అవసరం అవుతాయని తాజాగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలో 48 కిలోమీటర్ల మేర 12 రాష్ట్ర రహదారులు, 200 కిలోమీటర్ల మేర 70 మేజర్‌ జిల్లా రోడ్లకు తక్షణం ప్రత్యేక మరమ్మతులు చేస్తే ప్రజలకు ప్రస్తుత కష్టాల నుంచి ఉపశమనం కలుగుతుందని గుర్తించి ప్రతిపాదించారు.

టెండర్లు పిలిచినా...

ఇక టెండర్లు ఖరారై పనులు మొదలుపెట్టని రహదారులు మరికొన్ని ఉన్నాయి. పి.గన్నవరం నియోజకవర్గంలో రూ.36కోట్ల విలువైన ప్యాకేజీతో ర.భ.శాఖకు చెందిన వివిధ రహదారులు అభివృద్ధి చేసేందుకు ఆరునెలల క్రితమే టెండరు ఖరారైంది. దీంట్లో అంబాజీపేట-గన్నవరం స్టేట్‌ హైవే ఒకటి. ఇది అత్యంత దారుణంగా తయారైంది. వర్షాలకు మడుగును తలపిస్తోంది. ఈ పనిని ఇటీవల ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పి.గన్నవరంలో ప్రారంభించారు. బోడపాటివారిపాలెం నుంచి అంబటివారిపాలెం, గంగలకుర్రు, ముక్కామల తదితరప్రాంతాల్లో మరికొన్ని రహదారులు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. ప్రధానంగా వైకాపా ప్రభుత్వంలో చేసిన పనులకు కోట్లాది రూపాయిల బిల్లులు చెల్లించని కారణంగా ఈ పనులు చేసేందుకు గుత్తేదారుడు ముందుకు రావడంలేదని తెలిసింది. 

అంబాజీపేట-గన్నవరం ర.భ.శాఖ రహదారి

రాష్ట్ర రహదారుల్లో కొన్ని...

కాట్రేనికోన-చల్లపల్లి(10 కిలోమీటర్లు), రాజవరం-పొదలాడ రోడ్డు గోపాలపురం నుంచి  రాజవరం (7కిలోమీటర్లు), ద్వారపూడి-యానాం రోడ్డు మండపేట నుంచి రామచంద్రపురం (3.50కిలోమీటర్లు), రామచంద్రపురం- పెనుగుదురు (3 కిలోమీటర్లు), సోమేశ్వరం-రాజానగరం(4.50కిలోమీటర్లు)  ఇలా వివిధ రహదారులు దెబ్బతిన్నాయి.

మేజర్‌ జిల్లా రహదారుల్లో కొన్ని... పామర్రు-ఉంట్రుమిల్లి (10కిలోమీటర్లు), యర్రపోతవరం-కె.ఎన్‌.ఎఫ్‌.రోడ్డు (5.70 కిలోమీటర్లు), గూడపల్లి-కేశనపల్లి (6కిలోమీటర్లు), రాజోలు-పొన్నమండ (6 కిలోమీటర్లు), సఖినేటిపల్లి-అంతర్వేది (6 కిలోమీటర్లు), పోతవరం గణేష్‌నగర్‌-కె.ఏనుగుపల్లి (4.42కిలోమీటర్లు) ఇలాంటి రహదారులు 70 వరకు గుంతలుపడి అధ్వానంగా మారాయి.

ప్రత్యేకంగా పనులకు ప్రతిపాదించాం

వివిధ రహదారులకు ప్రత్యేక మరమ్మతులు చేసేవిధంగా పనులు ప్రతిపాదించాం. రూ.15 కోట్ల నిధులు కావాలి. టెండరు ఖరారైన రూ.36 కోట్ల ప్యాకేజీలో అంబాజీపేట-గన్నవరం రహదారి పనులను ముందుగా పి.గన్నవరం నుంచి స్థానిక పోలీసుస్టేషన్‌వరకు సిమెంట్‌ రహదారిగా అభివృద్ధిచేస్తాం. ఈ పనులు త్వరలో మొదలుపెడతాం.

జి.రాజేంద్ర, డీఈఈ, ర.భ.శాఖ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని